Monday, April 29, 2024

కలెక్టరేట్‌లో కత్తిపోట్లు..

- Advertisement -
- Advertisement -

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో కత్తిపోట్ల సంఘటన శుక్రవారం జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే…. జిల్లా కలెక్టర్‌లోని వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నర్ర శిల్పకు సుధీర్ అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. ఈమెకు బాబు ఉన్నాడు. కాగా శిల్ప రెండు సంవత్సరాలుగా భర్తకు దూరమై మాసాయిపేట ఏఈఓగా పనిచేస్తున్న మనోజ్‌కు దగ్గరైంది. వీరి మధ్యన సహజీవనం కొనసాగుతున్నది. రెండు నెలలుగా మనోజ్ కనిపించకుండా పోవడంతో శిల్ప తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం తిరిగొచ్చిన మనోజ్ కలెక్టరేట్‌లో కనిపించడంతో శిల్ప తీవ్ర ఆగ్రహానికి గురై ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు అని నిలదీసింది.

ఇద్దరి మధ్యన మాటల యుద్ధం జరిగింది. వీరిద్దరి మధ్యన ఘర్షణ తీవ్రతరం కావడంతో క్షణికావేశానికి గురైన శిల్ప అతనిపై కత్తితో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయాల పాలైన మనోజ్‌ను తోటి ఉద్యోగులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ కేసు సంబంధించిన పూర్వాపరాలు దర్యాప్తు చేస్తున్నామని భువనగిరి రూరల్ ఎస్‌ఐ బి. సంతోష్ కుమార్ తెలిపారు.

కలెక్టరేట్‌టలో భద్రత ప్రశ్నార్థకం
జిల్లా కలెక్టరేట్‌లోని ఉద్యోగి తోటి ఉద్యోగిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటనతో కలెక్టరేట్లో భద్రత ప్రశ్నార్థకంగా మా రిందన్న చర్చ జరిగింది. కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి గేటు వద్ద పోలీసులు కాపలా ఉంటారు. అదేవిధంగా బాంబు స్క్వాడ్ పోలీసులు కూడా భద్రత నిమిత్తం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ శిల్ప దాడి చేసిన కత్తిఎక్కడి నుంచి తెచ్చుకుందన్న చర్చ నడుతస్తుంది. పథకం ప్రకారమే ఆమె ముందస్తుగా తన బ్యాగులో కత్తి తీసుకు వచ్చిందా? అంతకు ముందుకే కార్యాలయంలో తెచ్చుకొని దాచిపెట్టిందా?

అన్న కోణంలో కలెక్టరేట్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన కలెక్టరేట్ ఉద్యోగుల్లో ఉలికిపాటుకు గురిచేయగా కలెక్టరేట్ భద్రతకు సవాల్‌గా మారింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధను ఆదేశించినట్లు తెలిసింది. హత్యాయత్నానికి పాల్పడిన మహిళా ఉద్యోగిపై శాఖపరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశించడంతో డిఏఓ అనురాధ నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News