Monday, April 29, 2024

మూడోదశ క్లినికల్స్‌కు సిద్ధమవుతున్న కోవాగ్జిన్ టీకా

- Advertisement -
- Advertisement -

Covaxin vaccine Phase 3 trial

హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్స్‌కు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా నవంబరు నెలలో ఈ ప్రయోగాలు ప్రారంభం కానున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది. 25 కేంద్రాల్లో సుమారు 28,500 మందికిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈమేరకు డ్రగ్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఇండియా(డిసిజిఐ) కూడా అనుమతించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేయగా, మూడో దశను కూడా వేగంగా నిర్వహిస్తామని భారత్ బయోటెక్ సంస్థ అభిప్రయపడింది. ఇప్పటికే వాలంటీర్లతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ పేర్కొంది.

అయితే జంతువులతో పాటు మనుషులపై జరిగిన మొదటి, రెండవ దశ క్లినికల్స్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేయగా, మూడో దశలో కూడా సత్ఫలితాలు వస్తాయని బయోటెక్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా క్లినికల్ ట్రయల్స్ తొలి దశ సందర్బంగా నిమ్స్‌లో 45 మందికి, రెండో దశలో 55 మందికి టీకాలు ఇవ్వగా, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాంటీబాడీలు కూడా అభివృద్ధి చెందినట్లు వెల్లడించారు. మొదటి, రెండో దశ కలిపి సుమారు100 మంది వాలంటీర్లు భాగస్వామ్యం కాగా అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు సంభవించలేదని తెలిపారు.

వీరందరి ఆరోగ్యంపై దాదాపు ఆర్నెల్ల పాటు పర్యవేక్షణ కొనసాగుతుందని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ అధికారులు పేర్కొన్నారు. అయితే మూడో దశ పరీక్షల్లో భాగంగా నిమ్స్‌లో మరో 200 మందికి టీకా ఇచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. వీరిలో 18 ఏళ్లు దాటిన వారిని మాత్రమే ఎంచుకొని ట్రయల్స్ నిర్వహిస్తామని సంస్థ పేర్కొంది. ఢిల్లీ, ముంబై, పట్నా, లక్నో తదితర నగరాల్లో ఈ ట్రయల్స్ జరుగుతాయని బయోటెక్ సంస్థ తెలిపింది. అయితే మూడవ దశ ట్రయల్స్ విజయవంతమైన వెంటనే వ్యాక్సిన్ ఏ క్షణమైనా మార్కెట్లోకి రావోచ్చని భారత్ బయోటెక్ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News