Monday, April 29, 2024

ఇడి అధికారులపై దాడి దారుణం

- Advertisement -
- Advertisement -

మమత సర్కార్‌పై గవర్నర్ సీరియస్

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై జరిగిన దాడిని అత్యంత దారుణమైనదిగా రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ అభివర్ణించారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిపి గోపాలిక తనను కలవాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తునకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు ఇడి అధికారులు శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఆయన నివాసానికి వెళుతున్నపుడు వారిపై దాడి జరిగింది. షేక్ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు ఇడి అధికారులపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన గవర్నర్ బోస్ రాష్ట్రంలో హింసను నివారించవాల్సిన పూర్తి బాధ్యత మమతా బెనర్జీ ప్రభుత్వానిదేనని అన్నారు. బెంగాల్ ఏమీ ఆటవిక దేశం కాదని, హింసను నివారించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని, లేని పక్షంలో పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇడి బృందంపై దాడి జరగడం అత్యంత దారుణమని ఆయన అన్నారు. ఇది ఆందోళనకరమైన అంశమని ఆయన అన్నారు. ఒక నాగరిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆటవికతను, అరాచకాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు బెంగాల్‌లో హింస జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రభుత్వం తన ప్రాథమిక కకర్తవ్యాన్ని నిర్వర్తించడంతో విఫలమైతే భారత రాజ్యాంగం తన పని తాను చేస్తుందని ఆయన హెచ్చరించారు. తగిన చర్యలు తీసుకునేందుకు తాను తనకున్న రాజ్యాంగపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తానని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందని ప్రతపిక్ష బిజెపి నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలిలో టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్ నివాసంలో సోదాల కోసం వెళుతున్న ఇడి అధికారులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లపై అత్యంత దారుణమైన దాడి జరిగిందని ఆయన తెలిపారు.

దాడికి పాల్పడిన జాతి వ్యతిరేక శక్తులలో రోహింగ్యాలు ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి అనేక నెలలుగా ఇడి దాడులు నిర్వహిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ(పిడపిఎస్) రేషన్‌లో 30 శాతం బహిరంగ మార్కెట్‌కు దారి మళ్లిందని ఇడి ఆరోపిస్తోంది. అక్రమ సొమ్మును మిల్లర్లు, పిడిఎస్ పంపిణీదారులు పంచుకున్నారని ఇడి ఆరోపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News