Monday, April 29, 2024

ఆమరణ దీక్ష చేస్తాం

- Advertisement -
- Advertisement -

కొత్త చట్టాల రద్దు డిమాండ్‌ను 19లోగా ఆమోదించకపోతే నిరవధిక నిరశన తప్పదని కేంద్రానికి హెచ్చరించిన రైతు సంఘాలు

 రేపు సింగ్ సరిహద్దులో నిరాహార దీక్ష
 చట్టాలను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం : రైతు నాయకుడు కమల్ ప్రీత్ సింగ్ పన్నూ
 త్వరలో భార్య, పిల్లలు, తల్లులు కూడా ఆందోళనలో చేరుతారని వెల్లడి
 దేశంలో ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నట్టు ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 17 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని తీవ్రం చేయాలని నిర్ణయించాయి. సోమవారం (14న) సింఘు సరిహద్దులో నిరాహార దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.అంతేకాదు ఈ నెల 19 లోగా తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆవమరణ దీక్షకు దిగుతామని కూడా వారు హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా సాగుతోందని, వివాదాస్పద చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. రైతు సంఘాలను విడదీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. అందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోను అవకాశమివ్వబోమని స్పష్టంచేశారు. ‘ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మేము పిద్ధం. అయితే ముందుగా మేము మూడు చట్టాల రద్దుగురించి చర్చిస్తాం’ అని సం యుక్త కిసాన్ ఆందోళన్ నాయకుడు కమల్‌ప్రీత్‌సింగ్ పన్నూ చెప్పారు. త్వరలో తమ భార్యలు, పిల్లలు, తల్లులు కూడా తమ ఆందోళనలో చేరుతారని, వారు ఉండడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పన్నూ చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా తమతో చేరడం కోసం బయలుదేరారని కూడా ఆయన తెలిపారు. రాజస్థాన్‌నుంచి రైతులు ఆదివారం ట్రాక్టర్లతో ర్యాలీగా వస్తారని, జైపూర్‌ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తారని రైతు నేతలు తెలిపారు.
హర్యానా రైతు నేతలతో తోమర్ చర్చలు
మరోవైపు హర్యానా రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం విజ్ఞాన్ భవన్‌లో సమావేశమైనారు. కొత్త రైతు చట్టాలపై పలు రైతు నేతలతో ఆయన చర్చ జరిపారు. రైతు సాధికారికత కోసమే కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని ఆయన వారికి వివరించారు. మంత్రితో చర్చలు జరిపిన రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు మద్దతు తెలియజేశారు.
హర్యానాలో టోల్‌ప్లాజాల ముట్టడి
ఆందోళన చేస్తున్న రైతులు శనివారం హర్యానాలో కొన్ని టోల్‌ప్లాజాలను ఆక్రమించి సిబ్బంది వాహనదారులనుంచి టోల్ వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య గత సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు టోల్‌ప్లాజాలను దిగ్బంధం చేస్తామని ఆందోళన చేస్తున్న రైతులు ఇంతకు ముందే ప్రకటించారు. భారతీయ కిసాన్ యూనియన్ నేతలు మాలిక్ సింగ్, మనీష్ చౌదరి నేతృత్వంలో వంద మందికి పైగా రైతులు అంబాలా హిసార్ హైవేపై ఉన్న ఒక టోల్ ప్లాజా వద్దకు చేరుకుని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టోల్‌ప్లాజా ఉద్యోగులు వాహనాలను టోల్ చెల్లించకుండానే వెళ్లడానికి అనుమతించారు. కర్నాల్ జిల్లాలోని బస్తరా, సియోం ట్ టోల్‌ప్లాజాల వద్ద కూడా ఆందోళనకారులు వాహనదారులనుంచి సిబ్బంది టోల్ వసూలు చేయనివ్వలేదు. హి సార్ జిల్లాలో నాలుగు టోల్‌ప్లాజాలను రైతులు ముట్టడించారు. పంజాబ్‌లో రైతులు గత అక్టోబర్ 1నుంచి టోల్‌ప్లాజాల వద్ద రైతులు ధర్నాలు చేస్తుండడంతో అక్కడ వాహనదారులనుంచి టోల్ రుసుము వసూలు చేయడం లేదు. టోల్‌ప్లాజాల వద్ద రైతుల ఆందోళన కారణంగా రాష్ట్రంలో నేషనల్ హైవేల అథారిటీ ఆఫ్ ఇండియాకు రోజుకు రూ.3 కోట్ల నష్టం వస్తోంది.

 

If laws repealed after we talk to Govt: Farmers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News