Monday, May 6, 2024

ప్రాణానికి ప్రాణం.. మెట్రోలో ప్రయాణం

- Advertisement -
- Advertisement -

 నిండు ప్రాణాలను కాపాడిన మెట్రో రైలు
 అరగంటలో 16 స్టేషన్లు, 21కిలోమీటర్లు
 కామినేని ఆసుపత్రి నుంచి అపోలోకు గుండె తరలింపు అపోలో వైద్యులు డా. గోఖలే నేతృత్వంలో మరొకరికి గుండె అమరిక
 ఇలాంటి అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం : మెట్రో అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో మెట్రో రైలు నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఓ నిండు ప్రా ణాన్ని కాపాడింది. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న రోగికి మార్పిడి చేయడం కోసం ఎల్‌బినగర్‌లోని కామినేని ఆసుప్రతి నుంచి గుండె ను తరలించారు. నాగోల్‌లో ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి గుండెను మధ్యాహ్నం 3.30 గంటలకు తరలించారు. మొత్తం 21 కిలోమీటర్లు…16 స్టేషన్లు కాగా నాగోల్, జూబ్లీహిల్స్ మధ్య ఈ రైలు నడిచింది. కేవలం 30 నిమిషాల లోపుగానే గంట కు 40 కిలోమీటర్ల వేగంతో జూబ్లీహిల్స్ చేరింది. అన్ని స్టేషన్లులోనూ పిఏ సిస్టమ్ ద్వారా ఈ ప్రత్యేక రైలు గురించి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి గుండెను ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో గుండెను శస్త్రచికిత్స ద్వారా వేరొకరికి అమర్చేందుకు అపోలో వైద్యులు ఏర్పాట్లు చేశారు. డా. గోఖలే నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి ఎల్‌అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండి కెవిబీరెడ్డి మాట్లాడుతూ తాము ఎల్లప్పుడు ప్రజలు సేవలో ఉంటామని, ఓనిండు ప్రాణం కాపాడటానికి తమ వనరులన్నీ ఉపయోగించుకునేందుకు భగవంతుడు మాకు ఓ అవకాశం అందించారన్నారు. కామినేని, అపోలో ఆసుపత్రులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. మేము అన్ని భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక రైలును నాగోల్ నుండి జూబ్లీహిల్స్‌కు ఎక్కడ ఆపకుండా నడిపామని, తద్వారా సమయానికి గుండెను తరలించి ఓనిండు ప్రాణాన్ని కాపాడామని హర్షం వ్యక్తం చేశారు.

నర్సిరెడ్డీ… నలుగురిలో ఉన్నావ్
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45)ది సాధారణ వ్యవసాయ కుటుంబం. తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం బోర్ బండిపై సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 31న ఉదయం బైక్‌లో భువనగిరి రోడ్డులోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోసుకుని అక్కడే ఆకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఎల్‌బినగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. నర్సిరెడ్డికి చికిత్స చేస్తున్న డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్టు గుర్తించి సోమవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు నర్సిరెడ్డి భార్య, కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు నిర్ణయించుకున్నారు.

జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి గుండెమార్పిడి అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చేందుకు వైద్యులు నిర్ణయించుకుని నాగోల్ నుంచి మెట్రో రైల్ ద్వారా జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిత్యం పట్టణంలో అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడే నర్సిరెడ్డి తమ మధ్య లేడని స్నేహితులు, బంధువులు బాధపడ్డారు. అవయవ దానం చేసి మరో నలుగురిలో బతికే ఉన్నాడని చెమర్చిన కళ్లతో హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మృతునికి భార్య నిర్మల, కుమారులు శశిధర్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డిలు ఉన్నారు. నర్సిరెడ్డికి స్వంత ఇల్లు కూడా లేకపోవడం, కుమారులిద్దరు చిన్నవారే కావడం, ఆస్తిపాస్తులు కూడా పెద్దగా లేకపోవడంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Hyderabad metro to transported heart for Patient

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News