Saturday, April 27, 2024

నిరంతర శిక్షణతోనే సమర్థవంతమైన పోలీసింగ్

- Advertisement -
- Advertisement -

Effective policing

 

హైదరాబాద్ : నిరంతర శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా తెలిపారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలిసింగ్ అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో సోమవారం కె.ఎస్.వ్యాస్ స్మారక 24వ ఉపన్యాసాన్ని ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా ఇచ్చారు. డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి, అకాడమీ డైరెక్టర్ వికె సింగ్, దివంగత వ్యాస్ కుమారుడు సి.సి.ఎల్.ఎ అడిషినల్ కమిషనర్ కె.ఎస్.శ్రీవత్స, పలువురు సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ అధికారులు ఈ వ్యాస్ స్మారకోపన్యాసానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలలో పోలీసులు అతి తక్కువ బడ్జెట్ కేటాయింపులతో సరైన శిక్షణా లోపంతో అత్యంత ఒత్తిడితో పనిచేస్తున్నారని అన్నారు.

దేశంలో పోలీసు విభాగాల్లో దాదాపు 20 శాతం వివిధ స్థాయిల్లో ఖాళీలు ఉన్నాయని, సుమారుగా ఐదున్నర లక్షలు ఖాళీలున్నాయని వెల్లడించారు. సోషల్ మీడియా అత్యంత చురుకుగా ఉన్న పరిస్థితుల్లో పోలీసులు తీవ్ర ఒత్తడితో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. దేశంలోని పోలీసు వ్యవస్థలో 86 శాతం కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బంది ఉండగా, 14 శాతం మంది ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ క్యాడర్ వున్నారని వెల్లడించారు. వీరిలో కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బంది తక్కువ వేతనాలు, అననుకూల పరిస్థితుల్లో ఒత్తడితో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. పోలీసు సిబ్బందితో పాటు, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలకు నిరంతరం మానవ హక్కులు, న్యాయ, చట్టపరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. కాగా.. పోలీసు అధికారులు, సిబ్బందికి న్యాయ విద్యలో కనీసం డిప్లమా గానీ డిగ్రీ గానీ ఉన్నప్పుడే పటిష్టంగా విధులు నిర్వర్తించగలుగుతారని, ఇందుకుగాను నల్సార్ యూనివర్సిటీలో తెలంగాణ పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలను పోల్చితే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతోందని ప్రశంసించారు. ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులు పనితీరుపై పలు వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోందని అన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు 25 శాతం నేరాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే అరెస్టులతో 60 శాతం చట్టబద్ధత ప్రశ్నార్థకంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటం విఫలమవడానికి ప్రధాన కారణం ఈ పోరాట నేపథ్యం ఫ్యూడల్ వ్యవస్థ పునరుద్ధరణకే పోరాటం వచ్చిందని సామాన్య ప్రజానీకం భావించినందునే విఫలం అయిందని పేర్కొన్నారు. ఈ ప్రథమ స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ పాలకులు దేశంలో బ్రిటిష్ చట్టాల మాతృకతో భారత పోలీస్ చట్టాన్ని రూపొందించారని, కీలకాధికారాలను మాత్రం ఉన్నతాధికారుల వద్దనే వుంచుకున్నారని తెలిపారు.

ఇప్పటికే దాదాపుగా అదే చట్టం అంతర్లీనంగా కొనసాగుతోందని అన్నారు. దేశంలో ఇటీవల కొంతమంది మన పౌరులు కాదనే చర్చ జరుగుతోందని, దీనికి కారణం తమకు ఉన్న 21 రకాల హక్కులపై సరైన అవగాహన లోపం వల్లే అని తెలియజేశారు. మన ప్రజాస్వామ్య దేశంలో పౌరులు సార్వభౌమాధికారం కలిగి ఉండాలి. కానీ నాయకులే దానిని అనుభవిస్తున్నారని అన్నారు. పోలీసులు మరింత సామర్థంతో విధులు నిర్వహించాలంటే వారికి ఆకర్షణీయమైన వేతనాలు, తగు విశ్రాంతి, నిరంతర శిక్షణ అవసరమని ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా తెలియజేశారు. డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులకు, యువతకు ఇప్పటికీ దివంగత వ్యాస్ రోల్‌మోడల్లా, స్ఫూర్తిదాయకంగా ఉన్నారని తెలిపారు.

పోలీసు వ్యవస్థలో ఆధునీకరణ, వినూత్న విధానాలు, నూతన ఆవిష్కరణలు వ్యాస్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. న్యాయపరమైన చట్టాలకు లోబడే రాష్ట్రంలో పోలీసు శాఖ చట్టాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. వ్యాస్ హయాంలోనే రూపుదిద్దుకున్న గ్రేహాండ్స్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందని పోలీసు అకాడమి డైరెక్టర్ వికె సింగ్ గుర్తు చేశారు. అకాడమీ అడిషినల్ ఎస్.పి.శిరీష స్వాగతం పలికిన ఈ సమావేశంలో రిటైర్డ్ డిజిపి ఎం.వి.కృష్ణారావు, దివంగత వ్యాస్ కుమారుడు కె.ఎస్.శ్రీవత్స ప్రసంగించగా జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయుడు వందన సమర్పణ చేశారు. అకాడమి డిప్యూటి డైరెక్టర్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

Effective policing with continuous training
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News