Saturday, April 27, 2024

చైనాను చూసి భయపడుతున్నామా!

- Advertisement -
- Advertisement -

వాళ్లది పెద్ద ఆర్ధిక వ్యవస్థ.. మనది చిన్న ఆర్ధిక వ్యవస్థ. వాళ్లతో మనం యుద్ధంలో ఎలా గెలువగలం? ఇది కనీస జ్ఞానంతో ఆలోచించాల్సిన అంశం‘ అంటూ మన విదేశాంగ మంత్రి డా. జైశంకర్ సుబ్రమణియన్ పేర్కొనడం దేశంలో పెను దుమారం రేపుతోంది. చైనాతో తలపడటానికి మన ప్రభుత్వం భ యపడుతుందనే సంకేతాన్ని ఇస్తున్నది. దేశభద్రత దృష్ట్యా ఇటువంటి సంకేతం చాలా ప్రమాదకరమైన అంశం. చైనా వత్తిడుల కు, బెదిరింపులకు లొంగుబాటు మనస్తత్వాన్ని వెల్లడి చేస్తుంది.
ఆయన చెబుతున్నది వాస్తవమే అయితే, అది మన ప్రభుత్వ దివాలాకోరు రాజకీయ విధానాన్ని వెల్లడి చేస్తుండాలి గాని, వాస్తవాలను మాత్రం కాదని గమనించాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలలో విదేశాంగ విధానాన్ని ప్రముఖంగా పేర్కొంటుంటాము. ముఖ్యంగా విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తి, దౌత్యపరమైన అంశాలలో కాకలు తీరిన డా. జైశంకర్ వంటి వారు స్వయంగా విదేశాంగమంత్రిగా ఉండడంతో అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట, ప్రాధాన్యత ఎంతగానో పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంటుంది. అటువంటి మంత్రి నుండి ఇటువంటి పిరికి మాటలను దేశ ప్రజలు ఊహించి వుండరు.

పైగా, ఆయన స్వయంగా ఆ దేశంలో చాలాకాలం భారత రాయబారిగా పనిచేశారు. ఆ దేశపు బలం, బలహీనతల గురించి స్పష్టమైన అవగాహన ఉండి ఉండాలి. అటువంటి ఆయన నోటి నుంచి ఇటువంటి మాటలు విస్మయం కలిగిస్తోంది. 2020, జూన్ 15-16 రాత్రి గల్వాన్‌లో ఘర్షణకు దిగిన చైనా బలగాలను మన సైనికులు ఎదుర్కొన్నతీరు చూస్తే చైనా నుండి ఎటువంటి ప్రమాదాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మన సైనికులకు ఉందని స్పష్టం అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వమే ఈ విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు అనుమానం కలుగుతుంది.

ఒక కీలక మంత్రి నుండి ఇటువంటి పిరికి మాటలు రావడం రాజకీయ వైఫల్యంగానే భావించవలసి ఉంటుంది. నిజంగా చైనా అంత ప్రమాదకారిగా ఉంటె ప్రభుత్వం దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అసలేమీ జరుగుతుందో చెప్పాలి. కనీసం పార్లమెంట్ లో సభ్యుల ప్రశ్నలకు సహితం జవాబు చెప్పే సాహసం చేయడం లేదు. సరిహద్దుల్లో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

చైనా సైన్యం సరిహద్దుల్లో చాలాచోట్ల భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని వార్తలు వస్తున్నా, అమెరికా వంటి దేశాలుల సాటిలైట్ చిత్రాలను విడుదల చేస్తున్నా, సరిహద్దుల్లో గ్రామాలే నిర్మిస్తున్నారని అంటున్నా ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. మూడు నెలల క్రితం లడఖ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నిర్వహించిన పరిశోధనలో కూడా ఇటువంటి ప్రకటనలే వస్తున్నా, కేంద్రం మాత్రం ఒక్క ఇంచు భూభాగం కూడా చైనాకు దక్కనివ్వలేదని భారీ ప్రకటనలు చేస్తూ వస్తున్నది.
వాస్తవం ఏదైనా సరిహద్దుల్లో చైనా భారీగా సైనికులను కదిలిస్తున్నదని, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పర్చుకొంటున్నది. ఒక వంక భారత్ తో చర్చలు అంటూనే చైనా దొంగదెబ్బ తీసేందుకు సిద్దపడుతున్నదని స్పష్టం అవుతుంది. అయితే, డా. జైశంకర్ చెబుతున్నట్లు చైనాకు భారత్ తో యుద్ధం చేసే సాహసం గాని, సామర్థ్యం గాని లేవని గమనించాలి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలో ఒకటిగా, అతిపెద్ద సైన్యంలో ఒకటిగా గల చైనా ఇప్పటివరకు ఒక్క యుద్ధంలో కూడా విజయం సాధింపలేదని గమనించాలి. కేవలం 1962 యుద్ధంలో భారత్ పై విజయం సాధించింది. అప్పుడు కూడా చైనా సైనికంగా, ఆర్ధికంగా భారత్ కన్నా బలంగా లేదు. ముందుగా మన సైన్యాధిపతులు హెచ్చరించినా నాటి నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో మనం అప్రమత్తంగా లేకపోవడం వల్లననే చైనా విజయం సాధించింది.

సైన్యం కోరినా వైమానికదళంను యుద్ధంలోకి దింపలేదు. దింపి ఉంటె పరిస్థితి వేరుగా ఉండెడిది. నేడు కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న చైనా విధానంలో అటువంటి ఉదాసీనత వ్యక్తం అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కారణాలు ఏవైనా చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోలేక పోతున్నాము. చైనాకు భారీ సైన్యం ఉండవచ్చు. అత్యాధునిక ఆయుధాలు ఉండవచ్చు. భారత్ – పాకిస్తాన్ ల మధ్య యుద్దాలు జరిగిన సమయంలో కూడా సైనికంగా, ఆయుధం పరంగా పాకిస్థాన్ దే పైచేయి.
మొత్తం ప్రపంచాన్ని విస్మయపరిచే విధంగా భారత్ విజయం సాధించిన 1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో భారత్ కన్నా మూడు రేట్లు ఎక్కువగా పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. అయితే, భారత దేశ సైనికులు సుశిక్షితులు, వృత్తిపరంగా క్రమశిక్షణతో పనిచేసేవారు.

పాకిస్తాన్ సైన్యంలో అటువంటి పరిస్థితి లేదు. కేవలం పెద్ద ఆర్ధిక వ్యవస్థ, భారీ సైన్యం ఉండటమే యుద్ధాలలో విజయానికి దారితీస్తుందన్న వాదన కాలం చెల్లింది. వియాత్నం వంటి చిన్న దేశం అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని మట్టికరిపించడాన్ని మరచిపోయామా? ఆఫ్ఘానిస్తాన్ లో రెండు దశాబ్దాలపాటు మకాం వేసి, అమెరికా నిస్సహాయంగా తిరుగుముఖం పెట్టాల్సి రావడం గుర్తులేదా?

యుద్ధరంగంలో ఒక దేశపు ఆధిపత్యంకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థే ప్రామాణికమైతే అమెరికాతో క్యూబా దశాబ్దాలపాటు ఎలా పోరాడిందని మాజీ నేవీ చీఫ్ అరుణ్‌ప్రకాశ్ ప్రశ్నించారు. ‘రెండు దేశాల మధ్య సంబంధాలను ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలే నిర్ణయిస్తాయనుకొంటే అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి చిన్న దేశాలు ఎలా ఎదిరించి నిలబడ్డాయి?‘ అని నిలదీశారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అణ్వాయుధ సామర్థ్యమున్న దేశం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న మనం ఆధిపత్య వాదులకు వ్యతిరేకంగా బలంగా నిలబడాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.

అదే విధంగా చైనా సైన్యం వృత్తిపరంగా భారత్ తో పోటీ పడలేదు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యం సైన్యంపై ఉంటూ ఉండడం, చేర్చుకోవడం, నీయమకాలు నుండి ప్రమోషన్ల వరకు రాజకీయాలు ప్రభావితం చేస్తుండడంతో యుద్ధంలో వారి సామర్థ్యం చాలా తక్కువని చెప్పాలి. ఆర్ధికంగా సహితం చైనా ఇప్పుడు భారీ కుదుపుకు గురై ఉంది. భారత్ పై పూర్తిస్థాయి యుద్దానికి తలపడే సామర్థ్యం లేదని చెప్పవచ్చు. అయితే సరిహద్దుల్లో మన ఉదాసీనతను, బలహీనతలను ఆసరాగా తీసుకొని దొంగదెబ్బలు తీస్తూ, నెమ్మది నెమ్మదిగా కీలకమైన ప్రదేశాలపై పట్టు పెంచుకొనే ప్రయత్నం నిరంతరం చేస్తూ వస్తోంది. ఈ విషయంలో చైనాను కట్టడి చేయడంలో మన రాజకీయ నాయకత్వం అవసరమైన శ్రద్ధను కనబరచడం లేదు.

జి 20 అధ్యక్ష పదవి లభించడంతో నేడు ప్రపంచం భారత్ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తోందని మన నేతలు తరచూ చెబుతున్నారు. కానీ దౌత్యపరంగా ఎటువంటి ప్రయోజనం పొందలేకపోతున్నాము. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సగంకుపైగా పదవీకాలం పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ భారతదేశంలో తమ రాయబారిని నియమించలేదు. బిబిసి డాక్యుమెంటరీ విషయంలో తలెత్తిన వివాదంలో అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు బిబిసికి అండగా నిలిచాయి. భారత్ అభ్యంతరాలను కనీసం తెలుసుకొనే ప్రయత్నాలు కూడా చేయలేదు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో దౌత్యవేత్తగా పనిచేయడం, విదేశాంగ మంత్రిగా పనిచేయడం భిన్నమైన అంశాలని స్వయంగా జైశంకర్ చెప్పారు. దౌత్యవేత్తగా కేవలం ఆ దేశంతో సంబంధాల గురించే ఆలోచిస్తుంటామని, కానీ ఓ మంత్రిగా రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక పరిణామాలపై సహితం ఆలోచించి సత్వర నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. ఈ మాటలు ఆయనకే అవాయిస్తున్నట్లు భావించవలసి వస్తుంది.

ఈ సందర్భంగా రక్షణ పరంగా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు తేడా ఉన్నట్లు అనుమానించాల్సి వస్తుంది. రక్షణ పరికరాలను ఇప్పుడు చాలావరకు దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే, మన రక్షణ పరికరాలలో 68 శాతం వరకు కాలంచెల్లినవని బిజెపి ఎంపీ మేజర్ జనరల్ (రిటైర్డ్) బిసి ఖండూరీ అధ్యక్షతన గల పార్లమెంట్ స్థాయీసంఘం 2018లో నివేదించింది. ఈ నివేదిక ఇచ్చిన వెంటనే ఆయనను ఆ పదవి నుండి తప్పించడం మినహా, ప్రభుత్వం ఈ దిశలో ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు.

మన బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు కనబడుతున్నా వాటిలో మూడొంతులకు పైగా జీతాలు, పింఛన్లు, నిర్వహణ వ్యయాలకే సరిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం రక్షణ పరికరాల విషయమై వివిధ దేశాలతో చేసుకున్న ఒప్పందాల అమలుకు ఈ విధంగా పోతే కనీసం పదేళ్ల పాటు జరిగే బడ్జెట్ కేటాయింపులు అవసరం కాగలవని ఒక నిపుణుడు పేర్కొనడం గమనార్హం.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News