Saturday, April 27, 2024

దమ్ముంటే ఒక్క సీటు గెలువు

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ కు రేవంత్ సవాల్

కార్యకర్తల అండ ఉన్నంత వరకు నా కుర్చీని టచ్ చేయలేరు

మన తెలంగాణ/రంగారెడ్డి ప్రతినిధి: కాంగ్రెస్ కార్యకర్తల అండ ఉన్నంతవరకు నా కుర్చీని కూడా ఎవరూ తాకలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో నిర్వహించిన ‘జన జాతర’ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఈ సందర్భంగా ఆయన బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌కు సవాళ్లు విసిరారు. నా పే రు చెబితే మూడు సీట్లు కూడా రావని కెటిఆర్ వ్యాఖ్యానించారని, కానీ ఇదే చేవెళ్ల సభ నుంచే సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీ టైనా గెలిపించి చూపాలని రేవంత్ అన్నారు. ‘రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు.. తండ్రి పేరు చెప్పుకొని ప దవిలో కూర్చున్న వ్యక్తిని కాదు..కార్యకర్తల స్థాయి నుంచి సిఎం స్థాయికి ఎదిగాను…చంచల్‌గూడ జైళ్లో పెట్టినా… లొంగకుండా పోరాడాను..నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చాను..కార్యకర్తల అండ ఉన్నంత వరకు నా కుర్చీని ఎవరూ తాకలేరు’ అ ని రేవంత్ స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. ఆడబిడ్డల కళ్లల్లో కన్నీరు రాకుండా చూసుకుంటామన్నారు. మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని  అన్నారు. తమ పార్టీ అధినేత్రి సో నియా గాంధీ ఎన్నికల సమయంలో రంగారెడ్డి జిలా, తుక్కుగూడ బహిరంగ సభలో చేసిన ప్రకటన మేరకు రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు మహిళలకు ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచామని, ఇప్పుడు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్ పథకం అందజేస్తున్నామని అన్నారు. ఉచిత కరెంట్, రూ.500లకు గ్యాస్ పథకం కింద ప్రస్తు తం 40 లక్షల మంది అర్హ్హులను గుర్తించామని, రాని వారు స్థానిక తహసీల్దార్‌లకు ప్రజా పాలన దరఖాస్తులను అందజేస్తే పరిశీలించి అర్హ్హుల జాబితాలో చేరుస్తారని పేర్కొన్నారు.

ఆడబిడ్డల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మహాలక్ష్మిలను కోటిటీశ్వరులను చేయడానికి డ్వాక్రా మహిళా సంఘాలకు ఉచితం గా రుణాలు అందజేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురితో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల అమలులో వారిని భాగస్వామ్యం చేస్తామని అన్నారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు జాబితాలను తయారుచేసి ఇన్‌చార్జి మంత్రులకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్‌సిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 75 రోజుల్లోనే పాతిక వేల మందికి ఎల్.బి.స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలను అందించామని, మార్చి 2న మరో ఏడు వేల ఉద్యో గ నియామక పత్రాలను అందజేస్తామన్నారు. పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టడానికి పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల పుణ్యమా అని పథకాల అమలుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

పదేళ్ల కెసిఆర్ పాలనలో కష్టాలను ఎదుర్కొని, కేసుల పాలై, ఆస్తులను పోగొట్టుకుని, జెండా మోసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలను పూర్తిగా ఆదుకుంటామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ‘మీ అందరి కష్టంతోనే మేమంతా నేడు ఇక్కడ కూర్చున్నాం.. మీ అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం’ అని ప్రకటించారు. ‘రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరికీ పదవులు దక్కేలా చూస్తాం.. మీ త్యాగాలకు సరైన గుర్తింపు ఇస్తాం’ అని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చూడవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిత్యం పరితపిస్తుం టే.. ఇంట్లో కూర్చుని కల్వకుంట్ల కుటుంబం సొల్లు కబు ర్లు పలుకుతూ బురద చల్లడానికి ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘నీలాగ అయ్య పేరుతో అధికారంలోకి రాలేదు…..ఫిల్మ్‌నగర్‌లో సినిమా వాళ్ల గెస్టు హోస్‌లు నాకు ఇవ్వలేదు.. సోషల్ మీడియా వలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెబుతున్న కెటిఆర్ రాష్ట్రంలో ఉన్న చానళ్లు, పేపర్‌లు అన్నీ మీవే కదా.. మీ అయ్యలాగా పేపర్, చానళ్లు నాకు లేవు..యూట్యూబ్‌లు పెట్టుకుంటావో.. నీ ఇష్టం..మా కార్యకర్తలతో పెట్టుకుంటే మాడి మసైపోతవ్..’ అంటూ కెటిఆర్‌పై విరుచుకుపడ్డారు.

అధికారంలో ఉన్న పదేళ్లు అడవి పందుల్లాగా తెగ బలిశారని, అధికారం పోయేసరికి ఒకరు మూడు నెలలు, మరొకరు ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని.. ఇలాంటి వారిని కార్యకర్తలు గ్రామాల్లో వేపచెట్టుకు కట్టి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు. కాళేశ్వరం పేరుతో ఖజానాను లూఠీ చేశారని, మేడిగడ్డ, అన్నారం ఆగం అయ్యాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో మోడీ, కేడీలు మరోసారి జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని అన్నారు. మోడీ, కెసిఆర్ అల్లం, బెల్లం మాదిరిగా మంచి మిత్రులని, జనం ముందు మాత్రం శత్రువులుగా నటిస్తారని వ్యాఖ్యానించారు. కెటిఆర్ ని సిఎం చేయడానికి కెసిఆర్ మోడీ అనుమతి కోసం వెళ్లడం వారి దోస్తీకి నిదర్శమన్నారు. ‘గుజరాత్ మోడల్’ అంటూ దేశమంతా పగల్బాలు పలకడం తప్ప పదేళ్లలో మోడీ చేసిందేమీ లేదన్నారు. దేశ రాజధానిలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై కాల్పులు జరపడం తప్ప.. రైతు సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. 75 రోజులుగా ప్రతిరోజు 18 గంటలు కష్టపడుతున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి అందరి వద్దకు వస్తామన్నారు.

చేవెళ్ల ప్రాంతాన్ని ఎండబెట్టారు : భట్టి
కెసిఆర్ ప్రభుత్వం చేవెళ్ల ప్రాంతాన్ని ఎండబెట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ద్వారా చేవెళ్ల ప్రాంతానికి నీరు తీసుకురావడానికి సంకల్పిస్తే కెసిఆర్ దానికి పక్కన బెట్టి కృష్ణా జలాలను తీసుకువస్తామన్నారని, మరి ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజె క్టు ఒక్క పంపు బిగించ లేదని, ఈ ప్రాంతానికి నీరు వచ్చే లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం పేరతో డ్రామాలు ఆడి దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారన్నారు. కెసిఆర్ చేసిన అప్పులను కట్టడానికి ఖజానా ఖాళీ అవుతోందని. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రసంగించారు. శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్‌లు సునీతా రెడ్డి, అనితా రెడ్డి, శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ చెవెళ్ల ఇన్‌చార్జి భీంభరత్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News