Monday, April 29, 2024

ఇఎస్‌ఐలో రూ. 211 కోట్ల భారీ కుంభకోణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈఎస్‌ఐ స్కాంపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసింది. రూ. 211 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఇడి అధికారులు నిర్ధారించారు. ఇఎస్‌ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురు ఉద్యోగుల పాత్రను అధికారులు ప్రస్తావించారు. ఇఎస్‌ఐలో మందులు, మెడికల్ పరికరాల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని ఎసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఇడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు అటాచ్డ్ చేసిన విషయం తెలిసిందే. ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఇతర అధికారులతో కుమ్మక్కై కుంభకోణానికి పాల్పడినట్టుగా చార్జీషీట్‌లో ఇడి అధికారులు పేర్కొన్నారు. ఇఎస్‌ఐకు మందులు, మెడికల్ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఇడి ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బినామీ కంపెనీల పేరుతో మందులు, మెడికల్ పరికరాలు సరఫరా చేశారని తేల్చింది.

మందులు, మెడికల్ పరికరాల ధరలను మార్కెట్ ధర కంటే ఎక్కువగా కోడ్ చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. చార్జీషీట్‌లో ఇడి ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్‌గా గతంలో పనిచేసిన డాక్టర్ పద్మ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మందులు సరఫరా చేసినట్టుగా తప్పుడు బిల్లులు సృష్టించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇడి చార్జీషీట్‌లో ప్రస్తావించింది. ఇఎస్‌ఐ స్కాంలో అవకతవకలకు పాల్పడిన నిధులతో దేవికారాణితో పాటు ఇతర ఉద్యోగులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దేవికారాణితో పాటు ఫార్మసిస్ట్ నాగలక్ష్మి రూ. 6.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారని ఇడి గుర్తించింది. 2015-16, 2018-19 మధ్యకాలంలో ఈ కుంభకోణం జరిగిందని ఇడి అధికారులు చార్జీషీట్‌లో ప్రస్తావించారు.

దేవికారాణి ఆస్తుల చిట్టా పెద్దదే..!?
రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 50 చోట్ల దేవికా రాణి ఆస్తులను గుర్తించగా, వీటి విలువ రూ. 200 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ షేక్ పేట్‌లో రూ.4 కోట్ల విలువైన విల్లా, సోమాజిగూడలో 3 ఫ్లాట్లు, షేక్‌పేట్‌లో ఆదిత్య టవర్స్‌లో మూడు ఫ్లాట్లు, చిత్తూరులో రూ.కోటి విలువైన భవనం, హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఇండిపెండెంట్ భవనం, రెండు రాష్ట్రాల్లోనూ 11 చోట్ల ఓపెన్ ఫ్లాట్లు, తెలంగాణలో ఏడు చోట్ల 32 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. దేవికారాణి తాను అక్రమంగా సంపాదించిన ధనాన్ని రాష్ట్రం విడిపో యిన తరువాత అమరావతిలో పెట్టుబడులుగా పెట్టారు. తన పిల్లల పేరిట 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే అల్లుడి పేరు మీద తిరుపతిలో 700 గజాల్లో జీ ప్లస్ ఫోర్ అపార్ట్ మెంట్ ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు . రావిరాల హౌసింగ్ బోర్డులో ఒక ఇంటికి రూ.25 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు గుర్తించిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News