Saturday, April 27, 2024

ఉపాధికి రూటు ప్రైవేటు

- Advertisement -
- Advertisement -

Employment

 

ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం

పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం

ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి

గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు
పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పించే 14 రంగాలను గుర్తించాం, ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో నైపుణ్యం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి, నైపుణ్యం పెంచడానికే టాస్క్‌ను ఏర్పాటు చేశాం
– అనురాగ్ ఐసిటిఐఇఇ-2020 అంతర్జాతీయ సదస్సులో ఐటి శాఖ మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ రంగంలో ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. టిఎస్ ఐపాస్ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగు పరుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 28 వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా సుమారు 13 లక్షల మంది ఉపాధి లభించిందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి కల్పించే 14 రంగాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నామన్నారు.

ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మార్పులపై అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల ఐసిటిఐఇఇ 2020 ఏడవ అంతర్జాతీయ సదస్సుకు మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, 2020ని తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏడాదిగా ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి గుర్తుచేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులలో నైపుణ్యం లేదని తమకు పరిశ్రమల నుంచి ఫిర్యాదులు అందాయని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికే తమ ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సంస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

గత 5 సంవత్సరాలలో టాస్క్ 680 కళాశాలలకు చేరుకుందని, 5,070 మంది అధ్యాపకులకు, 2.9 లక్షల మంది విద్యార్థులకు వివిధ నైపుణ్య నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చిందని అన్నారు. టాస్క్‌ను వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ వంటి 3 నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. టాస్క్‌తో కలిసి పనిచేసేందుకు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ముందుకు రావాలని కోరారు. అనురాగ్ కళాశాల మాదిరిగా ప్రతి కళాశాల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందేలా కృషి చేయాలని అన్నారు.

3 ఐ మంత్రాను బలంగా నమ్ముతా
ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే మూడు ఐ ల మంత్రాను తాను బలంగా నమ్ముతానని మంత్రి కెటిఆర్ తెలిపారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టిహబ్ ప్రారంభించామని తెలిపారు. అలాగే విహబ్‌ను ప్రారంభించామని అన్నారు. ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఐటి, ఇతర పరిశ్రమలను తీసుకొస్తామని తెలిపారు. ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇంజనీరింగ్‌లో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని గుర్తించి, దీనిపై నిపుణులతో కమిటీని నియమించి ప్రమాణాలను పరిశీలించామని అన్నారు.

ప్రమాణాలు పాటించని కళాశాలలు నిబంధనల మేరకు ప్రమాణాలు పాటించాల్సిందిగా సూచించామని తెలిపారు. కానీ కళాశాలల సంఖ్య గణనీయంగా తగ్గలేదని పేర్కొన్నారు. మంచి ఇన్‌స్టిట్యూట్ అంటే పెద్ద పెద్ద భవనాలు ఉండడమే కాదని, అత్యున్నతమైన అర్హులైన అధ్యాపకులు ఉండడమని పేర్కొన్నారు.మనదేశంలో యువత ఎక్కువగా ఉందని చెప్పారు. 50 శాతం జనాభా 27 ఏళ్లలోపు, 65 శాతం 35 ఏళ్లలోపు ఉన్నారని, ఈ యువతనే భారతదేశాన్ని నడిపించబోతున్నారని తెలిపారు. ఈ మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఐటిని ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పునర్నిర్వచించాలి
‘ఐటీ’ ఇకపై ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’గా కాకుండా ‘ఇంటెలిజెన్స్ టెక్నాలజీ’గా పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఐటి సేవలకు ప్రసిద్ది చెందిందని వ్యాఖ్యానించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అనురాగ్ వంటి విద్యాసంస్థలు ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చాయని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనలటిక్స్, బ్లాక్ ఛైన్, రొబోటిక్స్ వంటి సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చి పరిశ్రమలతో అనుసంధానం కావాలని సూచించారు. తమ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగాలపై దృష్టి సారించిందని తెలిపారు.

జర్మనీలో ఉన్న విధంగా ప్రాక్టీస్ స్కూల్ ఆప్షన్‌ను మన పాఠ్యాంశాల్లో భాగంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామ్ విద్యార్థిని నిజ జీవిత పరిస్థితులను తరగతి గదులలో అభ్యసించడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో పరిశ్రమలకు అవసరాలను గుర్తించి ఆరు నెలల నుంచి ఏడాది పాటు అప్రెంటిషిప్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలను అనుగుణంగా ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ నూతన విధానాలను జెఎన్‌టియుహెచ్ సీరియస్‌గా పరిశీలిస్తోందని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి జెఎన్‌టియుహెచ్‌లో ఈ విధానం అమలులోకి వస్తుందని ఆశిద్దామని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

ఈచ్ వన్ టీచ్ వన్‌తో పెరగనున్న అక్షరాస్యత : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన ‘ఈచ్‌వన్ టీచ్‌వన్’ నినాదంతో అక్షరాస్యత శాతం పెరుగుతుదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణను వందశాతం అక్షర్యాత గల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సిఎం కెసిఆర్ ధ్యేయమని అన్నారు. రాబోయే కొన్నేళ్లలో తెలంగాణ అక్షరాస్యత శాతాన్ని ప్రస్తుత 70 శాతం నుంచి 100 శాతానికి పెంచడమే లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యను పటిష్టంచేయడంతో పాటు, చదువురాని వారికి లక్షరజ్ఞానం కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో ప్రమాణాలు పెంపొందిస్తున్నామని తెలిపారు. సాంకేతిక విద్యా సంస్థల్లో ఎఐసిటిఇ నిబంధనలను అనుగుణంగా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, తద్వారా విదేశాలలో ఉన్న పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో బోధన వృత్తి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. గొప్ప గురువులు విద్యార్థులను ఎంతో ప్రభావితం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైంట్ ఛైర్మన్ బివిఆర్ మోహన్‌రెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కార్యదర్శి నీలిమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిటిఐఇ -2020 సావెనీర్‌ను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు.

Employment in the private sector
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News