Thursday, May 16, 2024

ఒక్కో గ్రామంలో వెయ్యి ఎకరాలకు మించకుండా…

- Advertisement -
- Advertisement -

డిజిటల్ ల్యాండ్ సర్వేకు తొలి విడతలో 16 గ్రామాల ఎంపిక !
గజ్వేల్ నుంచి మూడు గ్రామాలు
టెండర్‌లో పాల్గొన్న 29 ఏజెన్సీలు
ధరణి పోర్టల్ ఆధారంగా భూ సర్వే

Land Surveying

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ ల్యాండ్ సర్వేకు తొలి విడతలో 16 గ్రామాల ఎంపిక పూర్తయినట్టుగా తెలిసింది. ఇందులో గజ్వేల్ నుంచి మూడు గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా సమాచారం. త్వరలో మిగతా 11 గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేయనుందని అధికారులు తెలిపారు. తొమ్మిది పూర్వ జిల్లాల్లో మూడేసి గ్రామాల చొప్పున మొత్తం 27గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్రామాన్ని 15 నుంచి 30 రోజుల్లోనే సర్వే పూర్తి చేసి మ్యాపులు, నక్షలు సిద్ధం చేసి ఇవ్వనున్నారు. అయితే అది కూడా ఒక్కో గ్రామంలో వెయ్యి ఎకరాలకు మించకుండా 27 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల శాంపిల్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సర్వేకు సంబంధించి ఇటీవలే 29 ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేయగా, అయితే గ్రామాల ఎంపిక తరువాతే ఈ ఏజెన్సీలను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే ఈ డిజిటల్ భూ సర్వే చేసేటప్పుడు ధరణి పోర్టల్ ఆధారంగా ఈ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ శాఖలు, గ్రామాల పటాలు, నక్షలను అధికారులు సేకరిస్తున్నారు. ఆకాంక్షాలు, రేఖాంశాల ఆధారంగా జరిగే సర్వేలో శాస్త్రీయతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉపగ్రహ చిత్రాలతో భూముల మ్యాపింగ్, విస్తీర్ణాలను నిక్కచ్చిగా నిర్ధారించాలనే లక్షంతో సర్వేకు ప్రభుత్వం వెళుతోంది. ఈ నేపథ్యంలో ఫైలెట్ సర్వేకు విదేశీ సంస్థలు కూడా ఆసక్తితో ముందుకు వచ్చినట్టుగా తెలిసింది.

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్…టిప్పన్‌ల సాయంతో….

రాష్ట్రంలో 1936 సమయంలో నిర్వహించిన సర్వేనే చివరిదికాగా 1950 కాలంలోనూ సర్వేకు కసరత్తు జరిగినా ముందడుగు పడలేదు. నిజామాబాద్ జిల్లాలో భూ భారతి పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్వే చేసినా అది పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. వ్యవసాయ భూముల ఫైలెట్ సర్వేను తొమ్మిది సర్వే సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఒక్కో సంస్థ మూడు గ్రామాల్లో సర్వే చేయనుంది. ఈ సర్వే చేస్తున్న సమయంలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ సహకారంతో తీసుకోవడంతో పాటు టిప్పన్ల సాయంతో సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఫైలెట్ సర్వే పూర్తయిన తరువాత

ఫైలెట్ సర్వే పూర్తయిన తరువాత ఆ సర్వేకు పట్టిన సమయం, ఎన్ని యంత్రాలు, ఎంతమంది పనిచేశారన్న విషయాలను పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో టెండర్‌దారులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సర్వే సంస్థల సాంకేతికతలతో పాటు అంతక్రితం మూడేళ్ల ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఆయా సంస్థలకు సర్వే బాధ్యతలను కట్టబెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సర్వే సంస్థల గుర్తింపు తరువాత నిర్ధేశించిన గ్రామాల్లోకి సర్వే బృందాలు షెడ్యూల్ ప్రకారం వెళతాయి. దీనికి ముందస్తుగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. మండల స్థాయిలో ప్రచారం అనంతరం కలెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లకు తెలియచేస్తారు. ఆయా గ్రామాలకు నిర్ధేశించిన ఏజెన్సీ ప్రతినిధులు గ్రామానికి వెళ్లి రైతుల భూముల సర్వేను చేపట్టనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News