Monday, April 29, 2024

‘గ్లకోమా’ అంధులకు మళ్లీ చూపు

- Advertisement -
- Advertisement -

సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం అన్నది మనకు తెలిసిందే. కంటిచూపు లేకుంటే బ్రతుకే అంధకారం. కంటిచూపు సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా తీవ్రసమస్యలు ఎదురవుతాయి.దేశంలో శాశ్వత అంధత్వానికి దారి తీసే ప్రధాన కారణాల్లో గ్లకోమా ఒకటి. గ్లకోమా అనేది కంటి ఆప్టిక్ నరాలు (దృశ్యకణాలు) దెబ్బతినే దుస్థితి. దృశ్య సందేశాలను మెదడుకు తీసుకెళ్లే ఒక మిలియన్ కంటే ఎక్కువ నరాలతో కూడిన వ్యవస్థ ఆప్టిక్ నరాలతో ముడిపడి ఉంది.జన్యుపరమైన లోపాల వల్ల కూడా గ్లకోమా దాపురిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4.5 మిలియన్ల మంది గ్లకోమా కారణం గానే అంధత్వానికి గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ గ్లకోమా కారక అంధత్వాన్ని నివారించి మళ్లీ చూపు తెప్పించడానికి విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా లోని కాలిఫోర్నియా, పారిస్‌ల్లో సాగుతున్న పరిశోధనల్లో కొంతమేర సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

భారత దేశంలో గ్లకోమాతో బాధపడుతున్న 12 మిలియన్ మందిలో 1.2 మిలియన్ మంది ఇప్పటికే గ్లకోమా వల్ల అంధత్వంతో అలమటిస్తున్నారు. దేశంలో కానీ, ప్రపంచం మొత్తం మీద కానీ, అంధత్వం దాపురించడానికి రెండో కారణం గ్లకోమాయే అవుతోంది. ఎవరైతే 40 ఏళ్లు దాటి వంశపారంపర్యం గా వచ్చే థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం తదితర రుగ్మతలు ఉన్నట్టయితే గ్లకోమాకు దారితీసే ప్రమాదం ఉంటుంది. గ్లకోమా ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి తీవ్రదశకు చేరిన తరువాతనే లక్షణాలు బయటపడతాయి. శరీరానికి రక్తం ద్వారా పోషకాలు అందినట్టే కనుగుడ్డుకి ఆక్వియెస్ హ్యూమరీ ద్రవం ద్వారా పోషకాలు అందుతుంటాయి. పల్చగా, నీళ్లను పోలిఉండే ఈ ద్రవం కంట్లోకి వెళ్లి తిరిగి రక్తంలో కలిసిపోతుంది. ఈ ద్రవం పయనించే మార్గాన్ని యాంగిల్ అంటారు. ఈ మార్గంలో అడ్డంకులు ఏర్పడి ద్రవం కంట్లోనే నిల్చిపోతే కనుగుడ్డుపై ఒత్తిడి పెరిగి, కంటిచూపుకు తోడ్పడే ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింటుంది. మనం చూసే దృశ్యాల సంకేతాలను మెదడుకు పంపించేది ఆప్టిక్ నెర్వే. జన్యుపరమైన లోపాలతో దీర్ఘకాలిక క్రియాశీలక ఆప్టిక్ న్యూరోపతి అనే రుగ్మతగా మారి అంధత్వానికి దారి తీస్తుంది.

అయితే ఈ వ్యాధి గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండడం లేదు.అందుకనే ప్రపంచ స్థాయిలో గ్లకోమా అవగాహన వారోత్సవాలు ఏటా మార్చి 12 నుండి 18 వరకు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. మన దేశంలో దాదాపు 13 మిలియన్ మంది గ్లకోమాతో బాధపడుతున్నప్పటికీ, గ్లకోమా అంటే ఏమిటో తెలిసిన వారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంటోంది. గ్లకోమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా, రెండోది క్లోజ్ యాంగిల్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అత్యంత సాధారణ రూపం. ఇది అన్ని గ్లకోమా కేసుల్లో కనీసం 90% వరకు ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ వ్యాధి గర్భస్థ శిశువు మొదలుకొని వృద్ధుల వరకు పీడిస్తుంది. ఒక కంట్లో లేదా ఒకేసారి రెండు కళ్లల్లోనూ గ్లకోమా రావచ్చు. ప్రస్తుతం గ్లకోమా ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స మరింత దృష్టిని కోల్పోకుండా నిరోధించడానికి మందులు, శస్త్రచికిత్సలు లేదా లేజర్ చికిత్సతో సాధ్యమవుతుంది.

గ్లకోమా వల్ల చూపు కోల్పోయే ఈ పరిస్థితికి మధుమేహం కూడా ఒక కారణంగా పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. మన కళ్ల వెనకాల రెటీనాలో సున్నితమైన దృశ్యనాడులు (ఆప్టిక్ నెర్వ్) ఉంటాయి. వీటిలోని ‘రెటినల్ గాంగ్లియన్ ’ అనే ప్రత్యేక కణాలే మనం చూసే దృశ్యాలని మెదడుకు చేరవేస్తాయి. మధుమేహం కారణంగా రక్తంలో నిండిపోయిన చక్కెర్లు ఈ రెటినల్ గాంగ్లియన్ అనే ప్రత్యేక కణాలని చంపేస్తాయని, దాంతో చూపుపోతుందని వైద్యనిపుణులు వివరిస్తున్నారు. దెబ్బతిన్న ఆ రెటినల్ గాంగ్లియన్ కణాల స్థానంలో కొత్తవాటిని సృష్టించగలిగితే అంధులకు మళ్లీ చూపు తెప్పించవచ్చని పరిశోధకులు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు.

ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నా… దానికి సంబంధించి ఇటీవల ఓ కీలకమైన ముందడుగు పడింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని ‘చిల్డ్రన్ హాస్పిటల్ లాస్ ఏంజిలస్’కి చెందిన భారతీయ మూలాలున్న పరిశోధకులు బిరాజ్ మహతో ఈ విషయంలో సాధించగలిగారు. ఇందుకోసం ఎనిమిది రసాయనాలతో కూడిన ప్రత్యేక ద్రవ్య మిశ్రమాన్ని రూపొందించారు కూడా. ఆ మిశ్రమంలో కంట్లో ఉండే మ్యూలర్ గ్లియా అనే మామూలు కణాలని ఉంచారు. రెండు వారాల తరువాత ఆ మామూలు కణాలే ప్రత్యేక రెటినల్ గాంగ్లియన్ కణాలుగా ఎదిగాయని ప్రయోగం ద్వారా తెలుసుకున్నారు. ఇలా పెరిగిన కణాలని దృశ్యనాడులు దెబ్బతిన్న ఎలుకల కళ్లలో ఉంచి పరీక్షిస్తే 45 రోజుల్లో వాటికి చూపు తిరిగొచ్చినట్టు నిర్ధారణ అయింది.ఇక ఈ పరీక్ష మానవుల్లోనూ విజయం సాధిస్తే గ్లకోమా కారక అంధత్వాన్ని పూర్తిగా అరికట్టవచ్చని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెబుతున్నారు.

డా. బి రామకృష్ణ
9959932323

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News