Monday, April 29, 2024

లోక్‌సభలో అమ్మాయిల వివాహ వయసు పెంపు బిల్లు

- Advertisement -
- Advertisement -

Girls' marriage age increase bill Introduced in Lok Sabha

ఏక పక్షంగా బిల్లును తీసుకు వచ్చారంటూ విపక్షాల తీవ్ర అభ్యంతరం
పార్లమెంటు స్థాయీసంఘానికి పంపిస్తున్నట్లు మంత్రి స్మృతి ఇరానీ ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో యువతుల కనీస వివాహ వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంతత్రణ సవరణ బిల్లు 2021ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ వారి ఆందోళనల మధ్యనే కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపిస్తున్నుట్లు తెలిపారు. ఈసందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని, మహిళల పట్ల తమకు ఎటువంటి భేదభావం లేదన్నారు. మహిళ 18 ఏళ్లకు గర్భవతి అయితే అప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కానీ వివాహబంధంలోకి అడుగుపెట్టే విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు 75 ఏళ్ల తర్వాత సమాన హక్కులు కల్పిస్తున్నాం. ఈ సవరణతో ఇకపై యువతీ యువకులు 21 ఏళ్లకు పెళ్లిపై నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది.

మహిళా సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును తీసుకువచ్చాం’ అని తెలిపారు. అయితే ఈ బిల్లుపై విపక్ష సభ్యులో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా బిల్లును తీసుకువచ్చిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపిలు విమర్శించారు. కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ, తొందరపడి బిల్లును ప్రవేశపెట్టారన్నారు. ఎందుకు ఇటువంటి బిల్లులను ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉండాలని లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. తృణమూల్ ఎంపి సౌగత్ రాయ్ మాట్లాడుతూ ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మైనారిటీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారు.

ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ లేదా సెలక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉందని, ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని డిఎంకె సభ్యురాలు కనిమొళి అన్నారు. మరో వైపు మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం యువతీ యువకుల స్వేచ్ఛాయుత హక్కుకు వ్యతిరేకమని అన్నారు. 18 ఏళ్ల అమ్మాయిలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నప్పుడు,సహజీవనం చేస్తున్నప్పుడు అదే వయసు యువతుల వివాహ హక్కును ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. విపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపిస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత లఖింపూర్ ఖేరీ ఘటనతో పాటుగా పలు అంశాలపై విపక్ష ఎంపిలు ఆందోళనకు దిగడంతోసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News