Monday, April 29, 2024

గైడ్‌లైన్స్ అమలులో లోపాల వల్లే దావాగ్నిలా వ్యాపిస్తున్న కరోనా

- Advertisement -
- Advertisement -

COVID-19 is world war has spread like wildfire

ఇది ప్రపంచ యుద్ధమే
లాక్‌డౌన్‌పై ముందస్తు ప్రకటన లేదు..
ప్రజలు జాగ్రత్త పడటానికి సమయం లేదు
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు విశ్రాంతి అవసరం
సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కొవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల అమలులో లోపాల కారణంగానే కరోనా వైరస్ దావాగ్నిలా దేశమంతా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపిలు) అమలులో లోపాల వల్లే ఈ ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని సుప్రీంకోర్టు తెలిపింది. కొవిడ్-19ను ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ యుద్ధం గా అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించింది.
అనూహ్యంగా విరుచుకుపడిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో వేదన అనుభవిస్తున్నారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కర్ఫూ లేదా లాక్‌డౌన్ విధింపునకు సంబంధించిన నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. అలా చేసి ఉంటే ప్రజలు ముందుగానే అప్రమత్తులై తమ జీవనోపాధికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని ఉండేవారని ధర్మాసనం తెలిపింది.

గత ఎనిమిది నెలలుగా అవిశ్రాంతంగా సేవలందచేస్తున్న డాక్టర్లు, నర్సులతోసహా ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఇప్పటికే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయారని, వారికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో ప్రతి రాష్ట్రం సామరస్యంగా, అప్రమత్తతతో నడుచుకోవలసి ఉంటుందని ధర్మాసనం సూచించింది. పరిస్థితికి అనుగుణంగా స్పందించాల్సిన తరుణమిదని, ఇతర విషయాలను పక్కనపెట్టి ప్రజల ఆరోగ్య రక్షణే తొలి ప్రాధాన్యత కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కొవిడ్-19 మార్గదర్శకాలు, ఎస్‌ఓపిల దేశవ్యాప్త అమలుకు కొన్ని ఆదేశాలను కోర్టు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News