Monday, April 29, 2024

ఆడపిల్లను బతుకు(క)నివ్వండి

- Advertisement -
- Advertisement -

‘ఆడపిల్లను బతకనిస్తే అమ్మను గౌరవించినట్లే.. నీ ఉనికిని నువ్వు చాటుకున్నట్లే’ కానీ ఈడనే కాదు ఏడనైనా ఏడున్నదమ్మో నీకు న్యాయం? ఓ ఆడకూతురమ్మా.. ప్రకృతిలో సగం, ప్రకృతే నువ్వు అయినప్పుడు, ఈ లోకం సంక్రమణం, సవ్య పయనం నువ్వే అయినప్పుడు గీ దారుణ తంతేంది? నిన్ను మానవ క్రమపు జాడల నుంచి సాధ్యమైనంత తక్కువగా చేసి చూపించాలనే ఆలోచనలు ఈ వికృతాల బాపతేంది? తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీ లెక్కలు చూసుకుంటే ఇప్పుడు 78 శాతం జిల్లాల్లో జననాల తీరును చూస్తే, గణాంకాలను విశ్లేషించుకుంటే మగపిల్లల జననాలే ఎక్కువ అని వెల్లడైంది. తల్లి పురిటినొప్పుల తరువాత విన్పించే కేరుమనే తొలి పలకరింపు ఆడదా? మగదా అనే ఉత్కంఠతల రీతిలో ఇప్పుడు దంపతులు, తమను తాము సోకాల్డ్ నాగరీకులమని చెప్పుకొనేవారు దుష్ట తలంపులకు దిగుతూ ఆడ పిల్లను అమ్మ కడుపులోనే అంతం చేస్తుంటే మనం ఏ వజ్రోత్సవాల వైపు, ఏ అత్యద్భుత దేశసంపదల వైభవం వైపు వెళ్లుతున్నట్లు? రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన ప్రసవాలలో పుట్టిన బిడ్డలలో 69 శాతం మంది వరకూ మగబిడ్డలే ఉన్నారు. కేవలం ఏడు జిల్లాల్లోనే ఆడ నవజాత శిశువుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇందులో 4 జిల్లాలు ఈ ముదురు నాగరికత, అమానవీయ సంస్కృతి పొద్దు పొడవని ఏజెన్సీ ప్రాంతాలలోని జిల్లాలే. కొండకోనల గిరిజన తండాలలో నెలకొనే ఉండే నైసర్గిక విభజిత జిల్లాలోనే ఈ ఆడబిడ్డలు పురుడుపోసుకున్న తల్లుల పేగు తెంచుకుని మల్లెమొగ్గలోలే ఈ జీవనక్రమపు వెలుగురేఖల జాబితాలో వచ్చి చేరుతున్నారు. అయితే పట్టణాలు, నగరాలు బాగా ఫ్యాషన్ ముదిరిన ప్రాంతాలలో ఆడపిల్లల జననాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో సశాస్త్రీయ రీతిలో పలు కోణాల నుంచి జరిపిన అధ్యయనాలలో పసికట్టారు. క్రమేపీ రాష్ట్రంలో ఆడపిల్లలు మగ పిల్లల మధ్య భారీ వ్యత్యాసం పెరగడానికి, రెండు కళ్ల వంటి మగ ఆడ సంఖ్యలో పూడ్చలేని అగాధం ఏర్పడానికి కారణం ఏమిటనేది తెలుసుకోవడానికి కొండను తవ్విన రీతిలో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ముంజేతి కంకణమోలే, అరచేతి గోరుముద్ద వలే ఎవరికి అయినా తేటతెల్లం అవుతూనే ఉంది. దంపతులు ఆర్థికంగా సామాజికంగా ఎంత ఎదిగినా, ఎంతకూ తిరిగిరాలేని, చీకటి గుహల వంటి ఆలోచనా వలయాల క్రమంలో కూరుకుపోయి ఉండటం వల్లనే ఇప్పుడు సమాజంలో, ప్రత్యేకించి తెలంగాణ సమాజంలో కూడా ఆడ, మగ పిల్లల నిర్ధారణ క్రమంలో ఏరివేతలు జరుగుతున్నాయని స్పష్టం అయింది.

అత్యంత అధునాతన ఆసుపత్రులు, ఆధునిక వైద్యచికిత్సలు, చివరికి యథేచ్ఛగా పుట్టబోయేది ఆడబిడ్డనో, మగబిడ్డనో ముందుగా తెలిపే లింగ నిర్ధారణ పరీక్షలు పైసలు పారేస్తే దక్కించుకునే అవకాశం వచ్చిన క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో కూడా గతంలో అక్కడెక్కడో రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాలలో తలెత్తిన పరిణామాలు ఇక్కడ విరివిగా జరుగుతున్నట్లు స్పష్టం అయింది. లింగ నిర్ధారణ తరువాత పుట్టేది మగబిడ్డ అయితే తల్లి నిండు చూలాలుగా సాగేందుకు, లేకపోతే గర్భవిచ్ఛిత్తికి సాగే అపసవ్యపు లక్షణాలు దండిగా నెలకొన్నాయనే విషయం సర్వేతో పరోక్షంగా వెల్లడైంది. ప్రైవేటు ఆసుపత్రులు, లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా లేని ప్రాంతాలలో ఆడపిల్లల జననం ఎక్కువగానే ఉంటోంది. దీనికి విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా అందుబాటులో ఉండే జిల్లాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, తరువాత గర్భవిచ్ఛిత్తి జరుగుతోందని వెల్లడైంది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెలువరించిన జనన వివరాల బర్త్ పోర్టల్ గణాంకాలతో ఆడపిల్ల జీవన్మరణ సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ ఇ బర్త్ పోర్టల్ లెక్కలు,

అధికారికంగా పొందుపర్చిన రికార్డులను పరిశీలించుకుంటే జనవరి నెలలో జననాల సంఖ్యను తీసుకుంటే పుట్టిన వారిలో 52 శాతం వరకూ మగపిల్లలే ఉన్నారు. ఆడపిల్లలు, మగపిల్లల మధ్య జనాభా నిష్పత్తి వ్యత్యాసం రాబోయే తరంలో అత్యంత కీలకమైన పరిణామానికి దారి తీస్తుందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లింగ నిష్పత్తి వ్యత్యాసాలు అత్యల్పంగా ఉన్నప్పటికీ, వీటిపై దృష్టి సారించకపోతే తరువాతి కాలంలో పూడ్చలేని జటిల సమస్య తెచ్చిపెట్టినట్లు అవుతుంది. పెళ్లీడుకొచ్చిన కొడుక్కు ఆడజోడు దొరకడం లేదనే సంకట స్థితి కూర్చున్న కొమ్మను నరుక్కునే పద్ధతితో తెచ్చుకున్నదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News