Monday, April 29, 2024

నేడు అఫ్గాన్‌-భారత్ రెండో టి20.. సిరీస్ పై కన్నేసిన రోహిత్ సేన

- Advertisement -
- Advertisement -

ఇండోర్: అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగే రెండో టి20కి ఆతిథ్య భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ 1-0లో నిలిచింది. రెండో టి20లోనూ గెలిచిన సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు అఫ్గాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం అఫ్గాన్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి చేరికతో భారత్ మరింత బలోపేతంగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఆడుతున్న తొలి టి20 మ్యాచ్ ఇదే కావడంతో అందరి దృష్టి విరాట్‌పైనే నిలిచింది.

ఈ మ్యాచ్‌లో అతను ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టి20 ప్రపంచకప్‌నకు ముందు ఆడుతున్న చివరి టి20 సిరీస్ ఇదే కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత నెలకొంది. రానున్న వరల్డ్‌కప్‌లో కోహ్లి, రోహిత్‌లు ఆడాతారా లేదా అనే సందేహం నెలకొన్న నేపథ్యంలో అనూహ్యంగా ఇద్దరికీ అఫ్గాన్ సిరీస్‌లో చోటు దక్కింది. ఇది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా తయారైంది. సీనియర్లు రోహిత్, విరాట్‌లు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉంటారనే దానికి వీరి ఎంపికనే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తొలి మ్యాచ్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన కెప్టెన్ రోహిత్ ఈసారి మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారించిన రోహిత్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే భారత్‌కు ఈ మ్యాచ్‌లో తిరుగే ఉండదు. ఇక శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేలతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. తాజాగా విరాట్ చేరికతో బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతంగా తయారైంది. కిందటి మ్యాచ్‌లో దూబే, జితేష్, రింకు సింగ్‌లు అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతున్నారు. మరోవైపు అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సుందర్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలిచి తీరాల్సిందే..
మరోవైపు అఫ్గానిస్థాన్‌కు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రెండో టి20లో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి జట్టుపై నెలకొంది. రెండు విభాగాల్లో చాలా బలంగా కనిపిస్తున్న టీమిండియాను ఓడించాలంటే అఫ్గాన్ శక్తికి మించిన ఆటను కనబరచక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్గిగా రాణించాల్సి ఉంటుంది. తొలి టి20లో నబి ఒక్కడే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. టాపార్డర్ బ్యాట్‌ను ఝులిపించాల్సిన అవసరం ఉంది. బౌలర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయక తప్పదు. అప్పుడే అఫ్గాన్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే వరుసగా రెండో ఓటమితో సిరీస్ చేజారడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News