Sunday, April 28, 2024

ఇక స్పీడ్‌గా గ్రీన్‌కార్డులు

- Advertisement -
- Advertisement -

Green card process to get easier

బైడెన్ కమిషన్ సిఫార్సులు
2023 మధ్యనాటికి బ్యాక్‌లాగ్ పూర్తి
కేవలం ఆరునెలల్లోనే జారీ గడువు

వాషింగ్టన్ : అమెరికాలో శాశ్వత నివాసయోగ్యతకు వీలు కల్పించే గ్రీన్‌కార్డుల జారీ నిర్ణయ కాలాన్ని తగ్గించాలనే సిఫార్సులపై వైట్‌హౌస్ అధికార వర్గాలు పరిశీలన జరుపుతున్నాయి. గ్రీన్‌కార్డుల నిర్ణయంలో జాప్యం, దరఖాస్తుల పరిశీలనలో జాప్యాన్ని తగ్గించాలని ఇటీవలే ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సులు వెలువరించింది. గ్రీన్‌కార్డుల కోసం అభ్యర్థిత్వాల వెల్లువ ప్రత్యేకించి భారత్ , ఇతర ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ఉంటోంది. గ్రీన్‌కార్డుల కోసం పడిగాపులతో ప్రాధ్యానతగల ఉద్యోగాలలో ఉన్న ఐటి యువత పలు రకాలుగా చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ దశలో గ్రీన్‌కార్డుల జారీకి, దరఖాస్తుల పరిశీలనకు గడువును కేవలం 6 నెలలుగా ఖరారు చేయాలని ప్రతిపాదన వెలువడింది. ఇక పేరుకుపోయిన గ్రీన్‌కార్డుల అంశం పరిష్కారాన్ని అంటే బ్యాక్‌లాగ్‌ల విషయాన్ని 2023 ఎప్రిల్ నాటికి పూర్తి చేయాలని కూడా ప్రెసిడెన్షియల్ కమిషన్ ప్రధాన సిఫార్సు చేసింది. దేశంలో ప్రతిభాయుత ఉద్యోగ వనరులకు ప్రతిబంధకం అవుతోన్న ఈ గ్రీన్‌కార్డు జారీల జాప్యం పరిష్కారానికి దేశాధ్యక్షులు స్పందించి కమిషన్ ఏర్పాటు చేశారు.

ఈ కమిషన్ సిఫార్సులు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. త్వరితగతిన గ్రీన్‌కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటే, సిఫార్సులు అమలులోకి వస్తే వందలు వేలాది మంది వలసదార్లు అయిన ఉద్యోగులు వారి కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రత్యేకించి అత్యధికంగా భారతీయులు చైనా వారికి ప్రయోజనం సమకూరుతుంది. ఆసియన్ అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ దీవులకు చెందిన వారి విషయాలను పరిశీలించేందుకు ప్రెసిడెంట్ సలహా సంఘం ఏర్పాటు అయింది. ఒక్కరోజు క్రితమే ఈ కమిషన్ తమ సిఫార్సుల నివేదికను వెలువరించింది. నిజానికి మే 12ననే కమిషన్‌లో ఆమోదం దక్కిన ఈ సిఫార్సులను ఆగస్టు 24వ తేదీన ప్రెసిడెంట్ కార్యాలయానికి పంపించారు. సిఫార్సులను వైట్‌హౌస్ దేశీయ విధాన మండలి క్షుణ్ణంగా తొలుత పరిశీలిస్తోంది. తరువాత వీటిని దేశాధ్యక్షులు జో బైడెన్ తుది నిర్ణయానికి పంపిస్తారు. గ్రీన్‌కార్డు అమెరికా నివాసయోగ్యానికి అత్యంత కీలకమైన గుర్తింపు ప్రక్రియగా ఉంది. అమెరికాకు వలస వచ్చే ఇతర దేశాల వారికి అమెరికాలో శాశ్వత నివాస యోగ్యతను కల్పించేందుకు అన్ని విషయాలను ఆరాతీసిన తరువాత స్టాంపింగ్ వేసి గ్రీన్‌కార్డు వెలువరిస్తారు. ప్రత్యేకించి విదేశీ ఉద్యోగ వర్గాలలో గ్రీన్‌కార్డులు రావడం లక్కీటాటరీ తగిలినంత సంతోషానికి దారితీస్తుంది. ఈ కార్డును కలిగి ఉండే వారు అధికారికంగా అమెరికాలో ఉండేందుకు వీలేర్పడుతుంది.

వర్క్ పర్మిట్‌దార్లకు 365 రోజుల వెసులుబాటు?

వర్క్ పర్మిట్ హోల్డర్లకు ప్రస్తుత బ్యాక్‌లాగ్‌తో అమెరికా విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. ఇప్పుడు వర్క్‌పర్మిట్‌పై ఉన్నవారి అధీకృత పని గడువు ముగిస్తే రిన్యూవల్స్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ఇప్పటివరకూ వెనువెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగింపు ప్రక్రియ ఉంది. అయితే ఈ వెసులుబాట్ల పరిమితిని ఇకపై వర్క్ పర్మిట్‌దార్లకు 365 రోజులకు పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది. బ్యాక్‌లాగ్ సమస్య పరిష్కారానికి అత్యధిక సంఖ్యలో సిబ్బందిని తీసుకోవాలని , నిర్ణీత గడువులోగానే గ్రీన్‌కార్డుల జాప్యం సమస్య పరిష్కారం కావాలని ప్రెసిడెన్షియల్ కమిషన్ స్పష్టం చేసింది. కనీసం అదనంగా 300 మంది వరకు అయిన అధికారులను నియమించుకుని త్వరిగతిన గ్రీన్‌కార్డుల సమస్య పరిష్కారించాలని సూచించారు. ఇక వర్క్ పర్మిట్‌హోల్డర్లకు అంటే తాత్కాలిక ఉద్యోగాల అవకాశానికి వీలయ్యే హెచ్ 1బి, హెచ్ 2 ఎ వీసాలపై నిర్ణయానికి సమయాన్ని కేవలం రెండు నెలలుగానే ఖరారు చేయాలని సిఫార్సు వెలువరించారు.

ప్రవాస భారతీయుడు అజయ్ జైన్ విశేష కృషి

సిలికాన్ వ్యాలీకి చెందిన భారతీయ సంతతి అమెరికా పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భూటోరియా ఈ గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం నివారణకు చొరవ చూపారు. బైడెన్ ఎన్నికల ప్రచారం తొలిరోజు నుంచి కూడా జైన్ బైడెన్ విజయానికి అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే యత్నాలు చేపట్టారు. బైడెన్ ఎన్నిక అయిన తరువాత ఈ గ్రాన్‌కార్డుల విషయం గురించి తనకు అందిన వివిధ స్థాయిల సమాచారాన్ని క్రోడీకరించుకుని బైడెన్ పరిశీలనకు అభ్యర్థన పంపించారు. కమిషన్ తొలి సమావేశం మే నెలలో జరిగినప్పుడే అందిన ఈ ప్రతిపాదనకు కమిషన్‌లో ఏకగ్రీవ ఆమోదం దక్కింది. కొవిడ్ ప్రభావిత మూసివేతలు, సిబ్బంది పరిమితం, అంతకు ముందు 2017 ప్రయాణ నిషేధాల ప్రభావం వంటి అంశాలతో గ్రీన్‌కార్డుల జారీకి ఉండే వార్షిఖ పరిమితిని సరైన రీతిలో భర్తీ చేయడం కుదరలేదని కమిషన్ అభిప్రాయపడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో వార్షికంగా 2,26,000 గ్రీన్‌కార్డుల జారీకి అవకాశం ఉంది. అయితే ఇక్కట్ల వల్ల కేవలం 65,452కుటుంబప్రాతిపదిక ప్రాధాన్యతా గ్రీన్‌కార్డులు జారీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా భారీ స్థాయిలో నెలకొన్న బ్యాక్‌లాగ్‌లపై ఇప్పుడు దృష్టిసారింంచనున్నారు. వచ్చే ఏడాది ఎప్రిల్ నాటికి ఈ జాప్యాన్ని నివారించి తీరాలని కమిషన్ స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News