Monday, April 29, 2024

థర్డ్ వేవ్ ప్రారంభ సంకేతాలపై ఐసిఎంఆర్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ICMR Warning on Covid Third Wave Early Signs

న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని కేంద్రం నేతృత్వం లోని కమిటీ గతం లోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా అనేక కీలక విషయాలు వెల్లడించారు. సెకండ్ వేవ్ తీవ్రత పెద్దగా లేని రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ ట్రెండ్ థర్డ్‌వేవ్ ప్రారంభ సంకేతాలను చూపుతుందని హెచ్చరించారు. సెకండ్ వేవ్ ప్రారంభ దశలో అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతోపాటు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేశాయని చెప్పారు. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, పరిస్థితుల నుంచి నేర్చుకున్నాయని, ఈ కారణాలతో ఆ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ అంత తీవ్రతను చూపలేదని తెలిపారు.

అయితే ఇప్పుడు మూడో ముప్పుకు అక్కడ అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోన్న కేసులు కూడా ఈ పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. కొవిడ్ కేసుల సంఖ్య, గత రెండు దఫాల్లో వైరస్ విజృంభణ ఆధారంగా థర్డ్‌వేవ్‌పై సిద్ధం కావాల్సి ఉందన్నారు. అలాగే ఈ సమయంలో అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించడంపై ఆలోచిస్తున్నాయి. దీనిపై పాండా స్పందిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు అందరూ టీకాలు పొందాల్సి ఉందన్నారు. అలాగే కొవిడ్ నియమావళిని పాటించాలని చెప్పారు. సెకండ్ వేవ్‌తో తీవ్ర ప్రభావానికి గురైన రాష్ట్రాలు పాఠశాలలను తిరిగి తెరవవచ్చని సూచించారు. అదే సమయంలో వైరస్ ఉధృతిని అంతగా చవిచూడని రాష్ట్రాలు మాత్రం క్రమంగా పాఠశాలలు తెరవడంపై దృష్టి సారించాలని చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించిన నాలుగో సీరో సర్వే ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు వైరస్ బారిన పడినట్టు స్పష్టమైందన్నారు. పెద్దల కంటే కొంచెమే తక్కువ కాబట్టి అనవసర భయానికి గురికావొద్దని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News