Friday, April 26, 2024

ఒక బిహారీ… పది హత్యలు…

- Advertisement -
- Advertisement -

CP Ravindar press meet on warangal deaths

 

ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు

మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో తొమ్మిది మృతదేహాలు లభ్యం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన విషయం తెలిసిందే. ఒక హత్యను కప్పిపుచ్చేందుకు నిందితుడు తొమ్మిది మందిని పథకం ప్రకారం హతమార్చాడు. బీహార్ రాష్ట్రంలోని బిగుసరయి జిల్లా మర్లాపూర్ గ్రామానికి నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ వెల్లడించారు. సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఆయన కథకం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని ఓ పాడుబడ్డ బావిలో మహ్మద్ మసూద్ అలం, అతని భార్య నిషా అలం, అతని కుమార్తె బుస్రా, బుస్రా కుమారుడు బబ్లూ, మసూద్ పెద్ద కుమారుడు షాబాద్, చిన్నకుమారుడు మహేల్, మసూద్‌తో పాటు గోనెసంచుల పరిశ్రమలో పనిచేసే శ్యాంకుమార్, శ్రీరాంకుమార్, మహ్మద్ షకీల్ తదితరులను నిందితుడు సంజయ్‌కుమార్ మత్తుమందు కలిపి హత్య చేశాడని సిపి రవీందర్ తెలిపారు. బిహార్ రాష్ట్రంలోని మర్లాపూర్ గ్రామానికి చెందిన సంజయ్‌కుమార్ యాదవ్ ఆరేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వరంగల్‌కు వచ్చి లేబర్‌కాలనీ శివారులోని జాన్‌పాకలో నివాసం ఉంటున్నాడు. సంజయ్‌కుమార్ యాదవ్ మిల్స్‌కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనెసంచుల తయారీ కేంద్రంలో పని చేస్తున్నప్పుడు అక్కడే పనిచేస్తున్న మృతుడు మసూద్ అలం, అతడి కుటుంబసభ్యులతో పరిచయమైంది.

– రైల్లో నుంచి తోసి రఫీక హత్య…

మసూద్ కుటుంబంతో పరిచయం పెంచుకున్న సంజయ్‌కుమార్‌యాదవ్ మసూద్ భార్య నిషా అక్క కూతురు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రఫీకతో(37) పరిచయమైంది. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్న రఫీకాతో సంజయ్‌కుమార్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్న రఫీకా ఇంటికి దగ్గరలో జాన్‌పాక ప్రాంతంలో ఇల్లు కిరాయికి తీసుకొని రఫీకాతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో రఫీకా కుమార్తెతో నిందితుడు సంజయ్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో రఫీకాకు సంజయ్‌తో గొడవలు మొదలయ్యాయి. అయినప్పటికి సంజయ్ తన పద్ధతి మార్చుకోకుండా రఫీకా కుమార్తెతో సన్నిహితంగా ఉంటుండడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించింది. దీంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని సంజయ్‌కుమార్ నిర్ణయించుకున్నాడు.

నిందితుడు సంజయ్‌కుమార్ తమ బంధువులతో మాట్లాడేందుకు పశ్చిమబెంగాల్‌కు వెళుదామని రఫీకాను తీసుకొని గత మార్చి 6వ తేదీన విశాఖపట్నం వైపుకు వెళ్లే గరీభ్థ్ రైలు ద్వారా వరంగల్ నుంచి రాత్రి పది గంటలకు బయలుదేరి వెళ్లాడు. నిందితుడు రైలులో ప్రయాణించే మార్గంలో మజ్జిగ ప్యాకెట్లను కొనుగోలు చేసి తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫీకాకు అందించాడు. నిద్రమాత్రలు ఉన్న మజ్జిగ తాగిన రఫీకాతో నిందితుడు సంజయ్‌ట్రైన్స్ పుట్‌బోర్డు వద్ద కూర్చొని ముచ్చటించుకున్నారు. సుమారు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో నిడుదవ్రోలు వద్ద నిందితుడు సంజయ్‌కుమార్ తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం మత్తులో ఉన్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతుబిగించి చంపి రైలు నుంచి కిందకు తోసేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సంజయ్‌కుమార్ రఫీకా చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో దిగి తిరిగి మరో రైలులో వరంగల్‌కు చేరుకున్నాడు.

– రఫీకా ఆచూకీపై నిలదీసిన నిషాఅలం..

వరంగల్‌కు చేరుకున్న నిందితుడు సంజయ్‌కుమార్ రఫీకా పశ్చిమబెంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లినట్లుగా ఆమె పిల్లలను నమ్మించాడు. కొద్దిరోజుల అనంతరం తన అక్కకూతురు రఫీకా తమ బంధువుల ఇండ్లలో లేదని, రఫీకా ప్రస్తుతం ఎక్కడ ఉందని మసూద్ అలం భార్య నిషాఅలం నిందితుడిని గట్టిగా అడగడంతో పాటు పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించింది. దీంతో ఖంగుతున్న నిందితుడు ఏదోవిధంగా పోలీసులకు చిక్కుతానని భయపడి మసూద్‌అలం, భార్య నిషాఅలంను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళికను రూపొందించుకున్నాడు. ప్రణాళికను అమలు పర్చడంలో భాగంగా గత 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిందితుడు మసూద్ అతని కుటుంబం గొర్రెకుంటలో పని చేస్తున్న గోనెసంచుల తయారీ గోదాంకు రోజు క్రమం తప్పకుండా వస్తుపోతున్న సమయంలో నిందితుడు గోదాం చుట్టూ పక్కల పరిసరాలను కూడా పరిశీలించేవాడు. చివరకు మసూద్‌అలం, భార్య నిషాఅలంను చంపి గోదాం పక్కనే ఉన్న పాడుపడ్డబావిలో పడవేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు ఈనెల 20వ తేదీన మసూద్ మొదటి కుమారుడైన షాబాజ్ అలం పుట్టిరోజు అని తెలియడంతో అదేరోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈనెల 18వ తేదీన నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో సుమారు 60కి పైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు.

– నిద్రమాత్రలతో మృత్యుకాండ..

అనుకున్న పథకం ప్రకారం నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్ ఈనెల 20వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకొని మృతులతో చాలా సేపు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా ఉన్న సమయంలో నిందితుడు మృతులకు తెలియకుండా మసూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంతో పాటు మృతులైన శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలో కూడా వారికి తెలియకుండా సంజయ్‌కుమార్ తనతో పాటు తెచ్చుకున్న నిద్రమాత్రలు కలిపాడు. ఈ భోజనం తిని మసూద్ తన భార్య నిషాఅలం, కూతురు బుస్రా కాటూన్, కుమారులు షాబాజ్ అలం, సుహేల్‌అలం, మనుమడు ఇదే గోదాంలో నివాసం ఉంటున్న శ్యాం, శ్రీరాం, మహ్మద్ షకీల్‌లు మత్తులోకి జారుకోవడంతో నిందితుడు సాక్షం లేకుండా ఉండాలనే ఆలోచనతో మత్తులో ఉన్న అందరిని చంపాలని నిర్ణయించుకొని సుమారు అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య సమయంలో తొమ్మిది మందిని గోదాం పక్కనే ఉన్న పాడుబడ్డ బావి వద్దకు తరలించి బావిలో పడవేసి , వారందరూ చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం మృతుల గదుల నుంచి వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసిన కిరాణ సామానుతో పాటు వారి సెల్‌ఫోన్లను తీసుకొని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు.

ఈ సంఘటనపై గీసుకొండ పోలీసులు కేసును నమోదు చేయడంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలు నిర్వహించిన దర్యాప్తులో గోదాం, గొర్రెకుంట ప్రాంతంలోని సిసి కెమెరాల దృశ్యాలను ఆధారంగా చేసుకొని నిందితుడు సంజయ్‌ను గుర్తించిన దర్యాప్తు బృందాలు సోమవారం మధ్యాహ్నం జాన్‌పాకలో అరెస్టు చేశారు. ఈ హత్యలు తానే చేసినట్టు నిందితుడు సంజయ్‌కుమార్ అంగీకరించినట్టు సిపి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో శ్రమించిన ఈస్ట్ ఇన్‌చార్జ్ డిసిపి వెంకటలక్ష్మి, మామునూరు ఎసిపి శ్యాంసుందర్, గీసుకొండ ఇన్స్‌పెక్టర్ శివరామయ్య, పర్వతగిరి ఇన్స్‌పెక్టర్ కిషన్, టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైం, ఐటికోర్, సిసిఎస్, టీం ఇన్స్‌పెక్టర్లు నందిరాంనాయక్, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, రమేష్‌కుమార్‌తో పాటు ఇతర సిబ్బందిని సిపి రవీందర్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News