Monday, April 29, 2024

ఇది వ్యాపారాత్మక బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman presents Union Budget 2021-22

 

“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన 50వ సంవత్సరం. స్వాతంత్య్రానంతరం 8వ సారి జనాభా లెక్కలు తీస్తున్న సంవత్సరం కూడా. హరిద్వార్ మహాకుంభ మేళా జరిగే సంవత్సరం” అని తన ఉపోద్ఘాతంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇలా ఉపోద్ఘాతంలో కొంత చరిత్రను స్పర్శించారు. తద్వారా తమ ప్రాధాన్యత లేమిటో పరోక్షంగా చెప్పినట్లయింది. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఒక తమిళ సూక్తిని పేర్కొని రాజు ప్రజల నుండి పన్నులు సేకరించి ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని పేర్కొని తమిళుల హృదయాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. అదే విధంగా తెలుగువారి కోడలు అని జర్నలిస్ట్ పరకాల ప్రభాకర్ భార్యని అని గర్వించే విధంగా తెలుగు సూక్తిని ఒక్కటైనా పేర్కొని ఉంటే, తెలుగువారు కూడా సంతోషించేవారు.

ఇంకా ఈ బడ్జెట్‌లో పౌష్టికాహారం గురించి, తొలిసారిగా కాగితం రహితబడ్జెట్ ప్రవేశపెట్టడం గురించి గొప్పగా చెప్పుకున్నారు. కోవిడ్ 19ను నియంత్రించడం లో ప్రపంచంలోనే గొప్ప ప్రతిష్ఠ పెంచుకున్నామని అన్నారు. దేశం లో మరణాల రేటు పది లక్షల జనాభాకు 130 మంది మాత్రమే నని ఇది జీవన ప్రమాణాలు, ఆరోగ్య అభివృద్ధి అని, ఆర్థికంగా ఎదుగుదలకు చిహ్నమని పదిహేనవ పేరాలో చెప్పుకొచ్చారు. పదమూడవ పేరాలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కోవిడ్ అనంతరం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త దశలోకి దేశం ప్రవేశిస్తున్నది అని అన్నారు.

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మాలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2021న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 62 పేజీల సంక్షిప్త బడ్జెట్. ఇందులో పార్ట్ ఎ లో ఉపోద్ఘాతం, ఆరోగ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆశావహ అభివృద్ధి, మానవ సంపద, ఆవిష్కరణలు, పరిశోధనలు, కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన, ఫిస్కల్ పొజిషన్ అనే అంశాలు పేర్కొన్నారు. పార్ట్ బి లో ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనలు, సీనియర్ సిటిజన్‌లకు పన్ను మినహాయింపులు, వివాదాల పరిష్కారానికి ఏర్పాటు. ఎన్నారైలకు మినహాయింపులు, పరోక్ష పన్నులు, జిఎస్‌టి, కస్టవ్‌ు పన్నుగా హేతుబద్దీకరణ, ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ల పరిశ్రమ, ఇనుము, ఉక్కు పరిశ్రమ, టెక్స్‌టైల్, కెమికల్స్, బంగారం, వెండి, పునరుత్పాదక విద్యుత్, పెట్టుబడులు, ఎవ్‌ుఎస్‌ఇ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు అని విషయ సూచికలో పేర్కొన్నారు.

పార్ట్ ఎ అనుబంధంగా రోడ్లు, నేషనల్ హైవేలు, ఇతర ప్రాజెక్టులు పెట్టుబడుల ఉపసంహరణలోని ప్రధానాంశాలు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరతో కొనుగోళ్ళు. (ఎవ్‌ుఎస్‌పి పర్చేజెస్), నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యారంగంలో చొరవ. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ. బడ్జెట్ వనరుల్లో ఇతర అంశాల ఆదాయం, ప్రభుత్వ బాండ్లు, లోన్లు సేకరణ తదితరాలు.

పార్ట్ బి అనుబంధంగా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు వివరించారు. మొత్తం ప్రసంగ పాఠంలో మానవ వనరులు అనే పదం ఒకటే ఉంది. సోషల్ వెల్ఫేర్ అనే పదం లేకపోవడం యాదృచ్ఛికం కాదు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పాలసీ నిర్ణయాత్మక స్థానాల్లో ఐఎఎస్, ఐఆర్‌ఎస్ ఉన్నతాధికారుల ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఉన్నతాధికారులు లేరని, ఒకవేళ ఉన్నా, వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, బడ్జెట్ ప్రసంగం తెలియజేస్తున్నది. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇన్ కంటాక్స్ గురించి ఎక్కువ చర్చలు చేశాయి. సాంఘిక సంక్షేమ బడ్జెట్ గురించి, పల్లెత్తి ఒక్క మాట కూడా గుర్తు చేసినట్టులేరు. ప్రజలను ఓట్ల కోసం, బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆకర్షించాలనే దృష్టిని కూడా ఈ బడ్జెట్ ప్రవేశించలేకపోయింది. మైనారిటీలను మొదటే వదిలేసింది. ఇప్పుడు 15 శాతం బడ్జెట్‌లను ఎస్‌సిలకు, 7 శాతం బడ్జెట్‌లను ఎస్‌టిలకు తప్పనిసరిగా కేటాయించాలనే కాన్‌స్టిట్యూషన్ నిబంధన, కాంపొనెంట్ ఫండ్స్, సబ్‌ప్లాన్ వంటి పదాల ఊసు ఈ ప్రసంగంలో కానరాదు.

మరి 22 నిమిషాలు ఎస్‌సి, ఎస్‌టిల కాంపొనెంట్ ఫండ్స్‌ను ఎందులో సర్దిచూపారో వివరణాత్మక బడ్జెట్‌లో ఉంటుందేమో తెలియదు. విద్యారంగానికి నాలుగో ప్రాధాన్యత ఇచ్చారని కొన్ని పత్రికలు, మీడియాలో ప్రధాన విషయంగా పేర్కొన్నారు. ఇది నూతన విద్యా విధానాన్ని అమలు జరపడానికి రాష్ట్రాలు ముందుకు వచ్చినా రాకపోయినా అమలు జరపడానికి సిద్ధపడ్డ బడ్జెట్‌కు సంబంధించిన పద్దు అని చెప్పవచ్చు. 15 వేల కొత్త స్కూళ్ళను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దేశంలో గల ఏడు వందలకు పైగా గల జిల్లాల్లో జిల్లాకు సగటున 20 పాఠశాలలు ప్రారంభిస్తారని దీని అర్ధం. ప్రైవేటు యాజమాన్యంతో కలిసి 100 సైనిక స్కూళ్ళను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. అలాగ సగటున రాష్ట్రానికి నాలుగు చొప్పున కొత్త సైనిక స్కూళ్ళు పెడతారు. విద్యారంగం బడ్జెట్‌లోనే స్కాలర్‌షిప్‌లు, స్టయిఫండ్‌లు, విద్యాపరిశోధన, వితరణలు అని కలిసి ఉన్నాయి. ఇందులో కూడా కొంత ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన బడ్జెట్‌లో కలిపేసి ఉండవచ్చు. విద్యా బడ్జెట్‌ను పెద్ద మొత్తంగా చూపించడంలో ఎస్‌సి, ఎస్‌టిల కాంపొనెంట్ ఫండ్స్ కలిపేసి ఉంటారు. రక్షణ రంగంలో అన్నిటికన్న పెద్ద బడ్జెట్. మొత్తం బడ్జెట్ 34.83 లక్షల కోట్లు. ఇందులో రైల్వే బడ్జెట్ కూడా కలిసి ఉన్నది. గతంలో రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టేవారు. బడ్జెట్ మొత్తాన్ని ఎక్కువచేసి చూపడానికి రైల్వే బడ్జెట్‌ను మొత్తం బడ్జెట్‌లో కలిపేస్తున్నారు.

రక్షణ రంగానికి 4.78 లక్షల కోట్లు.
వినియోగదారులు, ప్రజాపంపిణీకి, సబ్సిడీకి (ఎఫ్‌సిఐ) కలిపి 2.57 లక్షల కోట్లు.
హోం శాఖకు 1,66,547 కోట్లు.
గ్రామీణ అభివృద్ధికి 133,690 కోట్లు.
వ్యవసాయం, రైతు సంక్షేమం 131,531 కోట్లు.
రైల్వేలకు 110,050 కోట్లు.
విద్యాశాఖకు 93,224 కోట్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 73,932 కోట్లు.
కోవిడ్ వ్యాక్సినేషన్‌కు 35,000 కోట్లు.
స్వచ్ఛ భారత్ 141,678 కోట్లు.
ఆత్మనిర్భర్ స్వస్థత యోజనకు 64.180 కోట్లు.

పైన పేర్కొన్న రక్షణ, హోంశాఖ బడ్జెట్ 478 లక్షల కోట్లు, హోంశాఖ 166,547 కోట్లు. కలిసి పోలీసు, సైనిక వ్యవస్థకు 6.44 లక్షల కోట్లు. అత్యధిక బడ్జెట్ పోలీసులకు, సైన్యానికి కేటాయించబడింది. రైల్వే బడ్జెట్‌ను మొత్తం బడ్జెట్‌లో కలిపేసినట్టుగా హోంశాఖ బడ్జెట్‌ను రక్షణ బడ్జెట్‌ను కలిపేసి చూపకుండా, విడిగా చూపడంలో మతలబు అర్ధం చేసుకోవచ్చు. ఈ పద్దుల్లో ఎక్కడా సాంఘిక సంక్షేమం అనే మాట గానీ, ఎస్‌సి, ఎస్‌టి కాంపొనెంట్ ఫండ్స్ అనే మాట గానీ కనపడదు. అలాగే ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన కింద వంద రోజుల పని కల్పన గురించి 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ పద్దును చూపే పద్దు కనపడదు.

ఇలా మానవ వనరుల అభివృద్ధి గురించిన దృష్టి కోణాన్ని ఈ బడ్జెట్ ప్రదర్శించలేకపోయింది. రక్షణశాఖ, హోం శాఖలకు విద్యాశాఖ కన్నా ఆరున్నర రెట్ల బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది. అటు దిటు మార్చితే ఐదు పదేళ్ళలో దేశంలో అందరూ నూతన విద్యా విధానంలో కూడా ఉపాధి పూర్వక డిగ్రీ స్థాయి విద్యావంతులు కావడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ పేరిట రూ. 2.5 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అనగా విద్యాశాఖ కన్నా రెండు రెట్లు. విద్యాశాఖ బడ్జెట్‌లో ఉన్నత విద్యకు ఎంతో హైస్కూల్ స్థాయి విద్యకు, ప్రైమరీ స్కూళ్ళకు ఎంతో తెలియదు. గ్రామీణ విద్యార్ధులను అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించడానికి జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని పెంచుతున్నారో తెలియదు. పదిహేను వేల కొత్త స్కూళ్ళు జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఒరవడిలో నెలకొల్పబడతాయని అనుకోవచ్చు. కనుక ఒక్కో జిల్లాకు 20 జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల వంటి హైస్కూళ్ళు కొత్తగా ఏర్పడతాయని బడ్జెట్ చర్చలో తేలుతుంది. ఈ బడ్జెట్‌లో ఎల్‌ఐసిని 74 శాతం మార్కెట్‌లోకి ప్రైవేటు రంగంలోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

తద్వారా, ఎల్‌ఐసిలోని కోట్లాది మంది పొదుపును ప్రైవేటు వ్యాపార, పారిశ్రామికవేత్తలు అవసరాలకు మళ్లించుకుంటారు. ఇంతదాకా ఎల్‌ఐసిలో జమైన ప్రజల సొమ్ము. రైల్వేలకు, రహదారులకు, ఆర్టీసివంటి సంస్థలకు అప్పులిచ్చి జాతీయ అభివృద్ధికి తోడ్పడుతుండేది. ఎల్‌ఐసి ప్రైవేటీకరణ వల్ల లాభాపేక్ష గల రంగాలకు తమ లాభాలు పెంచుకోవడానికి ప్రైవేటు యాజమాన్యం వీటిని దారి మళ్లిస్తుంది. వాటిని చూపి తిరిగి బ్యాంకుల్లో లోన్లను కూడా ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటారు. అందుకు అనుకూలంగా, అనేక బ్యాంకులను కలిపి ఆరు బ్యాంకులు చేశారు. ఈ ఆరు బ్యాంకులను ఇప్పుడు నాలుగు బ్యాంకులుగా మారుస్తారు. పేరెన్నికగన్న ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకులో కలిపేసి దానికి పేరు లేకుండా చేశారు. అప్పనంగా అలా అన్ని బ్యాంకుల మీద ఉత్తరాది, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, ముంబయి బేస్ గల వ్యాపార పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల 169 కేంద్ర సంస్థలను క్రమంగా ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. వారికి డబ్బు లేకపోతే ప్రభుత్వమే పరోక్షంగా ప్రయివేటీకరణకు డబ్బు ఎలా సమకూర్చుతుందో ఎల్‌ఐసి వంటి సంస్థలను ప్రైవేటీకరించడాన్ని నుండి గమనించవచ్చు.

ఇలా గత యేడాది అదాని, అంబానీల సంపద, ఆదాయం ఇతోధికంగా పెరిగినట్లుగా నిరంతరం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ పెట్టుబడులను ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకరించే క్రమంలో వాటిని తక్కువ ధరలకు కొని, తమ స్వంతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇలా ఒకే పెట్టుబడి మూడు వరుసల్లో ప్రయాణించి, నాలుగు రెట్ల సంపదని ప్రైవేటీకరణకు తోడ్పడుతుంది. దీన్నే రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ క్రోనీ క్యాపిటలిజంకు దగ్గరగా ఉన్న బడ్జెట్ అని పేర్కొనడం జరిగింది. ఇలా వ్యాపారాత్మక బడ్జెట్ ప్రైవేట్ పెట్టుబడిదారులను పెంచి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చే బడ్జెట్. అందువల్లనే సాంఘిక సంక్షేమం, కాంపొనెంట్ ఫండ్స్ వంటి మాటలను, ఒబిసిల సంక్షేమం వంటి మాటలు లేకుండా ఈ బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని చెప్పవచ్చు.

బి.ఎస్.రాములు
8331966987

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News