Monday, April 29, 2024

ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!

- Advertisement -
- Advertisement -

India Economy collapsed with Corona

 

ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ రోజులు పట్టదు. ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన కేసుల సంఖ్య తక్కువే అని ప్రాథమిక గణితం తెలిసిన వారు కూడా చెబుతారు. సంతోషించాల్సిన అంశమే. దీన్ని నరేంద్ర మోడీ విజయ ఖాతాలోనే వేద్దాం. కేసులు తక్కువగా ఉన్నపుడు లాక్‌డౌన్ ప్రకటించి విపరీతంగా పెరుగుతున్నపుడు ఎత్తివేసిన ఘనతను కూడా ఆయనకే ఆపాదిద్దాం. జనవరిలోనే వైరస్ గురించి తెలిసినా, అధికారులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో లాక్‌డౌన్ ప్రకటించకుండా, ప్రకటించినా అరకొర చర్యలతో అమెరికన్లకు ముప్పు తెచ్చాడు డోనాల్డ్ ట్రంప్. ఆ పెద్ద మనిషి జిగినీ దోస్తు, కౌగిలింతల ఫేం నరేంద్ర మోడీ మే 16వ తేదీ నాటికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెప్పిన నీతి ఆయోగ్ అధికారుల మాటలు నమ్మినట్లు కనిపిస్తోంది. నిజంగా తగ్గిపోతే ఆ ఖ్యాతి తన ఖాతాలో ఎక్కడ పడదోనని పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో చర్చలు లేకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్ ప్రకటించారు నరేంద్ర మోడీ.

అయితే అంచనాలు తప్పి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ దశలవారీ ఎత్తివేసి మరింత పెరిగేందుకు కారకులయ్యారు. అయినా దాన్ని కూడా విజయంగానే చిత్రించేందుకు ప్రయత్నించారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. అధికారులదేముంది ! రాజుకి ఏది ప్రియమో అదే కదా చెప్పేది. తప్పుడు సలహాలు, జోష్యాలు చెప్పిన వారి మీద చర్య తీసుకున్నారా? అదేమీ లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. అసలు విషయం ఆర్ధికం సంగతేమిటి? దీన్ని ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి? నాకు సంబంధం అంటకట్టేందుకు చూస్తున్నారు, నాకేం బాధ్యత లేదు అని జిఎస్‌టి విషయంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి పగలూ, రేయీ దేవతలతో సహా కలలోకి వచ్చిన దేవుడు ఒకటికి పది సార్లు స్పష్టం చేశారని తెలిసింది. పెద్ద వాటిలో ఒక్క చైనా తప్ప అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కరోనా భాషలో చెప్పాలంటే ఆక్సిజన్ సిలిండర్ల మీద ఉన్నాయి. మనది వెంటిలేటర్ మీద ఉంది అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్న తెలుగు లోకోక్తి తెలిసిందే. జనాభాతో పోల్చుకుంటే మన కరోనా కేసులు తక్కువ అని చెబుతున్నవారు ఆర్ధిక రంగంలో అన్ని దేశాల కంటే దిగజారుడులో అగ్రస్థానంలోకి ఎందుకు నెట్టారో మాట్లాడరేమి? ఏమిటీ మన దేశ ప్రత్యేకత ? అదైనా చెప్పాలి కదా! వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో అంటే ఏప్రిల్ జూన్ మధ్య జిడిపి వృద్ధి రేటు 24 శాతం తిరోగమనంలో ఉందని, ఇంకా లెక్కలు పూర్తిగానందున నవంబరు 28న సరైన లెక్కలు చెబుతామని కేంద్రం ప్రకటించింది.

కొందరు ఆర్ధికవేత్తలు దిగజారుడు 35 శాతం వరకు వుండవచ్చని చెప్పారు. నిండా మునిగిన వారికి లోతు ఎంత ఉంటేనేం ! మొదటి మూడు నెలలే కాదు మిగిలిన తొమ్మిది నెలలూ ఎంత తిరోగమనంలో ఉంటామన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ కుస్తీపడుతున్నారు. వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి (2021 మార్చి 31) మన ఆర్ధిక వ్యవస్ధ 14.8 శాతం తిరోగమనంలో ఉంటుందని గోల్డ్‌మన్ శాచస్, 10.5 శాతమని ఫిచ్ రేటింగ్ సంస్ధలు జోష్యం చెప్పగా మన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ధికవేత్తలు 16.5 శాతంగా పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసాలు (ఆరునెలలు) ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటే మాంద్యం అంటారు. స్వాతంత్య్ర భారత చరిత్రలో 1958లో 1.2 శాతం 1966లో 3.66, 1973లో 0.32, 1980లో 5.2 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసిక తాత్కాలిక ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రతి సంస్ధ అంతకు ముందు వేసిన అంచనాలను సవరించి లోటును మరింత పెంచింది. ఉదాహరణకు ఇండియా రేటింగ్స్ అండ్ రిసర్చ్ సంస్థ 5.3 శాతంగా పేర్కొన్న లోటును 11.8 శాతానికి పెంచింది. ఎస్‌బిఐ మాత్రం 20 నుంచి 16.5 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే జూన్ నాటికి ఆర్ధిక వ్యవస్థ పురోగమించవచ్చని కూడా ఈ సంస్థలు జోష్యం చెబుతున్నాయి. రెండవ త్రైమాసంలో 12 శాతం విలోమ అభివృద్ధి ఉంటుందని, రానున్న మూడు సంవత్సరాలలో సగటున పదమూడు శాతం చొప్పున అభివృద్ధి నమోదు చేస్తేనే కరోనాకు ముందున్న స్ధాయికి జిడిపి చేరుకుంటుందని క్రిసిల్ సంస్థ చెప్పింది.

వాస్తవ జిడిపిలో పదమూడు శాతం అంటే 30 లక్షల కోట్ల రూపాయలు శరీరం మీద మిగిలిపోయే మచ్చ మాదిరి శాశ్వత నష్టం సంభవిస్తుందని, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలలో ఈ నష్టం మూడు శాతానికి మించి ఉండదని క్రిసిల్ పేర్కొన్నది. జి 20 దేశాలలో మన జిడిపి పతనం గరిష్ఠంగా ఉందని మూడీస్ పేర్కొన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా జిడిపి లోటులోనే ఉంటుందని అంచనా వేసింది. ఆక్స్‌ఫర్డ్ అనలిటికా మరింత స్పష్టంగా సచిత్రంగా చూపింది. భారత్‌లో మరో ఉద్దీపన పధకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అభిప్రాయపడింది. ఆరోగ్యం, ఆహారం, అవసరమైన వారికి ఆదాయ మద్దతు, వాణిజ్యానికి రాయితీలు ఇవ్వాలని ఐఎంఎఫ్ సమాచార శాఖ అధికారి గెరీ రైస్ చెప్పారు. వర్తమాన సంవత్సరంలో 4.5శాతం, వచ్చే ఏడాది ఆరుశాతం తిరోగమన వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్ జోష్యం చెప్పింది. కరోనా వైరస్ సమయంలో ప్రభుత్వ ఖర్చు తగ్గిన కారణంగా అది శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం తన డబ్బు సంచి ముడి విప్పకపోతే కోలుకోవటం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్రకటించాలనే సూచనలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి. ఇది కూడా 21 లక్షల కోట్ల రూపాయల పథకం వంటిదే అయితే ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత నగుబాట్ల పాలు కావటం ఖాయం.

1933లో అమెరికా ఎదుర్కొన్న మాదిరి సవాలును ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటోందని ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృంద సభ్యుడైన నీలేష్ షా సుప్రసిద్ద జర్నలిస్టు కరన్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బలంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ఆదుకొని బలహీనమైన వాటిని అంతరించిపోయేందుకు అనుమతించాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం తరువాత తొలిసారిగా దేశం ఒకేసారి వైద్య, ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీన్నొక అవకాశంగా మార్చుకోవాలన్నారు. ప్రపంచ పుత్తడి మండలి అంచనా ప్రకారం భారత్‌లో రెండు లక్షల కోట్ల డాలర్ల విలువగల 25 వేల టన్నుల బంగారం గృహస్థుల వద్ద ఉంది. దీనిలో ఎక్కువ భాగం లెక్కల్లో లేదు. అందువలన అలాంటి బంగారం కలిగిన వారందరికీ క్షమాభిక్ష పెట్టి చట్టబద్ధం గావిస్తే బిలియన్ల డాలర్లను సమీకరించుకోవచ్చు అన్నారు నీలేష్ షా. దేశం ఇప్పటికి 500 బిలియన్ డాలర్ల విలువ గల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 376 బిలియన్ల మేరకు అధికారికంగా జరగ్గా 140 బిలియన్ డాలర్ల విలువగలది దొంగ బంగారం అన్నారు. 1933లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకొనేందుకు బంగారాన్ని జాతీయం చేసిందని, మన దేశంలో గతంలో మొరార్జీ దేశాయ్ జాతీయానికి బదులు నియంత్రణ చట్టాన్ని తెచ్చారన్నారు. మన ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనేందుకు జనం త్యాగాలు చేయాలన్నారు. కోటక్ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్న నీలేష్ షా వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పినప్పటికీ నరేంద్ర మోడీకి సలహాలు ఇచ్చే సమయంలో అవి ప్రభావితం చూపకుండా ఉంటాయా, లేక వాటిని పక్కన పెట్టి మోడీకి ఇష్టమైన సలహాలు చెబుతారా?
నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడు, ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురు చూస్తోందని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరొక విధంగా అది నిజమే అనిపిస్తున్నది. ప్రపంచ నేతగాకపోతే 2018 సియోల్ శాంతి బహుమతిని నరేంద్ర మోడీ ఎందుకు పొందారు ? ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడని మోడీ అభిమానులు పొంగిపోయారు. మోడినోమిక్స్, యాక్ట్ ఈస్ట్ పాలసీకి గాను నరేంద్రమోడీకి సియోల్ శాంతి బహుమతి ప్రదానం అంటూ శీర్షికలు పెట్టిన పత్రికలున్నాయి. మోడినోమిక్స్ (మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో, ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. ‘అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి పెంపుదలతో భారత పౌరుల మానవాభివృద్ధికి కృషి, అవినీతి వ్యతిరేక, సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచ వ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించిన మోడీ సిద్ధాంతాలు, ఆసియా పసిఫిక్ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కృషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.
ఇంతగొప్ప నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండగా అమెరికాను అధిగమించే వేగంతో పెరుగుతున్న కరోనా కేసులేమిటి? 2008 ఆర్ధిక సంక్షోభంలో దెబ్బతిన్న తాము కూడా భారత స్ధాయిలో జిడిపిలో దిగజారలేదు, అక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది, ఆర్భాట ప్రకటనలేనా అసలేమీ లేదా అనే సందేహాలతో యావత్ ప్రపంచం భారత్‌ను, దానికి ప్రతినిధిగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగానే మోరెత్తి చూస్తోంది. లేకపోతే ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకొనేది ఏమి ఉంది కనుక? ఆస్తికులు నమ్మే, నాస్తికులు తిరస్కరించే దేవుడి మీద ఒట్టు. ఇది నిజమని అందరూ నమ్మాల్సిందే !

ఎం కోటేశ్వరరావు

8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News