Saturday, April 27, 2024

ఆసక్తికరంగా చివరి టెస్టు.. టీమిండియా లక్ష్యం 328

- Advertisement -
- Advertisement -

చెలరేగిన సిరాజ్, శార్దూల్.. ఆస్ట్రేలియా 294 ఆలౌట్
టీమిండియా లక్ష్యం 328, ప్రస్తుతం 4/0, రసపట్టులో చివరి టెస్టు

బ్రిస్బేన్: భారత్-‌ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా స్డేడియం వేదికగా జరుగుతున్న నాలుగో, చివరి టెస్టు రసవత్తరంగా మారింది. మంగళవారం చివరి రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు కంగారూలు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అయితే సోమవారం నాలుగో రోజు వర్షం వల్ల ఆట నిలిపి వేసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ఇక ఆఖిరి రోజు గెలుపు కోసం భారత్ మరో 324 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో పది వికెట్లు ఉండడంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ చివరి రోజు వర్షం అడ్డంకిగా మారకపోతే మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. అంతకుముందు 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు 294 పరుగులకే పరిమితం చేశారు. మహ్మద్ సిరాజ్ ఐదు, శార్దూల్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
శుభారంభం
సోమవారం ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈసారి బాగానే ఆడాడు. మరో ఓపెనర్ హారిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. ఇటు వార్నర్, అటు హారిస్ కుదురుగా ఆడడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. వార్నర్, హారిస్ వరుస బౌండరీలతో హడలెత్తించారు. ఇద్దరు పోటీ పడి ఫోర్లు కొట్టడడంతో వీరిని కట్టడి చేయడం టీమిండియా బౌలర్లకు కష్టంగా మారింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడగొట్టాడు. కుదురుగా ఆడుతున్న హారిస్‌ను అతను పెవిలియన్ దారి చూపించాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హారిస్ 8 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యంలో కూడా పాలుపంచుకున్నాడు. ఆ వెంటనే వార్నర్ కూడా ఔటయ్యాడు. ఆరు ఫోర్లతో 48 పరుగులు చేసిన వార్నర్‌ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు.
సిరాజ్ జోరు
తర్వాత వచ్చిన లబుషేన్ కూడా ధాటిగా ఆడాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. కానీ 5 ఫోర్లతో వేగంగా 25 పరుగులు చేసి జోరుమీద కనిపించిన లబుషేన్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో మాథ్యూ వేడ్ (౦)ను కూడా సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న స్మిత్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తనపై వేసుకున్నాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న స్మిత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. అతనికి కామెరూన్ గ్రీన్ అండగా నిలిచాడు. ధాటిగా ఆడిన స్మిత్ ఏడు ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ సిరాజ్ ఖాతాలోకి వెళ్లింది. ఇదే సమయంలో గ్రీన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గ్రీన్ మూడు ఫోర్లతో 37 పరుగులు చేసి శార్దూల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ టిమ్ 27 పరుగులు సాధించి శార్దూల్ చేతికి చిక్కాడు. ఇక కమిన్స్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో శార్దూల్, సిరాజ్ వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 75.5 ఓవర్లలో 294 పరుగుల వద్ద ముగిసింది.
ఆలాడుకున్నారు..
బుమ్రా, షమి, అశ్విన్, ఉమేశ్, జడేజా వంటి సీనియర్లు లేకున్నా భారత యువ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టును రెండు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. పెద్దగా అనుభవం లేకున్నా సిరాజ్, శార్దూల్, సుందర్‌లు ఈ మ్యాచ్‌లో కనబరిచిన బౌలింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి పెను ప్రకంపనలు సృష్టించాడు. శార్దూల్ కూడా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. సైని గాయం బారిన పడి ఉండకపోతే ఆస్ట్రేలియాను మరింత తక్కువ స్కోరుకే భారత్ ఆలౌట్ చేసి ఉండేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆఖరి మ్యాచ్‌లో అందరూ కొత్త బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఇది రానున్న భారత్‌కు శుభసూచకంగా చెప్పాలి.

India 4/0 at Stump at day 4 in Second Innings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News