Thursday, May 9, 2024

వెంకన్న గురించి శివారెడ్డి ఏమంటున్నారు!

- Advertisement -
- Advertisement -

Goreti venkanna folk songs

ప్రపంచ వ్యాప్తంగా వున్న గొప్ప ప్రజావాగ్గేయకారులు స్ఫురణలో కొచ్చినప్పుడు, గోరటి వెంకన్న గుర్తుకొస్తాడు. లేదు గోరటి వెంకన్న గుర్తుకొచ్చినప్పుడు విశ్వ ప్రజావాగ్గేయకారులు గుర్తుకొస్తారు. నిన్న మొన్నటి దాకా ప్రపంచ సాహిత్యంలో పాటకి మొదటి స్థానం యివ్వటానికి మేధావులు, విమర్శకులు వెనుకాడారు. కానీ అమెరికన్ ప్రజావాగ్గేయకారుడు బాబ్ డిలాన్‌కి నోబెల్ అవార్డు వచ్చాక ఆ రేఖ చెరిగిపోయింది; ఏ ప్రక్రియలో వున్నా గొప్పసాహిత్యం గొప్పసాహిత్యమే. అన్ని దేశాలు తమవయిన వాగ్గేయకారులను సృష్టించుకున్నాయి. ప్రజాజీవన లోతుల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, వెతల్ని, హింసల్ని, పీడనల్ని ఈ వాగ్గేయకారులు అద్భుతంగా పట్టుకుని, స్థిరస్థాయిని కల్పించారు.వివక్షల్ని, అన్యాయాల్ని,దోపిడీలని బెరుకు లేకుండా రాజ్యానికి భయపడకుండా గొంతెత్తి చాటారు.

తమతమ దుఃఖపు లోతుల్నుండి ఒక విశ్వగీతాన్ని, ఒక విశ్వగానాన్ని సృజించారు. ఎరిక్ క్లాప్‌టన్‌ను వినండి; ట్రేసీ చాప్‌మన్‌ను వినండి సర్వమానవుల ఉనిక్కి సంబంధించిన సారమేదో, వేదనేదో ప్రతిధ్వనిస్తుంది. జీవనానందాన్ని, జీవన దుఃఖాన్ని పాట బ్రహ్మాండంగా పట్టుకుంది. బతుకును పాట సెలబ్రేట్ చేసింది. తన్మయత్వంతో ఊగిపోయి సర్వప్రాణికోటి సంతోషాల్ని, వెతల్ని, అవధులులేని ఆశల్ని అది అందుకుని విశ్వాన్ని వెలిగించింది. వీళ్ల పాట విన్నాక ఒక సమరోత్సాహం, ఒళ్లు తెలియని అనంతమయిన ఆశ ఉబుకుతుంది. బతుకుపట్ల గొప్ప ఆశ గలుగుతుంది. జీవితం రుచికరంగా మారుతుంది. ఎక్కడా నిరాశకుగానీ, నిర్వేదానికిగానీ చోటులేదు; ఒక్కసారి వేలవేల పక్షులు ఆకాశంలోకి లేస్తాయి. మనలోని నదులు కదలబారతాయి. సాగరాలు తలకిందులవుతాయి. ఈ అఖండ భూమిని రెండు చేతుల్తో కౌగిలించుకుంటాం. అన్యాయాన్ని అధర్మాన్ని సహించం. దునుమాడటానికి సిద్ధమవుతాం.

కొన్ని వేల సంవత్సరాల దేశ సంచారుల, బైరాగుల, భక్తికవుల సారమంతా వారసత్వమంతా వెంకన్న పుణికిపుచ్చుకున్నాడు. ఒక ఆశ సాంప్రదాయపు జీవలక్షణాన్ని, తాజాదనాన్ని తత్కాలపు మేలిమిగుణాల్ని అందుకున్నాడు. పాటలని దృశ్యకావ్యంగా, అద్భుతంగా మలచినవాళ్లు జనజీవన వాగ్గేయకారులు.అన్ని సాహిత్య ప్రక్రియలు అందులో లీనమై, కరిగిపోయి పాటగా ప్రత్యక్షమవుతాయి. పాట నివేదిస్తుంది. నీచే మాట్లాడిస్తుంది. దేహాన్ని ఖడ్గంగా మారుస్తుంది. లోలోపల్నుంచి తన్నుకొచ్చే ఉద్రేక తరంగాలు, తర్కబద్ధమై అన్నింటినీ విప్పుకుంటూ పోతాయి.
ఒకానొక ఉద్యమం వున్నప్పుడు పాట జన్మించి ఉధృతమై ఉనికి రహస్యాన్ని విప్పిచెప్పవచ్చు. ఉద్యమం విస్తృతమై, విశాలమై పలుఅంశాల్ని లోతుగా పరిశీలించి, స్వీకరిస్తున్నప్పుడు పాట యింకా గొప్పగా అనేక జీవనాంశాల్ని స్వీకరించి విశాలమై విస్తృతి పొందుతుంది. ఏకవ్యక్తి నిర్మితమయిన పాట ఈ దశలో బహుముఖమై, జాజ్వల్యమానమై బహు సోయగాల్తో విరాజిల్లుతుంది, అద్భుతమయిన గేయరూపక కావ్యంగా. జీవితంలో ఏ అంశం, ఏ పార్శ్వం తప్పించుకోదు. బహు కోణాల్తో వజ్రంలా కాంతి వెదజల్లుతుంది. ఈ పాటల్ని వాళ్లు వేదిక మీద ప్రదర్శించేటప్పుడు బహు భంగిమల్తో, బహు అర్థాల్తో లోలోపలికి తొలుచుకుపోతాయి. ఆ పాట నాదం జీవితాంతం అలా లోలోపల వెలుగుతూనే వుంటుంది.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకన్న ఈ ఉచ్ఛస్థాయినందుకున్నాడు. పాటకి ఒక శాశ్వతత్వాన్ని అద్భుతమయిన అందాన్ని లాలిత్యాన్ని మృదుత్వాన్ని, ఒక గొప్ప మెలకువను తను ప్రసాదించాడు. జీవితమంత సునిశితంగా, లోతుగా, గంభీరంగా, ధైర్యంగా అన్ని రంగుల మేలిమి కలయికని ఈ దశలో వెంకన్న పాట అందుకుంది. ఆయన స్పృశించని కోణం లేదు. ప్రకృతిని యింతగా సంలీనం చేసుకున్న కవి అరుదుగా కనిపిస్తాడు. అన్ని ప్రక్రియల్లోనూ అతనంతే ఒక విరాట్ స్వరూపంతో సర్వాన్ని శ్వాసించి, తన ప్రాణంలో ముంచి బయటికి తీసి మన ముందు ప్రదర్శిస్తాడు. అతనికడ్డమేముంది బతుకే సర్వస్వం, బతుకుని సుదీర్ఘమయిన పాటగా మలుచుకుంటూ పోతున్నాడు.

ఇంతకు ముందు రెండు పాటల పుస్తకాలకి తోచిన విధంగా ముందుమాటలు రాశాను ‘రేలపూతలు, ‘అలసెంద్రవం.’ అయినా ఈ కొత్త పాటల సంపుటికి నాలుగు మాటలు ముందుమాటలు గాదు. ఎంకన్న పాటల్ని విశ్లేషించటానికి పెన్నా శివరామకృష్ణలాంటివాళ్ళు వున్నారు. నా బోటివాడు ఏం చేస్తాడు వెంకన్న ప్రదర్శననిస్తుంటే ఎదురుగా చిన్నపిల్లాడిలా కూచుని ఈల వేస్తాడు. ఉద్రేకం పట్టలేక లేచి గంతులేస్తాడు. ఆయనకి తెలియదుగానీ నేనాయనలో ఐక్యమై, ఆడి, పాడి అలిసిపోతా. ఒక గొప్ప వాగ్గేయకారుడికి మనమిచ్చే బహుమానం ఏమిటంటే ఆయన్ని, ఆయన పాటల్ని కౌగిలించటం కౌగిలింతలో కరిగిపోవటం.లీనంగాకుండా జీవితంలో, జనజీవితంలో పాటెట్టా రాస్తాడు; పాటనెట్టా ఊహిస్తాడు, వరుసలు వరుసలుగా ఎలా కడతాడు, తీర్చిదిద్దుతాడు. కరిగిపోవటం, లీనం కావటం కవి ప్రథమ లక్షణం. తర్వాత ఆ ద్రవస్థితిని, పాటగా, కవితగా ఘనీభవింపజేస్తాడు. ఆ గడ్డ కట్టిన పాట మళ్లీ పాఠకుల, శ్రోతల, గాయకులలో కరిగి, కరిగి పాట ప్రవాహమైపోతుంది. గొప్ప చలనాన్ని, గొప్ప మార్దవాన్ని, గొప్ప ఐక్యతని అది సాధిస్తుంది.

వెంకన్ననే బైరాగి, ఒక సంచారి ఒక తత్వవేత్త పాడుబడ్డ గుళ్లో కూర్చుని, హుక్కా పీలుస్తూ లేదూ; గంజాయి దమ్ము కొడుతూ పాటెత్తుకుంటాడు. అదలా గాల్లో రింగులు తిరుగుతూ, వీధుల్లోనూ, ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తూ, ప్రతిధ్వనిస్తూ రోదసిలో గింగిర్లు తిరుగుతుంది. ఈ పాటలు ఊరక రావు. అనేక తత్వాలు కలిసి, అనేక దేశాల జీవన రీతుల్ని లీనం చేసుకుని, తనకేమీ పట్టనట్టు జనప్రవాహాల మీద పారబోసుకుంటూ వెడతాడు. అనంత వైవిధ్యంతో జీవితాన్ని దాని సమస్త వేదనల్తోనూ, అందాలతోనూ, అగ్నులతోనూ, సమస్త చేతనతోనూ నింపుకుంటూ కాలవకట్ట మీద నడుస్తూ పాడుకుంటూపోతాడు.తను రాసినట్టుండదు. అలా అనుకుంటూ పోతాడు.అతనలా వెడుతుంటే మనం సమస్త దేహంతో చూస్తాం, వింటాం.

అతను సమస్త దేహంతోనూ, దేహాత్మతోనూ బతుకును పట్టుకుని పాటల్ని సీతాకోక చిలుకల్లా అంతటా ఎగరేసుకుంటూ పోతాడు. అతనికొక కచ్చితమయిన తాత్వికత వుంది. జీవనదర్శనముంది. అతనికి మార్గనిర్దేశం చేసే ఒక వామపక్ష భావజాల తాత్వికత వుంది. అది గడ్డ కట్టుకుపోయేది కాదు. బహుముఖమైంది. జీవితాన్ని దాని సమస్తంతో అన్ని కోణాల్తో, పార్శ్వాల్తో పట్టుకుంటానికి వెంకన్న ప్రయత్నం చేసినట్టు మరే కవి చేయలేదనుకుంటా. అతని జీవనలాలస చాలా గొప్పది. అతని మగ్నత బహుముఖమైంది. అదలా వ్యాప్తి చెందుతూ, వ్యాప్తి చెందుతూ అనంత వైవిధ్యంతో గొప్ప రేంజ్‌ని సాధించింది. అతను మొరటు కాదు; లాలిత్య సంపన్నుడు. ప్రకృతంత, జీవితమంత పాటని కట్టాలని అతని తపన. ‘ఆకలా, దాహమా చింతలా, వంతలా’ అని కృష్ణశాస్త్రి పాడుకున్నట్టు వెంకన్న మనమధ్య పాడుకుంటూ తిరుగుతున్నాడు. అతను చెప్పేదాకా జీవితమింత అందమయిందా, అనుభూతిప్రాయమయిందా అని మనకు తెలియదు. ఒక లోలుపతని, ఒక మగ్నతని, ఒక మైమరపును జీవితం పట్ల అతను కలిగిస్తాడు. అతని పాటల్లోంచి మనం కొత్తగా జన్మిస్తాం. కొత్తగా ప్రపంచాన్ని చూస్తాం. ఆనందిస్తాం, ఆరాధిస్తాం. వెంకన్న వామపక్ష పక్షపాతయినా బహు ప్రజాస్వామికవాది. ఒక డెమొక్రటైజింగ్ ప్రాసెస్ అతనిలో వుంది. బహుశ highest form of democracy is perhaps socialism అనుకుంటా. మన రాజ్యం ఏర్పడ్డాక గూడా రాజ్యం మీద కవి విజిలెన్స్ అవసరం. దీర్ఘకాలిక యుద్ధమంటే మనమనుకున్న స్వర్గం ఏర్పడ్డాక గూడ కవి పాత్ర ఒక dissent పాత్ర కవి పోషించవలసిందే. ఆ ప్రాసెస్ ఏదో కవి వెంకన్నలో అంతర్గతంగా జరుగుతుందనుకుంటా ప్రకృతి సమాజపు మేలికలయిక వెంకన్న కవిత్వంలో స్పష్టంగా కన్పడుతుంది.

broad democratic liberal అనవచ్చా తెలియదు. నేను రకరకాలుగా ఊహిస్తున్నా అనుకుంటున్నా కవిత్వం ద్వారా ఒక అద్భుత వ్యక్తి నిర్మాణం వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందనుకుంటా. ఇవన్నీ వెంకన్నలో కలగలిసి ఒక గొప్ప కవిత్వ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందనుకుంటా. అది అత్యద్భుతంగానూ, కడు మనోహరంగానూ, దేదీప్యమానంగానూ వుంటుంది. తన మూలాల్నుంచి అద్భుతంగా పలకగలడు. గొప్పగొప్ప పాటల్ని కట్టగలడు. కట్టాడు. అతడొక జీవన నిర్మాత; నిత్య సంక్షోభ భరిత జీవితాన్ని కళామయం చేస్తూ, అద్భుత జీవన దృశ్యాల్ని మనకందించాడు. ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, దగ్గరనుంచి ఇప్పుడొస్తున్న ‘వల్లంకితాళం’ దాకా సజీవ దృష్టాంతాలు. Life sketches జీవన దృశ్య పరిమళాలు, శారీరక శ్రమల లోతుల సొంపు సోయగాలు. వెంకన్న పాటలు విన్నాక మనలో మనం దృశ్యమానం చేసుకున్నాక, మన రూపురేఖలే మారిపోతాయనుకుంటా. తీయని సుగంధాన్ని దేన్నో వెదజల్లుకుంటూ వెడతాడనుకుంటా. గొప్ప ఆర్ద్రజీవి. ప్రతి అంశంలోనూ అందాన్ని, శోభని చూడగల సౌందర్యవాది. సౌందర్యవాది తాత్వికుడయితే వెంకన్నలా వుంటాడు.
“అందాల తనువెల్ల వంపుకున్న అడవి
అలరించి తలపించె ఆకుపచ్చని కడలి”
షెల్లీ అనుకుంటా సముద్రాన్ని ‘వాటర్ మెడో’ అన్నాడు. అలవోకగా అద్భుతమయిన ఇమేజెస్ పడుతూ వుంటాయి. అవి జీవితం నుంచి, ప్రకృతి నుంచి, పరిసరాల నుంచి నేరుగా వచ్చినయి. చాలా అపురూపంగా, హాయిగా వుంటాయి. మనదయినతనమేదో వాటికంటుకుని వుంటుంది.
‘నీడల ఊడ’ అనే పాట చూడండి /“పూసిన పూలకు దోసిలొగ్గితె/ వాసన పరిమళమొంపునుర/ కోసి మెడలో వేసుకు తిరిగితె/ వాడి తాడయి మిగులునురా”
జీవనసారం నిలుపుకున్న పామరులే నిజసిద్ధులుగ
బావిల కప్పల బెకబెక అరిసే బోధకులెర్రి మొద్దులుర
వెంకన్న సారం నిలుపుకున్న, వడకట్టిన సిద్ధుడుగా పరిణామం చెందుతూ వస్తున్నాడు. అతని పాటలన్నీ ఈ పరిణామ ప్రతిఫలనాలే పైపైన పలకటం, పాడటం అతనివల్ల కాదు. నిండా మునగాలి, లోతులకెళ్లి జీవనసారాన్ని తీసుకురావాలి. ‘నల్లతుమ్మ చెట్టు’గాని, ‘బెడలగువ్వ’గాని, ‘కానుగనీడ’గానీ, ఏదయినా సరే ఏ పాటయినా సరే, తనే పాటలా బయటికొస్తాడు. ‘సిగమొగ్గ’ పేరుతో ఉత్తరాంధ్రమీద గొప్పపాట కట్టాడు; ఉత్తరాంధ్ర చరిత్రని, దాని పోరాట పటిమని, దాని నైసర్గిక స్వరూపాన్ని, దాని జీవతత్వాన్ని అద్భుతంగా పట్టుకున్నాడు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే issues మీద రాసినా, దాన్నొక తాత్విక స్థాయికి తీసుకెళ్లే నేర్పు, ఇతర విషయాలతో లింకు చేసి మాట్లాడే నేర్పు, దాన్నొక కవితగా మలిచే గాఢత, మగ్నత వెంకన్నలో పుష్కలంగా వుందని ఈ సంపుటి రుజువు చేస్తుంది.వెంకన్నకడ్డేముంది. జీవనరథ్యలో వున్నాడు. జీవనస్థలిలో బతుకు పండుగ జరుపుకుంటున్నాడు. అతని పాటలన్నీ బతుకులను ఊరేగించటం, గొప్పగా మురిసిపోవటం,గొప్పగా ఆనందించటం, నృత్యం చేయటం. బతుకు గొప్పదనాన్ని మనముందు వారబోసుకుంటూ వెడుతున్న వెంకన్నకి అభినందనలు.

శివారెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News