Saturday, April 27, 2024

డార్విన్ సిద్ధాంతమే సత్యం

- Advertisement -
- Advertisement -

Darwin's theory is the truth

ఫిట్టెస్ట్ ఆఫ్‌ది ఫిట్ విల్ సర్వైవ్ అనేది సైన్సు సూత్రం. అంటే వాతావరణ, భౌగోళిక, శాస్త్ర సంబంధమైన పరిస్థితులకు అణుగుణంగా తనను తాను దిద్దుకున్నప్పుడు మాత్రమే ఏ జీవరాశైనా భూగోళంపై మనుగడ కొనసాగింపగలుగుతుంది. సూర్యుడి నుండి విడివడ్డ అగ్నిగోళం కోట్ల సంవత్సరాలుగా మండిమండి చల్లారి భూమిపై గాలి, నీరు, తినగలిగే పదార్థాలు లభించింతర్వాతే, అనుకూల వాతావరణం ఏర్పడింతర్వాతే భూమిపై జీవరాశుల మనుగడ సాధ్యమైంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంను అనుసరించి అమీబా దశ నుండి క్రమక్రమంగా ఏకకణ, ద్వికణ, బహుకణ జీవులుగా క్రమపరిణామం చెందుతూ చింపాంజి, కోతి దశల నుండి నాలుగు కాళ్ళ జంతువు దశనుండి రెండు కాళ్ళు నడవడానికి, రెండు చేతులుగా పని చేయడానికి ఉపయోగిస్తూ మనిషిగా మారాడు. ఇలాంటి మనిషి ప్రపంచంలోనే మొట్టమొదటగా దర్శనమిచ్చింది ఆఫ్రికాఖండంలో ఏడు లక్షల సంవత్సరాల క్రితమని ఒకవాదముంటే మూడు లక్షల సంవత్సరాల క్రితమని మరో వాదముంది. ఆఫ్రికాఖండం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ. అందువల్ల అక్కడి మనుషులంతా నలుపు రంగులోనే ఉంటారు. అంటే భూగోళం పై మానవజాతి పుట్టుక నలుపురంగు మనిషితో ప్రారంభమైంది.

ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితుల ననుసరించి వివిధ దేశాల్లో, వివిధ ఖండాల్లో జంతుజాలం, పక్షులు, చెట్లు, ఇతర జీవరాశులు పుట్టుకొచ్చాయి. ప్రకృతిని ప్రకృతిగా ఉంచుతూనే ఆది మానవులు తాము బతకడానికి అవసరమైన ఆహార పదార్థాలను వెతుక్కున్నారు. శిలాయుగాలు, లోహ యుగాలు దాటి అభివృద్ధి జరిగింది. తర్వాత రాజ్యాలు, అధికారం ఏర్పడటం మొదలైంది. శ్వేతజాతి నల్లజాతిపై అధికారం చలాయించడం ప్రారంభమైంది. సుఖలాలసత పెరిగింది. గత ఐదారువేల సంవత్సరాల నుండి ఒకజాతిని మరొక జాతి ఒక మనిషిని మరొక్క మనిషీ పీడించే సాంఘిక ధర్మం వచ్చింది. మూలజాతులైన నల్లజాతులను బానిసలను, సేవకులను భారతదేశంలోనైతే అంటరానివాళ్లను చేయడం జరిగింది. స్వంత ఆస్తి భావన, అధికార దాహం పెరుగడంతో అమానవీయ ధోరణి పెరిగింది. క్రమక్రమంగా ప్రకృత విధ్వంసమూ పెరిగింది. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, గ్లోబల్ వామింగ్, అడవుల నరికివేత, పద్ధతిలేని పారిశ్రామికీకరణతో ప్రకృతి వినాశనమైంది.

ఓజోన్ పొరకు రంధ్రాలుపడ్డాయి. అనేక జీవరాశులు కనుమరుగయ్యాయి. ప్రపంచీకరణ, కమ్సామరిజం ప్రవేశంతో మరింత వినాశనం జరిగింది. అగ్రరాజ్యాధిపత్యం పోటీ మానవత్వాన్ని మంటగలిపింది. ప్రజాస్వామ్యదేశమని చెప్పుకునే అమెరికా, సోషలిస్టు దేశమనే రష్యా, కమ్యూనిస్టు చైనా, ఇతరదేశాలు కూడా పోటాపోటీగా ఆయుధాలను పెంచి ప్రపంచాన్ని ఆయుధగారంగా మార్చారు. ఆర్థిక, ఆధిపత్య పోటీ వినిమయ సంస్కృతిని పెంచి వనరుల విధ్వంసంతో పాటు ప్రకృతి విధ్వంసమూ పెరిగింది. పరిశ్రమల ఉద్గారాలతో, మనిషి సుఖవాంఛా చర్యలతో, అణుబాంబు ప్రయోగాలతో గ్లోబల్ వామింగ్ పెరిగింది. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితులొచ్చాయి.

పరిస్థితులిలాగే కొనసాగితే ఈ భూగోళంపై జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుందని, హిమాలయాలు, అంటార్కిటికా ప్రాంత మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి ఉన్న కాస్త భూభాగం నీటి పాలవుతుందనీ శాస్త్రవేత్తలు చెప్పారు. మనిషి మరో గ్రహాన్ని వెతుక్కునే అవసరం ఉందని కూడా హెచ్చరించారు. ఎవరెన్ని చెప్పినా శ్వేత జాతీయుల ఆధిపత్య, సామ్రాజ్యవాద కాంక్ష తగ్గలేదు. చైనా లాంటి దేశాలు కూడా దురాక్రమణ భావజాలాన్ని విడులవలేదు. అణ్వస్త్ర దేశాలుగా నిరూపించుకోవడానికి పోటాపోటీ జరుగుతుంది. పారిస్ వాతావరణ ప్రకృతి సంరక్షణ ఒప్పందాన్నీ సులభంగానే తీసుకున్నారు. భూగోళాన్ని మరణశయ్యపైకి నెట్టారు. వీటన్నిటి ఫలితంగానే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ పుట్టుకురావడం. పరిస్థిలులిలాగే కొనసాగితే ఇంతకంటె భయంకరమైన వైరస్‌లు రావచ్చు. ఆక్సిజన్ మాస్క్‌లు లేకుండా మనిషి జీవించలేని దుస్థితీ రావచ్చు. ఇలాంటి సమయంలోనూ ఈ వైరస్ చైనా ఉత్పత్తి చేసి ప్రపంచం పైకి వదిలిందని అమెరికా, అమెరికానే ఆ పని చేసిందని చైనా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

మానవ జీవితం నిరంతర పోరాటాలమయమే. ప్రకృతితో, అనేక సమస్యలతో పోట్లాడి అనేక ఆవిష్కరణలు చేశాడు. ఆ మనిషి చేసిన ప్రకృతి విరుద్ధ చర్యలే మనిషి మనుగడనే ప్రమాదంలోకి నెడుతుంది. గత 4, 5 వందల ఏండ్లుగా జరిగిన, జరుగుతున్న విధ్వంసం లక్షల, కోట్ల ఏండ్ల మానవాభివృద్ధిని సర్వనాశనం చేస్తుంది. ప్రకృతితో పోరాడి ఫిట్టెస్ట్ ఆఫ్‌ది ఫిట్ సర్వైవ్‌ను జయించి నిలిచిన మనిషి ఇప్పుడు తాను ఈ భూగోళంపై మనుగలగడానికి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి వస్తుంది. అనంత విశ్వంలో మనిషి, జీవరాశులు జీవించగలిలే గ్రహం భూమి ఒక్కటి మాత్రమే అయితే ఆ జీవరాశులన్నిట్లో మెదడుండి ఆలోచించగలిగే శక్తి ఉన్న జీవి మనిషొక్కడే. ఆ మనిషే నేడు ప్రమాదంలోపడ్డాడు. కరోనా వైరస్ బారి నుండి కొన్ని నెలల్లో తప్పించుకోవచ్చు కాని గ్లోబల్ వామింగ్, ఇతర ప్రకృతి విధ్వంసాల నుండి తప్పించుకోవడం కష్టం. అందుకు పరిష్కారమార్గం ప్రకృతి విధ్వంసాన్ని ఆపడం, ప్రకృతితో సహజీవనం చేయడమొక్కటే మార్గమని కరోనా వైరస్ గుణపాఠం నేర్పుతుంది.

మనిషి ఫిట్టెస్ట్ దశను విధ్వంసం చేసింది ముఖ్యంగా శ్వేతజాతి పాలకవర్గాలు, ఇతర దేశాల పాలకవర్గాల అధికార లాలసత, ఆధిపత్య భావజాలం, సుఖవాంఛ.. లాంటి వాటితో జరిగిన ప్రకృతి విధ్వంసం. అందుకు శిక్షగా గ్లోబల్ వార్మింగ్ వల్ల శ్వేతజాతి మనగలిగే పరిస్థితులు మృగ్యమని, దాన్ని మరికొంతకాలమైనా భరించగలిగే శక్తి నల్లజాతివారికుందని సైన్సు చెబుతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం శీతల దేశాలలో విపరీతంగా ఉంటే ఊష్ణ దేశాలలో కొంత తక్కువుంది. కృత్రిమ ఆహార అలవాట్లకు, శీతల పానీయాలకు అలవాటుపడ్డ అమెరికా, యూరోపు దేశాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటే ఊష్ణ దేశాలు, ప్రకృతి సిద్ధ ఆహారం తీసుకునే ప్రాంతాలలో తక్కువగా ఉంది. సుఖవాంఛ, భోగలాలసత ఉన్న కృత్రిమ జీవన నగరాల్లో ఉన్నంత తీవ్రత ప్రకృతిని ప్రేమించే గ్రామాల్లో లేదు. అంటే ఫిట్టెస్ట్ ఆఫ్‌ది ఫిట్ గా నిలబడి మనగలిగే స్వభావం శ్వేత జాతికంటె నల్లజాతికి, పట్టణాల్లో కంటె పల్లెల్లో ఎక్కువుందని అర్థమవుతుంది. వివిధ దేశాల పాలక వర్గాలు ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.

దేశాలనేలే పాలకులైనా, నాయకులైనా, ట్రిలియనీర్లయినా, సినీ ప్రముఖులైనా, నియంతలైనా, సామాన్య మానవులైనా, మేధావులైనా, శ్వేతజాతైనా, నల్లజాతైనా కంటికి కనిపించని వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. అంటే ప్రకృతిముందు అంతా దిగదుడుపేనని అర్థమవుతుంది. అందువల్ల అభివృద్ధి అనేది మనిషి మనుగడను భూగోళంపై రక్షించుకునే దిశగా సాగాలి. కాని ప్రకృతి విధ్వంసం చేసే అణ్వస్త్రాల యుద్ధసామగ్రి తయారీ, వాతావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలు, టెర్రరిజం, మనుషుల విడదీసే సిద్ధాంత రాద్ధాంతాలు, యుద్ధాల వైపు కాదు.

ప్రపంచ దేశాలన్నీ సిద్ధాంత, ఆధిపత్య, కుల జాతి మత సంబంధ, వైరుధ్యాలను పక్కనబెట్టి కరోనా నెదుర్కొంటే, ఒకరికొకరు సహకరించుకుంటే అసాధ్యమేం కాదు. ఆ తర్వాత జాతి, మత, దేశ, ఖండ… సరిహద్దుల కతీతంగా ప్రకృతి విధ్వంసాన్ని ఆపి మనిషి కేంద్రంగా అభివృద్ధి పథక రచన చేయాలి. 500 సంవత్సరాల క్రితం నాడున్న ప్రకృతి సిద్ధ భూగోళాన్ని ఆవిష్కరించుకుంటే తప్ప మానవజాతి ఫిట్టెస్ట్ ఆఫ్‌ది ఫిట్ విల్ సర్వైవ్ సైన్సు సూత్రాన్ని ఎదుర్కొని నిలబడటం కష్టం.

 

డా॥కాలువ మల్లయ్య,  9182918567

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News