Saturday, April 27, 2024

ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై హైకోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

High Court hearing on Osmania hospital demolition

హైదరాబాద్:  ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దని కొందరు, కూల్చివేసి కొత్తగా నిర్మించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రి గూగుల్ మ్యాప్, సైట్ ప్లాన్ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. పిటిషనర్లకు కూడా మ్యాపులు ఇవ్వాలని అడ్వకేట్ బిఎస్.ప్రసాద్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మ్యాపులను విశ్లేషించి వాదనలకు సిద్ధం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాదులకు హైకోర్టు తెలిపింది.మూడు బ్లాకుల్లో హెరిటేజ్ భవనం ఉందని.. అది కాకుండా మరో 15 ఎకరాల్లో మిగతా ఆస్పత్రి ఉన్నట్టు పటాల్లో ఆర్ అండ్ బి పేర్కొంది.

ఆధునిక, సమీకృత ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎజి బిఎస్.ప్రసాద్ పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రస్తుత భవనం కూల్చాల్సిందేనా? వివాదాస్పద హెరిటేజ్ భవనం పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో నిర్మించవచ్చా? వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. సుదీర్ఘ విచారణ జరగాల్సి ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా హైకోర్టు తెరిచాక నేరుగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి కోరారు. అయితే వైద్యులు, పేషంట్లు ఇబ్బంది పడుతున్నారని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే త్వరగా పూర్తి చేయాలని న్యాయవాది సందీప్ రెడ్డి కోరారు. తేల్చిన వెంటనే భవనం కట్టేస్తారా అన్న హైకోర్టు.. పోలీస్ జంట భవనాల నిర్మాణం ఆరేళ్లుగా సాగుతోందని ఉదహరించింది. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

పింఛనర్ల పిటిషన్‌పై: పింఛనర్ల పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం నాడు విచారణ జరిపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పింఛనర్ల పిటిషన్‌పై ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు అసెంబ్లీ సమావేశాలోపు పింఛనర్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని వెల్లడించింది. లేని పక్షంలో తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 1కు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News