Monday, April 29, 2024

నేడు అఫ్గాన్‌తో భారత్ తొలి టి20 మ్యాచ్.. కోహ్లీ దూరం

- Advertisement -
- Advertisement -

మొహాలీ: భారత్‌-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో రెండు టీమ్‌లు కూడా సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అఫ్గాన్‌తో పోల్చితే భారత్ చాలా బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా ఉన్న అఫ్గాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. కొన్ని రోజుల క్రితం భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ అసాధారణ ఆటతో అలరించింది.

ఈ టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి బలమైన జట్లను ఓడించింది. వన్డేలతో పోల్చితే పొట్టి ఫార్మాట్‌లో అఫ్గాన్ మరింత ప్రమాదకర జట్టుగా చెప్పాలి. అఫ్గాన్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా జరిగే పలు లీగ్‌లలో ఆడుతుండడమే దీనికి ప్రధాన కారణం. ఐపిఎల్‌తో సహా బిగ్‌బాష్, కరీబియన్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లలో అఫ్గాన్ ఆటగాళ్లు ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇది అఫ్గాన్ క్రికెటర్లకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరికల్లాంటి ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో అఫ్గాన్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది.

కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, అలిఖిల్, రహ్మనుల్లా గుర్బాజ్‌లతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక మహ్మద్ నబి, గుల్బాదిన్ నయీబ్, రహ్మాత్ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా ఉండనే ఉన్నారు. వీరికి టి20లలో మంచి రికార్డు కూడా ఉండడం అఫ్గాన్‌కు ఊరటనిచ్చే అంశమే. మరోవైపు నవీనుల్ హక్, ఫరూఖీలతో పాటు ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్ వంటి మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ కూడా సంచలనం సృష్టించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

అంత తేలికేం కాదు..
మరోవైపు అఫ్గాన్‌ను ఓడించడం భారత్‌కు కూడా తేలికేం కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న అఫ్గాన్‌ను ఓడించాలంటే భారత్ తీవ్రంగా శ్రమించక తప్పదు. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా అతను చాలా రోజులుగా టి20 ఫార్మాట్‌కు దూరంగా ఉండడం ప్రతికూల అంశంగా చెప్పాలి. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా సిరీస్‌లో స్థానం కల్పించినా వ్యక్తిగత కారణాలతో అతను తొలి టి20కి అందుబాటులో లేకుండా పోయాడు.

కాగా, రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, సంజూ శాంసన్, జితేష్ శర్మ, తిలక్‌వర్మ తదితరులతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీనికి తోడు సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం కూడా జట్టుకు కలిసి వచ్చే అంశమే. కానీ అఫ్గాన్‌ను తేలికగా తీసుకుంటే మాత్రం టీమిండియా తగిన మూల్యం చెల్లించుకున్నా ఆశ్యర్యం లేదు.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, జితేష్ శర్మ, సుందర్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే.

అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబి, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీర్ ఉర్ రహ్మాన్, షర్ఫొద్దీన్ అష్రఫ్, ఖైస్ అహ్మద్, నవీనుల్ హక్, ఫజలుల్లా ఫరూఖి, నూర్ అహ్మద్, సలీమ్ సాఫి, కరీమ్ జన్నత్, ఇక్రమ్ అలిఖిల్, ఫరీద్ అహ్మద్ మాలిక్, గుల్బాదిన్ నయీబ్, రహ్మత్ షా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News