Monday, April 29, 2024

3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

- Advertisement -
- Advertisement -
Election Commission announces by-polls
అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు: ఇసి ప్రకటన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరుగుతుంది. ఉప ఎన్నికలు జరిగే లోక్‌సభ స్థానాల్లో దాద్రా, నాగర్ హవేలి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లోను సిట్టింగ్ ఎంపిలు మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమైనాయి. ఈ ఏడాది మార్చిలో మండి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపి రాంస్వరూప్ శర్మ ఢిల్లీలోని తన నివాసంలో మతి చెందారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా బిజెపి ఎంపి నందకుమార్ సింగ్ చౌహాన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. అలాగే దాద్రా నాగర్ హవేలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపి మోహన్ దేల్కర్ గత ఫిబ్రవరిలో ముంబయిలోని ఒక హోటల్‌లో మృతి చెందారు.

కాగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అసోంలో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయలలో మూడేసి, బీహార్, కర్నాటక, రాజస్థాన్‌లలో రెండేసి,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌లలో ఒక్కోటి ఉన్నాయి. కరోనా మహమ్మారి, వరదలు, పండగలు, కొన్ని ప్రాంతాల్లోని చలి పరిస్థితులు, సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపిన సమాచారాన్ని కమిషన్ సమీక్షించి అన్ని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకొందని ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఇసి తెలిపింది. నామినేషన్లకు ముందు, తర్వాత ఊరేగింపులను నిషేధించడంతో పాటుగా బహిరంగ ఎన్నికల ప్రచార వేదికల్లో 50 శాతం కెపాసిటీకి మించకూడదని, జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలకు గరిష్టంగా 20 మందికి మించి స్టార్ క్యాంపెయినర్లు ఉండకూడదని, పోలింగ్ ముగియడానికి 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని కొవిడ్ సంబంధిత ఆంక్షల్లో భాగంగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News