Monday, April 29, 2024

తీస్తా మినహా…

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: భారత- బంగ్లాదేశ్ సంబంధాలు మొదటి నుంచీ ఇంచుమించు సాఫీగానే సాగుతున్నాయి. కాని ఒకటో అరో తప్ప చెప్పుకోదగిన పురోగామి ఒప్పందాలేవీ రెండు దేశాల మధ్య ఇంత వరకు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా చాల కాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన తీస్తా నదీ జలాల వాటాల అంశం కొలిక్కి రావడం లేదు. అంతేకాదు రెండు దేశాల సరిహద్దుల్లో చిన్న, పెద్ద 54 నదులు పారుతున్నాయి. వీటిలో గణనీయమైనవి గంగ, తీస్తా, మను, ముహూరి, గోమతి, ధార్ల, దుధ్ కుమార్, కుషియారి. వీటి జలాల వినియోగంపై గట్టి ఒప్పందమేదీ కుదరలేదు. వాస్తవానికి రెండు దేశాల మధ్య సంయుక్త నదీ జలాల సంఘం 1972 నవంబర్‌లోనే ఏర్పాటయింది. 1996 నాటి గంగా నదీ జలాల ఒప్పందం తర్వాత అటువంటి మరే ఒప్పందమూ కుదరలేదు. ఈ పరిస్థితి పట్ల బంగ్లాదేశ్ పత్రికలు ఘాటైన వ్యాఖ్యలే చేశాయి.

రెండు దేశాల మధ్య మైత్రీ ఒప్పందం ఉన్నప్పటికీ జాయింట్ రివర్ కమిషన్ గత పదేళ్లలో ఒక్కసారి కూడా సమావేశం కాకపోడం శోచనీయమని ఢాకా ట్రిబ్యునల్ గత ఏడాది బంగ్లాదేశ్ 50 వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రధాని మోడీ అక్కడకు వెళ్ళినప్పుడు వ్యాఖ్యానించింది. రెండు దేశాల మధ్య 54 నదులు పారుతున్నా పాతికేళ్లుగా ఒక్క నదీ జల ఒప్పందమూ కుదరకపోడం బాధాకరమని డైలీ స్టార్ పత్రిక అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మొన్న మంగళవారం నాడు బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా కుషియారి నదీ జలాలపై ఒప్పందం కుదరడం చరిత్రాత్మక పరిణామమే. ఈ ఒప్పందం మన అసోం రాష్ట్రం దక్షిణ ప్రాంతానికీ, బంగ్లాదేశ్ లోని సిల్హౌట్ డివిజన్ కూ మేలు చేస్తుంది.

అందుచేత 25 ఏళ్ల సుదీర్ఘ కాలంలో భారత బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన తొలి నదీ జలాల ఒప్పందంగా కుషియారి అంగీకారం రెండు దేశాల సంబంధాలనూ మేలు మలుపు తిప్పుతున్నది. అయితే తీస్తా నది ఒప్పందం కోసమే బంగ్లాదేశ్ చిరకాలంగా వేచి చూస్తున్నది. బ్రహ్మపుత్ర ఉపనది తీస్తా. సిక్కింలో మొదలై మన పశ్చిమ బెంగాల్ గుండా బంగ్లాదేశ్‌లో ప్రవేశిస్తుంది. దేశ విభజన సమయంలో ఈ నది పరీవాహక ప్రాంతం ఇండియాలో అంతర్భాగమైంది. ఈ నది జలాలపై 1983లో ఒక ఒప్పందం కుదిరింది, 39 శాతం వాటాను ఇండియా, 36 శాతాన్ని బంగ్లా వాడుకోడానికి అంగీకరించారు. ఆ ఒప్పందం 1985తో ముగిసిపోయింది. గతంలో యుపిఎ హయాంలోనూ, 2021లోనూ తీస్తా జలాల పై అంగీకారానికి గట్టి ప్రయత్నం జరిగింది. ఈ నది చివరలో ఉన్న దేశంగా బంగ్లాదేశ్ ఇందులో వాటాపై హామీని కోరుతున్నది.

రెండు దేశాలూ చెరి 37.5 శాతం జల వాటా అనుభవిస్తూ, నదిలో ప్రవాహం సన్నగిల్లే డిసెంబర్- మార్చి కాలంలో తాను 42.5 శాతం నీటి వాటాను వినియోగించుకొనేలా 2021లో ఒక ఒప్పందాన్ని ఇండియా రూపొందించింది. కాని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం చెప్పడంతో అది ఆచరణ రూపం ధరించలేదు. తీస్తా నదిలో నీళ్లు రానురాను తగ్గిపోతున్నందున వాటిపై బంగ్లాదేశ్‌తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకొన్నా తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని మమతా బెనర్జీ వాదిస్తున్నారు. దీనిపై పట్టుపట్టడం అక్కడ తన ప్రయోజనాలను సైతం దెబ్బ తీస్తుందని భారతీయ జనతా పార్టీ భయపడుతున్నది. ఈ ఒప్పందం కోసం ఈసారి పర్యటనలో మమతా బెనర్జీని కలుసుకోవాలని హసీనా అనుకున్నారు. కాని అందుకు కేంద్రం సహకరించలేదు. తీస్తా తీరాన్ని తవ్వి కరకట్ట నిర్మించే విషయంలో సహకరించడానికి చైనా ముందుకు వచ్చింది. కాని ఇండియా తన భద్రత రీత్యా దానికి అభ్యంతరం చెప్పింది.

వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. భారత పక్షపాతి అనిపించుకొన్న షేక్ హసీనా తీస్తా ఒప్పందం సాధించలేకపోతే ఆమె రాజకీయ ప్రత్యర్థులు దానిని ఆమె పై సునిశిత అస్త్రంగా ప్రయోగిస్తారు. ఏమైనప్పటికీ హసీనా తాజా భారత పర్యటన తీస్తా మినహా ఇతర ఒప్పందాలకు వేదిక అయింది. హసీనా పర్యటనలో రైల్వే, సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష, మీడియా రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాద వ్యతిరేక కృషిలో పాలు పంచుకోవాలన్న అవగాహన ఏర్పడింది. విద్యుత్, ఇంధన సంక్షోభం నుంచి బయటపడడానికి ఇండియాపై విశేషంగా ఆధారపడాలని బంగ్లాదేశ్ ఆశిస్తున్నది. రష్యా నుంచి చౌక ఆయిల్‌ను ఇండియా మీదుగా దిగుమతి చేసుకోవాలని చూస్తున్నది. అలాగే ఆ ఆయిల్‌ను శుద్ధి చేసుకొనే సౌకర్యం తనకు లేనందున ఆ విషయంలోనూ భారత్‌పై ఆధారపడాలని కోరుకొంటున్నది. బంగ్లాదేశ్‌లోని రూప్పూర్‌లో అణు విద్యుత్ ప్లాంటును భారత్, రష్యా సహకారంతో నిర్మించుకోడానికి నాలుగేళ్ళ క్రితమే ఒప్పందం కుదిరింది. భారతీయ కంపెనీల సహకారంతో రష్యా ఈ ప్లాంటును నిర్మిస్తున్నది. పొరుగునున్న చిన్న దేశానికి చేయందించి సహకరించాలన్న భారత సంకల్పం హర్షించదగినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News