Saturday, April 27, 2024

గంగమ్మ ఒడికి గణపయ్యలు

- Advertisement -
- Advertisement -

Hyderabad Ganesh Idols Immersion

రాష్ట్రవ్యాప్తంగా భక్తుల కోలాహలం మధ్య గణేశ్ నిమజ్జనాలు
ఆరుగంటల పాటు కొనసాగిన మహా గణపతి శోభాయాత్ర
ట్యాంక్‌బండ్‌కు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలో దాదాపు గణేశులను ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో భక్తులు నిమజ్జనం చేశారు. అన్ని చోట్లా ఉదయం నుంచే శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో భక్తుల కోలాహలంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.

మధ్యాహ్నం వర్షం కురవడంతో….

భాగ్యనగరంలో గణేశ్ శోభాయాత్ర కన్నులపండుగగా సాగింది. నవరాత్రి పూజలు అందుకున్న గణపయ్యలు నిమజ్జనానికి క్యూ కట్టారు. సాయంత్రం వరకు నగరంలో సుమారు 485 వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరాయి. అయితే మధ్యాహ్నం వర్షం కురవడంతో గణేశ్ శోభాయాత్రను భక్తులు అలాగే కొనసాగించారు. చిరుజల్లుల్లో తడుస్తూ భక్తులు గణపయ్య విగ్రహాల ముందు స్టెప్పులేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు రంగంలోకి దిగి వెంటనే క్లియర్ చేశారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు పోలీస్‌స్టేషన్లకు సిసి టివి కెమెరాలు అనుసంధానం చేయడంతో వీలైనంత త్వరగా అన్నిచోట్ల నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకున్నారు. పది అడుగుల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పివి మార్గ్ వైపు, పది అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తరలించి త్వరగా నిమజ్జనాలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.

8.18 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి…

ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ తల్లి ఒడికి చేరుకున్నారు. తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకొని గణనాథులు నిమజ్జనమయ్యారు. ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన శ్రీ పంచముఖ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఆరు గంటల పాటు సాగింది. మహాగణపతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరాగా మహాగణపతికి ట్యాంక్‌బండ్‌పై గంటపాటు పూజలు చేశారు. అనంతరం మహా గణపతిని జలప్రవేశం చేయించారు.

ఈసారి కూడా అదే ట్రెండ్

ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. గణపతిబప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం అంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దపండుగే. ఏటా నిమజ్జనం రోజు భారీ గణపయ్యని చూసేందుకు వేలాది మంది తరలివస్తారు. నగరం నలుమూలల నుంచే కాదు పక్క జిల్లాల నుంచీ గణేషుడిని చూసేందుకు వచ్చారు. ఈసారి కూడా అదే ట్రెండ్ నడిచింది.

బాలాపూర్ లడ్డూ రూ.18.90 లక్షలకు…

భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో కీలకఘట్టమైన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో మరోసారి రికార్డు ధర పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూను రూ.18.90 లక్షలకు ఎపి ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఆయన స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డితో కలిసి దక్కించుకున్నారు.

1,200 మంది పోలీస్ సిబ్బంది

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు రాత్రి వరకు జరిగాయి. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ మేరకు బందోబస్తులో భాగంగా 1,200 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

నల్లగొండ జిల్లాలో జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రను పూజలు నిర్వహించి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. మంత్రితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News