Monday, May 6, 2024

మరో 24 గంటలపాటు దేశంలో వడగాడ్పులు

- Advertisement -
- Advertisement -

Heat Waves in country for another 24 hours

 

పురోగతిలో నైరుతి పవనాలు
ఉత్తర కర్నాటక, తెలంగాణల్లో తీవ్ర వడగాడ్పులు,
29,30 తేదీల్లో ఉత్తరాదిలో వానలు, తుపాన్లు

న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో అనేక చోట్ల నైరుతి పవనాలు మరింత పురోగతి లో ఉన్నప్పటికీ దేశంలో ఉత్తరాది, మధ్యభారతం లోని వివిధ ప్రాంతాల్లో వీస్తున్న వడగాడ్పులు మరో 24 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది. ఉత్తరాది, మధ్యభారతంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటుతున్నాయి. పొడిబారిన వాయువ్య గాలులు వాయువ్య, మధ్యభారతం,అనుసరించి ఉన్న తూర్పుభారతం అంతర్భాగ మైదానాల్లో ఆవరించి ఉన్నందున ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు కొనసాగుతాయని చెప్పింది. విదర్భ, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వివరించింది. హర్యానా,చండీగఢ్,ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌ల్లోనే కాకుండా పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, మధ్యమహారాష్ట్ర, మరట్వాడా, తెలంగాణ, ఉత్తర కర్నాటక తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వచ్చే 24 గంటల్లో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని హెచ్చరించింది.

పశ్చిమాన అల్పపీడనం కారణంగా ఈనెల 29,30 తేదీల్లో కొద్దిగా వానలు కురుస్తాయని, ఈ సమయంలో ఉత్తరాదిలో ఇసుక తుపాన్లు, ఉరుములు, మెరుపులతో కూడిన తుపాన్లు వస్తాయని వాతావరణ విభాగం సూచించింది. మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమాన అల్పపీడనం వ్యాపించి తుపాను వాతావరణం ఏర్పడుతుందని, మధ్య ఆసియా మీదుగా ప్రయాణించి హిమాలయాలను తాకినప్పుడు కొండల్లో, మైదానాల్లో వర్షాలు కురుస్తాయని తెలియచేసింది. నైరుతి పవనాల పురోగతి గురించి ప్రస్తావిస్తూ జాతీయ వాతావరణ పరిశోధక విభాగం బంగాళాఖాతం దక్షిణాన కొన్ని ప్రాంతాల్లో, అండమాన్ నికోబార్ దీవుల సముద్రం లోని అనేక చోట్ల, నైరుతి పవనాలు వ్యాపిస్తాయని వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News