Sunday, May 12, 2024

2021 వరకూ మనతోనే కరోనా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా వైరస్ 2021 వరకూ మనతోనే ఉంటుందని ప్రపంచస్థాయి ప్రముఖ ఆరోగ్య నిపుణులిద్దరు తెలిపారు. వైరస్ ఇప్పట్లో తొలిగిపోదని, ఈ దశలో మనం చేయాల్సింది దీని వ్యాప్తిని కట్టడి చేయడమే అని స్పష్టం చేశారు. విస్త్రత స్థాయిలో వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం వల్లనే దీని వ్యాప్తిని సకాలంలో నివారించడం జరగుతుందని తెలిపారు. అమెరికా ఆరోగ్య నిపుణులు అశిష్ ఝా, స్వీడన్ ప్రొఫెసర్ జోహన్ గిసెకా తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిపిన ఇష్టాగోష్టిలో ఈ విషయాలను ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు వైరస్ వ్యాక్సిన్ వచ్చే వీలు లేదని, అయితే ఓ ఏడాదిలో సరైన మందు వస్తుందని ప్రొఫెసర్ ఝా విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం మీద కరోనా వైరస్ అనేది 12 నుంచి 18 నెలల గడ్డు సమస్య అని, ఈ ఏడాదంతా మనుష్యులు దీనితో గడపాల్సి ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో లాక్‌డౌన్ తక్కువ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని, తీవ్రస్థాయి లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని స్వీడన్ ప్రొఫెసర్ తెలిపారు. ప్రపంచవ్యాప్త ప్రమాదకర వైరస్‌పై విస్తృతస్థాయిలో రాహుల్ గాంధీ వీరితో జరిపిన ఇంటర్వూ వివరాల సీరిస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికలలో చోటుచేసుకుంది.

లాక్‌డౌన్ తరువాతి దశ ఇండియాకు చాలా కీలకమని , ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఆరంభం అయినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని ప్రొ ఝా తెలిపారు. ప్రజలలో అన్ని స్థాయిలలో విశ్వాసం పునరుద్ధరించాల్సి ఉందన్నారు. హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టూట్‌కు అనుబంధ సంస్థలో ఆయన ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2021 వరకూ ప్రపంచం ఈ వైరస్ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదని తెలిపారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో వైద్య పరీక్షలు జరగాల్సి ఉందన్నారు. కోవిడ్ 19తో మనిషి జీవితం పూర్తి స్థాయిలో మారుతోందని, కోవిడ్‌కు ముందు తరువాత మనిషి అనే విశ్లేషణలు చేసుకోవల్సి ఉంటుందని అనుసంధానకర్తగా ఉన్న రాహుల్ వ్యాఖ్యానించారు. 9/11 ఓ కొత్త అధ్యాయం అనుకుంటూ వచ్చారు. అయితే కోవిడ్ 19 ఓ కొత్త పుస్తకం అయి కూర్చుందని స్పందించారు.

ఇదో కార్చిచ్చు, అందరికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కార్చిచ్చుగా వ్యాపిస్తోందని, దాదాపుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ దీనితో ఏదో ఒక విధంగా ప్రభావితం అవుతాడని ప్రొఫెసర్ గిసెకీ అభిప్రాయపడ్డారు. తీవ్రస్థాయి లాక్‌డౌన్‌తో ఇండియాలో ఇబ్బంది ఏర్పడుతుందని, ఇదే సమయంలో దశలవారిగా లాక్‌డౌన్ సడలింపులు ఉండాలని సూచించారు. సడలింపులు రెండు మూడు వారాలు ఇచ్చిచూడండి ఏం జరుగుతుందో చూడండి, తరువాత పరిస్థితిని బట్టి కట్టడికి దిగండని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు అంటువ్యాధుల అంతకు మించి ఇటువంటి మహమ్మారిల దశలోకి చేరుకొంటోందని, దీనిని ముప్పు యుగంగా భావించాల్సి ఉంటుందని ప్రొఫెసర్ ఝా అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ చిట్టచివరి భారీ మహమ్మారి అనుకోవడానికి వీల్లేదని, వచ్చే 20 ఏండ్లలో ఇటువంటివి మరెన్నో వచ్చిచేరుతాయని హెచ్చరించారు. ప్రస్తుత కరోనా వైరస్ గబ్బిలాలలోనే ఉంటూ వచ్చింది. అయితేదీని జన్యువులలో స్వల్పస్థాయి మార్పులతో ఉన్నట్లుండి ఇది మనిషికి సోకిందని, దీనితోనే విపరీత పరిణామాలు సంభవించాయని తెలిపారు. పర్యావరణ, వాతావరణ మార్పులు ఇక ముందు అనేక తీవ్ర పరిణామాలను తెచ్చిపెడుతాయని, వైద్య ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

వందేళ్ల యమడేంజర్
వంద ఏళ్ల చరిత్రను చూస్తే ఇటువంటి పరిణామాలు అడపాదడపా సంభవిస్తూ వచ్చాయని, అయితే ఈ వందేళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రస్థాయి పరిణామం ఇదని ఝా స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వస్తుందని, అయితే సమీప దశలో ఇది అందుబాటులోకి రాదని ఘా తెలిపారు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత భారతదేశంలో ఇది ఏ స్థాయిలో వాడాల్సి ఉంటుందనేది ఖరారు చేసుకోవల్సి ఉంటుందని అన్నారు. వైరస్ నగరపట్టణ జీవన విధానాలను మార్చివేస్తుందని నిపుణులతో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలిపారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలో కొట్టేచ్చే మార్పు కనబడుతుందన్నారు. ప్రజలు సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మతం, వర్గం కులం ఇతరత్రా వర్గీకరణలతో ఇటువంటి తీవ్ర సమస్యలను తిప్పికొట్టలేమనే విషయాన్ని అంతా గుర్తిస్తారని రాహుల్ అభిప్రాయపడ్డారు. వైరస్ సవాలుగా నిలిచిందని, అయితే ఆపద కాలంలోనే దీనిని అవకాశంగా మల్చుకోవల్సి ఉంటుందని , సమిష్టి తత్వంతో సవాలును ఎదుర్కొనే పద్ధతి నేర్చుకున్నట్లు అవుతుందని తెలిపారు.

Health Experts interview with Rahul on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News