Monday, April 29, 2024

ఆకలి మంటల మధ్య కొత్త పార్లమెంటా?: కమల్ ఫైర్

- Advertisement -
- Advertisement -

ఆకలి మంటల మధ్య కొత్త పార్లమెంటా?
ప్రధాని మోడీని నిలదీసిన కమల్ హాసన్

Kamal Haasan slams PM Modi over New Parliament Building

చెన్నై: దేశంలో సగం మంది ఆకలితో అలమటిస్తూ ఉంటే 1000 కోట్ల రూపాయల పార్లమెంట్ భవనం అవసరం ఉందా? అని ప్రధాని మోడీని ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిలదీశారు. దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయింది. ప్రజలపై పిడుగుపాటులా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ దశలో ప్రధాని మోడీ పలు శాస్త్రోక్తుల నడుమ అత్యంత ఆర్బాటంగా పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన రాయి వేయాల్సిన అవసరం ఉందా? అని ఆదివారం కమల్ హాసన్ ట్వీటు వెలువరించారు. తమిళనాడు రాజకీయాలలో సరికొత్త అధ్యాయంగా రెండేళ్ల క్రితం మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం)ను స్థాపించిన కమల్ ఇప్పుడు ఆదివారం 2021 అసెంబ్లీ ఎన్నికలకు తమ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ఈ విధంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలతో పోలిస్తే ముందున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి వేయి కోట్ల రూపాయలు వెచ్చించడం ప్రస్తుత తరుణంలో అంత అవసరమా? అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఓ వైపు కొవిడ్ వచ్చింది. నెలల తరబడి లాక్‌డౌన్‌లు సాగాయి. ప్రజలకు ఉపాధి కరువు అయింది. ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. పలు రకాలుగా నిరసన విన్పిస్తున్నాయి. ఈ దశలో వీటన్నింటిని విన్పించుకోనట్లుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని కమల్ చురకలు పెట్టారు. ఆకలి కేకలు ఢిల్లీ పెద్దలకు విన్పిస్తున్నట్లుగా లేవన్నారు. అత్యధిక జనం జీవనోపాధి దెబ్బతింది.

ఇప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలాగా ప్రధాని మోడీ దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి సంకల్పించారని మండిపడ్డారు. వేలాది మంది చనిపోతూ ఉంటే ప్రధాని పార్లమెంట్ భవనానికి కల్యాణ రాగాలు వింటారా? అని ఈ సినీనటుడు వ్యాఖ్యానించారు. అప్పట్లో చైనా వాల్ నిర్మించినప్పుడు కూడా అక్కడి పాలకులు ఇదో పెద్ద విషయం కాదని, ప్రజలను రక్షించుకునేందుకే ఈ కార్యం చేశామని సమర్థించుకున్నారని తెలిపారు. ఇప్పుడు మోడీ ధోరణి కూడా అదే విధంగా ఉందని అనుకోవాలా? అని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రధాని మోడీ పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ 20వేల కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సరికొత్త హంగులతో పార్లమెంట్ భవన నిర్మాణం ఆరంభానికి రంగం సిద్ధం అయింది. టాటా కంపెనీకి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను అప్పగించారు.
తమిళనాడును చక్కదిద్దుతా: కమల్
పార్టీ ప్రాధాన్యతల గురించి కమల్ వివరించారు. పలు కారణాలతో ఇప్పటికీ తమిళనాడు పతనావస్థకు చేరుకుంది, ముందు దీనిని సరిదిద్దడం తన ముందు ఉన్న ప్రాధాన్యతక్రమం అని కమల్ తేల్చిచెప్పారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ తమ ఎన్నికల ప్రచారం సాగుతుందన్నారు. మధురైలో స్థానిక అధికారులు ప్రచారంపై ఆంక్షల విధించడాన్ని ప్రస్తావిస్తూ ఇటువంటివి తమ పార్టీకి కొత్తేం కావన్నారు. అడ్డుకట్టలు ఆకస్మిక వరదలను ఆపగలవా? అని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది. ఇటీవలే సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.ఇక అధికార అన్నాడిఎంతో బిజెపి కలిసికట్టుగా సాగుతోంది. ఏదో విధంగా రాష్ట్రంలో తమ ముద్రను బలోపేతం చేసుకునేందుకు కాషాయ పార్టీ శతవిధాలుగా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే బాగా పేరున్న నటి కుష్బూను బిజెపిలోకి తీసుకున్నారు. రజనీకాంత్ పార్టీపై కూడా బిజెపి ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో తమిళ భావోద్వేగాన్ని రేకెత్తించే రీతిలో ఉత్తరాది ప్రసక్తి లేకుండా చేసుకుని రాష్ట్రంలో విస్తరించుకుని తీరాలని పార్టీ ఆశిస్తోంది.

Kamal Haasan slams PM Modi over New Parliament Building

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News