Saturday, April 27, 2024

రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా మంత్రులు పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీశ్ రావుతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. “రైతుల బాధలను చూస్తుంటే గుండె కదిలిపోతోంది. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఒక్కోరైతు నాలుగైదు బోర్లు వేసి అప్పులపాలయ్యారు. గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసింది.

నీళ్లందించడం విఫలమైన ప్రభుత్వం రైతుకు వెంటనే ఎకరానికి 25 వేల నష్ట పరిహారం చెల్లించాలి. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతారు. కాంగ్రెస్ హామీ ప్రకారం వచ్చని వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. బోనస్ ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌కు లేదు.

ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడు. రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదు. ధైర్యం చెప్పడం లేదు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు వాళ్లు గుణపాఠం చెప్తారు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News