Saturday, April 27, 2024

మరోసారి భూముల అమ్మకానికి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

HMDA is preparing to sell land in the suburbs

హైదరాబాద్ : మహానగర శివారులోని భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండిఎ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే నగర శివారులోని హెచ్‌ఎండిఏకు చెందిన సొంత భూములున్న పరిశీలించి నాలుగు ప్రదేశాలను ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం హెచ్‌ఎండిఏ ప్రతిపాదనలు పంపించినట్టుగా తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే భూములను వేలం వేయాలని హెచ్‌ఎండిఏ భావిస్తోంది. నగర శివారు ప్రాంతంలో అత్యాధునిక ప్రపంచస్థాయి టౌన్‌షిప్‌లను ప్రమోట్ చేయాలని భావిస్తున్న హెచ్‌ఎండిఏ సంస్థ తమ సొంత భూములను విక్రయిండం ద్వారా టౌన్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన భారీ పథకాలను కార్యరూపంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టుగా సమాచారం. హెచ్‌ఎండిఏ సంస్థను మరింత ఆర్థిక బలోపేతం చేసేందుకు ఈ భూములను వేలం వేయాలని నిర్ణయించినట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

గజం ధర రూ.50 నుంచి 60 వేలకు పైగా…

అందులో భాగంగానే శివారులోని ఇజ్జత్‌నగర్, తెల్లాపూర్, మోకిల, కోకాపేట్‌లలోని అథారిటీకి సొంత భూములున్నాయి. వీటిని టౌన్‌షిప్‌లకు ఉపయోగపడేలా లే ఔట్లను అభివృద్ధి చేసి విక్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెల్లాపూర్, మోకిల, కోకాపేట్‌లలో ఇప్పటికే గజం ధర రూ.50 నుంచి 60 వేలకు పైగా పలుకుతోం ది. ఈ నేపథ్యంలోనే టౌన్‌షిప్‌ల నిర్మాణాలకు ఉపయోగపడేలా లే ఔట్లు చేసి ప్లాట్లను అమ్మాలని హెచ్‌ఎండిఏ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇలా చేయడంతో భూ ముల వేలం కన్నా అధికంగా ఆదాయం వచ్చే అవకాశముందని, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి అందచేసిన నివేదికలో హెచ్‌ఎండిఎ అధికారులు పేర్కొన్నట్టుగా తెలిసింది.

రూ.1,500 నుంచి 2 వేల కోట్ల ఆదాయం

హైదరాబాద్ శివారులోని మోకిలలో సుమారు 40 ఎకరాలు, ఇజ్జత్‌నగర్‌లో 30 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, కోకాపేట్‌లో 105 ఎకరాలు హెచ్‌ఎండిఎకు ఉన్నాయి. వీటిని లే ఔట్లుగా అభివృద్ధి చేసి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లే ఔట్లు చేసి భూములను విక్రయించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని హెచ్‌ఎండిఏ ప్రభుత్వానికి నివేదిక పంపినట్టుగా తెలిసింది. హెచ్‌ఎండిఎ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ ప్రతిపాదనను కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, ప్లాట్లను ఎంత విస్తీర్ణంతో ఏర్పాటు చేయాలన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. ప్రధానంగా ఆకాశ హర్మాలను నిర్మించేందుకు వీలుగానే ప్లాట్ల విస్తీర్ణాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో హెచ్‌ఎండిఏ ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలంతో విపరీతంగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మోడల్ టౌన్‌షిప్‌లను తీసుకురావాలని హెచ్‌ఎండిఏ సంస్థ భావిస్తోంది. ఈ భూములను విక్రయించడం ద్వారా కనీసంగా రూ. 1,500ల నుంచి రూ.2 వేల కోట్లు అర్జించాలనే యోచనలో హెచ్‌ఎండిఏ ఉన్నట్టుగా సమాచారం.

ధర నిర్ణయింపు బాధ్యత థర్డ్ పార్టీకి…

ఇజ్జత్‌నగర్, తెల్లాపూర్, మోకిల, కోకాపేట్‌లలో ఏర్పాటు చేసే లే ఔట్లలోని ప్లాట్లకు సంబంధించి చదరపు గజం ధరను నిర్ణయించేందుకు థర్డ్ పార్టీ నివేదికను పరిగణలోకి తీసుకోవాలని అథారిటీ భావిస్తోంది. దీనికి థర్డ్ పార్టీగా ఒక కన్సల్టెన్సీని నియమించి ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో చ.గ. ధర ఏమేరకు నడుస్తోంది. అనుమతి ఉన్న లే ఔట్లలో ఎలా ఉంది. మార్కెట్‌లో ప్లాట్లకు గిరాకీ ఉందా.. లేదా..? వంటి విషయాలపై అధ్యయనం చేయించి నివేదిక తెలిపిన విషయాలను పరిగణలోకి తీసుకుని చ.గ. ధరను నిర్ణయించాలని హెచ్‌ఎండిఏ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ లే ఔట్లలోని ప్లాట్లన్నీ ఆన్‌లైన్‌లోనే వేలం వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలో దీనిపై ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని, వచ్చే నెలలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా హెచ్‌ఎండిఏ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News