Monday, April 29, 2024

విద్యుత్ లైన్లకు దూరంగానే పతంగులు ఎగురవేయండి

- Advertisement -
- Advertisement -

పతంగులు, మాంజాలు తెగి వైర్లపై పడితే సమాచారం ఇవ్వండి
టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ

మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్రాతి పండుగ నాడు పతంగులు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా వస్తున్నది.
ఈ క్రమంలో టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ, ఐ.ఏ.ఎస్ శనివారం స్పందిస్తూ పలు సూచనలు చేశారు. సురక్షిత ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరమని, ఒక వేళ విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే ఆ పతంగుల మాంజాలు విద్యుత్ లైన్లపై, ట్రాన్స్‌ఫార్మర్లపై పడి ప్రమాదాలు, విద్యుత్ అంతరాయాలు కలిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ఈ క్రింద పేర్కొన్న కొద్దిపాటి సాధారణ జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగురవేసి తమ పండుగను మరింత ఆనందమయం చేసుకోగలరని తమ వినియోగదారులకు, ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లుకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయండని, విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయడం ప్రమాదకరం అని గమనించాలన్నారు. ఒక వేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం వున్నదన్నారు. కాటన్, నైలాన్, లినెన్‌తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలని, మెటాలిక్ మాంజాలు వాడొద్దని సిఎండి ముషారఫ్ ఫరూఖీ సూచించారు.

మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పడు విద్యుత్ షాక్ కలిగే అవకాశం వుందని, పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగురవేయాలని అన్నారు. తడి వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడ్డప్పుడు వాటిని వదిలేయండని తెలిపారు. ఒక వేళ వాటిని పట్టుకు లాగినప్పుడు విద్యుత్ తీగలు ఒక దానికొకటి రాసుకుని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం వున్నదన్నారు. బాల్కనీ, గోడల మీద నుండి పతంగులు ఎగురవేయరాదని, ఇది ప్రమాదకరమని అలా ప్రమాదాలు జరిగే అవకాశం వున్నదని తెలిపారు.

అలాగే పతంగులు ఎగురవేసేటప్పుడు తమ పిల్లలను గమనించగలరని ఈ సందర్భంగా తల్లి దండ్రులను సూచనలు చేశారు. పిల్లలు తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకనివ్వొద్దని, ఒక వేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు,మాంజాలు తెగి పడ్డట్లు ఉంటే, విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు వున్నా, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ వారి 1912 కి గాని లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి గాని లేదా సంస్థ మొబైల్ ఆప్ ద్వారా గాని లేదా సంస్థ వెబ్‌సైట్ టిఎస్ సౌతర్న్‌పవర్ డాట్ కామ్ (www.tssouthernpower.com ) ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. తమ విద్యుత్ శాఖ వారు వెంటనే తగు చర్యలు తీసుకుంటారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News