Monday, April 29, 2024

అమెరికాలో గాంధీజీ విగ్రహం అపవిత్రం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో గాంధీజీ విగ్రహం అపవిత్రం
వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ వద్ద ఖలిస్థానీ వేర్పాటువాదుల ఆగడం
ఎంబసీ అధికారుల తీవ్ర నిరసన
బాధ్యులను కఠినంగా శిక్షించాలని డియాండ్

Gandhi statue desecrated by Khalistan Supporters in US

వాషింగ్టన్: ఖలిస్థానీ వేర్పాటువాదులు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని తమ జెండాతో కప్పేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. భారత్‌లో కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా అమెరికాలోని సిక్కు సంఘాలు శనివారం భారీ కార్ల ర్యాలీ నిర్వహించాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో తదితర నగరాల నుంచి పెద్ద సంఖ్యలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపాయి. అయితే, ఇదే అదనుగా భావించిన ఖలిస్థానీ వేర్పాటువాదులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారితో కలిసిపోయారు. ఒక్కసారిగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని తమ జెండాతో విగ్రహాన్ని కప్పేసి అనంతరం ధ్వంసం చేయబోయారు. ఇది గమనించిన సెక్యూరిటీ అధికారులు వారించడంతో వేర్పాటువాదులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

కాగా, ఖలిస్థానీల దుశ్చర్యను భారత ఎంబసీ తీవ్రంగా ఖండించింది. దీనికి కారణమైన వారిని తప్పకుండా కఠినంగా శిక్షించడం జరుగుతుందని రాయబార కార్యాలయం అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేశామని, సాధ్యమైనంత త్వరగా దోషులను కోర్టు ముందుకు తీసుకు రావాలని కోరినట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ డిసి పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు అక్కడ ఉండడం గమనార్హం.

దాదాపు అరగంట తర్వాత ఖలిస్థానీ మద్దతుదారులకు చెందిన మరో గ్రూపు ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతో ఉన్న దిష్టిబొమ్మను తాడుతో విగ్రహం మెడకు వేలాడ దీశారు. దాదాపు గంట తర్వాత సీక్రెట్ సర్వీస్‌కు చెందిన ఏజంట్ ఒకరు విగ్రహం వద్దకు వచ్చి దుశ్చర్యకు పాల్పడిన యువకులకు మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని హెచ్చరించడం కనిపించింది. కాగా ఈ ఏడాది జూన్‌లో ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం అమెరికాలో ఉన్న విగ్రహాలు, మెమోరియళ్ల ధ్వంసం, అపవిత్రం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు. దోషిగా తేలితే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది. తాజాగా గాంధీజీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన వారికి కూడా ఇదే చట్టాన్ని ప్రయోగించాలని భారత ఎంబసీ తెలిపింది. దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది.

Gandhi statue desecrated by Khalistan Supporters in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News