Saturday, April 27, 2024

ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!

- Advertisement -
- Advertisement -

Dharmendra Pradhan blames Congress for petrol, diesel prices hike

 

చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలకు దిగుమతుల మీద ఆధారపడటం, గత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లే అని మరోసారి చెప్పారు. కాంగ్రెస్ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని చెప్పుకున్న పార్టీకి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటి అని ఎవరికైనా తట్టిందా? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటం కదా!

ఇంతకీ గత ఏడు సంవత్సరాలలో “దేశ భక్తులు” భారతీయ చమురు ఉత్పిత్తిని ఎంత పెంచారో చెప్పగలరా? 2022 నాటికి దేశం చమురు దిగుమతులను పది శాతం తగ్గించాలని 2015లో ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్య నిర్దేశం చేశారు. 2014 15లో మన దేశం వినియోగించే చమురులో 78.6 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. యుపిఎ పాలన చివరి ఏడాది 201314లో మన దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37,788 మిలియన్ టన్నులు. అది 2019 20 నాటికి 32.173 మి. టన్నులకు పడిపోయింది. ఇది పద్దెనిమిది సంవత్సరాలలో కనిష్ట రికార్డు. 202021లో మోడీ సర్కార్ తన రికార్డును తానే తుత్తునియలు గావించి 30.5 మిలియన్ టన్నులకు తగ్గించేసింది. 201920 ఏప్రిల్ ఫిబ్రవరి మాసాల వరకు ఉన్న సమాచారం ప్రకారం విదేశీ దిగుమతుల మీద ఆధారపడింది 86.7 శాతం. ( కరోనా కారణంగా వినియోగం పడిపోయింది కనుక దిగుమతులు కూడా తగ్గి ఇప్పుడు 85 శాతానికి పైగా ఉంది) దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమా బండబడ చెవుల్లో పూలు పెట్టుకొని వినేవాళ్లుండాలే గానీ ఎన్ని పిట్ట కథలైనా వినిపించేట్టున్నారుగా!

ఇదే ధర్మేంద్ర ప్రధాన్ తీరుతెన్నులను చూస్తే లేస్తే మనిషిని గాను అని బెదిరించే కాళ్లు లేని మల్లయ్య కథను గుర్తుకు తెస్తున్నారు. చలికాలంలో చమురు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వేసవి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కూడా మంత్రి సెలవిచ్చారు. తగ్గకపోగా రోజూ పెరుగుతున్నాయి. ఇన్నేండ్లుగా ఉన్న కేంద్ర మంత్రికి మార్కెట్ తీరుతెన్నులు ఆ మాత్రం తెలియదా లేక తెలిసి కూడా జనాన్ని జోకొట్టేందుకు అలా చెబుతున్నారా? ఆదివారం ఉదయం (జూన్ 27) బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర 76.18 డాలర్లు ఉంది, అమెరికా రకం 74.05, మనం కొనుగోలు చేసేది 74.24 డాలర్లు ఉంది. ఇరాన్‌తో ముదురుతున్న అణువివాద నేపధ్యంలో ఎప్పుడైనా 80 డాలర్లు దాట వచ్చన్నది వార్త.

చమురు ఉత్పత్తి దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ధరలను తగ్గించని పక్షంలో “చమురు ఆయుధాన్ని” వినియోగిస్తామని 2015 నుంచీ మంత్రి ప్రధాన్ బెదిరిస్తూనే ఉన్నారు. తాజాగా ఏప్రిల్ నెలలో మాట్లాడు తూ మధ్య ప్రాచ్యదేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చమురు శుద్ధి సంస్ధలను కోరారు. “చమురు అమ్ముకొనే వారికి భారత్ పెద్ద మార్కెట్, వారు మా గిరాకీని, అదే విధం గా దీర్ఘకాలిక సంబంధాలను గమనంలో ఉంచుకోవాలని” బెదిరించారు. సౌదీ తదితర దేశాలను దారికి తెచ్చే పేరుతో ఇప్పటికే అమెరికా చమురు కంపెనీల ప్రలోభాలకు లొంగిపోయి అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయటం ప్రారంభించారు.

నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్ అధికారంలోకి రాక ముందు మన చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 1.2 శాతం మాత్రమే ఉండేది. అలాంటిది ట్రంప్‌తో నరేంద్ర మోడీ కౌగిలింతల స్నేహం కుదిరాక ట్రంప్ దిగిపోయే సమయానికి 4.5 శాతానికి పెరిగింది. మన డాలర్ల సమర్పయామీ, ఆయాసం మిగిలింది తప్ప మనకు ఒరిగిందేమీ లేదనుకోండి. అందుకే మన ప్రధాన్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ పెద్ద మనిషి మాటలకు అంత సీన్ లేదులే, అయినా మా మీద అలిగితే ఎండేది ఎవరికో మాకు తెలుసు అన్నట్లుగా సౌదీ అరేబియా మంత్రిగానీ, అధికారులు గానీ ఖాతరు చేయలేదు. మిగతా దేశాలూ అంతే.

తాజాగా జూన్ 24న ఈ పెద్ద మనిషే చమురు ధరలతో తట్టుకోలేకపోతున్నాం, మా ఆర్ధిక పరిస్ధితి కోలుకోవటం కష్టంగా ఉంది కనికరించండి అన్నట్లుగా చమురు ఉత్పత్తి ఎగుమతి (ఒపెక్) దేశాల సంస్ధకు వేడుకోళ్లు పంపారు. ధరలు సరసంగా ఉంటే మీకూ మాకూ ఉపయోగం ఉంటుంది అని అర్ధం చేసుకోండీ అన్నారు. లీటరు రెండు వందలైనా సరే చెల్లిస్తాం దేశభక్తిని నిరూపించుకుంటాం అంటున్న మోడీ వీరాభిమానుల మనోభావాలను దెబ్బ తీయటం తప్ప ఏమిటంటారు. ( వీరి కోసం కాషాయ పెట్రోలు బంకులను తెరిచి ఆ ధరలకు విక్రయించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి లేదా ప్రతి చోటా కొన్ని ప్రత్యేక బంకులను బిజెపి కార్యకర్తలకే కేటాయించాలి) బెదిరింపులనే ఖాతరు చేయని వారు సుభాషితాలను పట్టించుకుంటారా? నరేంద్ర మోడీ మీరైనా నోరు విప్పండి లేకపోతే ప్రధాన్ నోరై నా మూయించండి! బడాయి మాటలతో చమురు మంత్రి దేశం పరువు గంగలో కలుపుతున్నారు, జనంలో నవ్వులాటలు ప్రారంభమయ్యాయి. వంద రూపాయలు దాటినా నిరసనగా వీధుల్లోకి వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు గానీ అంతిమంగా నష్టపోయేది మీరే, ఆపైన మీ ఇష్టం !

సామాజిక మాధ్యమంలో సంఘ్ పరివార్ (ట్రోల్స్) తిప్పుతున్న ఒక పోస్టర్‌లో మన్మోహన్ సింగ్ సర్కార్ జారీ చేసిన 1.3 లక్షల కోట్ల చమురు బాండ్ల అప్పుడు మోడీ సర్కార్‌ను అప్పుల ఊబిలో దింపిందని గుండెలు బాదుకున్నారు. దానిలో చెప్పిందేమిటి? 2005 నుంచి 2010 వరకు పెట్రోలు ధరలను తక్కువగా ఉంచేందుకు నాటి ప్రభుత్వం చమురు బాండ్లు జారీ చేసింది. ఆ బాండ్లతో చమురు కంపెనీలు రుణాలు తీసుకొనే వీలు కలిగినందున చము రు ధరలను తక్కువగా ఉంచాయి. యుపిఎ కాలం నాటి 20 వేల కోట్ల రూపాయల చమురు బాండ్లను ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. రానున్న ఐదు సంవత్సరాలలో యుపిఎ ప్రభుత్వ బాండ్లకు గాను 1.3 లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. నిరర్దక ఆస్తులు, యుపిఎ అవకతవకలకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం, పన్ను చెల్లింపుదార్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ వాదన ఎంతో వీనుల విందుగా ఉంది కదూ!

ఇందులో చెప్పని, మూసిపెట్టిన అంశం ఏమంటే వాజ్‌పేయ్ నాయకత్వంలోని ఎన్‌డియే ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది. చమురు వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలకు చెల్లించాలి. గతంలో అలాంటి సబ్సిడీల సొమ్మునే చెల్లించలేక సమర్ధ వాజ్‌పేయ్, అసమర్థ మన్మోహన్ సింగ్ సర్కార్‌లు బాండ్ల రూపంలో (జనం ఎవరికైనా అప్పు పడితే ప్రామిసరీ నోట్లు రాసిస్తారు కదా) ఇచ్చా రు. వారందరినీ తలదన్ని 56 అంగుళాల ఛాతీ గలిగిన నరేంద్ర మోడీ ఎవడొస్తాడో రండి అంటూ పూర్తిగా సబ్సిడీ ఎత్తి వేశారు.

మన్మోహన్ సింగ్ “చెడు” రోజులు చివరిలో లేదా నరేంద్ర మోడీ “మంచి రోజుల” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ. 9.48, 3.56 చొప్పున ఉంటే తరువాత ఇప్పుడు రూ.32. 98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. లీటరు మీద ఒక రూపాయి పన్ను లేదా ధర పెంచినా కేంద్రానికి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. నరేంద్ర మోడీ ఎంత గొప్ప వ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం. సరే బిజెపి వారు చెబుతున్నట్లుగా గతంలో ఇచ్చిన సబ్సిడీలను జనం నుంచి వసూలు చేసేందుకే పన్ను విధించారని అంగీకరిద్దాం. రాబోయే ఐదు సంవత్సరాలలో వడ్డీతో సహా 1.3 లక్షల కోట్ల మేరకు అదనపు భారం పడింది కనుక, నరేంద్ర మోడీ అంత మొత్తాన్ని సర్దుబాటు చేయలేని అసమర్ధతతో ఉన్నారు కనుక మనం తీసుకున్నదాన్ని మనమే చెల్లిద్దాం.

కానీ మన నుంచి వసూలు చేస్తున్నది ఎంత? జేబులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిద్దామా? మన తేల్ మంత్రి మెదయ్ ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన సమాచారం ప్రకారం 2013 లో పెట్రోలు, డీజిలు మీద యుపిఎ సర్కార్ వసూలు చేసిన పన్ను మొత్తం రూ. 52,537 కోట్లు, అది 2019 20 నాటికి 2.13 లక్షల కోట్లకు చేరింది. ఆ మొత్తం 202021 ఆర్ధిక సంవత్సరంలో పదకొండు నెలలకు రూ. 2.94లక్షల కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రాబోయే 1.3 లక్షల కోట్ల మన్మోహన్ సింగ్ అప్పు చెల్లించటానికి గాను మన నరేంద్ర మోడీ ఇప్పటికి వసూలు చేసిన కొన్ని లక్షల కోట్లను పక్కన పెడితే, పన్నులేమీ తగ్గించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు కనుక ఏటా మూడు లక్షల కోట్ల వంతున వచ్చే ఐదేండ్లలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నారు.

ఇదే విషయాన్ని “ దేశద్రోహులు” ప్రశ్నిస్తే లడఖ్ సరిహద్దుల్లో మిలిటరీ ఖర్చుకు, చైనాతో యుద్ధ సన్నాహాలకు మనం చెల్లించకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ మరుగుజ్జులు వెంటనే కొత్త పల్లవి అందుకుంటారు. పోనీ ఆ పేరుతోనే పన్ను వేయమనండి! బిజెపి వారి ఆదర్శం ఔరంగజేబు విధించాడని చెబుతున్నట్లు జుట్టు పెంచితే పన్ను, తీస్తే పన్ను అన్నట్లుగా ఏదో ఒక పేరుతో వేయమనండి. మధ్యలో మన్మోహనెందుకు, కాంగ్రెస్ ఎందుకు? చిత్తశుద్ది, నిజాయితీ లేని బతుకులు! జనం పట్టించుకోకపోతే ఇవే కబుర్లు పునరావృతం అవుతాయి మరి !

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News