Monday, April 29, 2024

హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురి..

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. అతడ్ని ఎలాగైనా మట్టుబెట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. అతడు తమ ఒక్కరికే కాదు యావత్ ప్రపంచానికి శత్రువు అంటూ ఇజ్రాయెల్ భద్రతా బలగాలు(ఐడిఎఫ్) ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేశాయి. ఇంతకీ హమాస్ మిలిటెంట్లకు నాయకత్వం వహిస్తున్నడు ఎవరు అంటే.. అతని పేరు యాహ్యా సిన్‌వార్. యాహ్యా అసలు పేరు యహ్యా ఇబ్రహీం హస్సన్ సిన్‌వార్. 1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. అతడి పూర్వీకులు 1948 వరకు నేటి దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. అప్పట్లో ఈ ప్రదేశం ఈజిప్ట్ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత సిన్‌వార్ కుటుంబం గాజాకు తరలివెళ్లింది. అతడు గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

సిన్‌వార్ రెండు దశాబ్దాల పాటు జైల్లో గడిపాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరంపై తొలిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై.. మరొకరితో కలిసి మజ్ద్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్‌లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకొన్నవారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్‌వార్ 1988లో అరెస్ట్ కాగా 1989లో ఇతడికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత పలు మార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించి దొరికిపోయాడు. 2008లో ఇతడి మెదడులో కణితి రావడంతో శస్త్రచికిత్స చేశారు. 2011లో ఇతడి జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. 2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ మొత్తం 1,026 మందిని విడుదల చేసింది. వీరిలో సిన్‌వార్ కూడా ఉన్నాడు.

హమాస్‌లో నంబర్-2 స్థానం…
హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరోకు ఇస్మాయిల్ హనియా అధ్యక్షుడు. అతడు స్వచ్ఛందంగా ప్రవాసంలో ఉంటున్నాడు. దీంతో గాజాపట్టీలో అప్రకటిత పాలకుడు సిన్‌వారే. అతడు ఇజ్రాయెల్ రాజీని అంగీకరించడని.. దాడులకే మొగ్గు చూపుతాడనే పేరుంది. ఇజ్రాయెల్‌పై దాడుల్లో సిన్‌వార్ కీలక పాత్ర పోషించినట్లు ఐడిఎఫ్ ఆరోపిస్తోంది. శనివారం ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ రిచర్డ్ హెక్ట్ మాట్లాడుతూ సిన్‌వార్ రాక్షసుడు. ఈ దాడుల మాస్టర్‌మైండ్ అతడే అని వెల్లడించారు. సిన్‌వార్‌ను ఇజ్రాయెల్ ఏమాత్రం సహించదని చెప్పారు. సిన్‌వార్‌తో సహా అతడి బృందం మొత్తం మా లక్ష్యాల జాబితాలో ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News