Monday, April 29, 2024

తీరు మారని టీమిండియా

- Advertisement -
- Advertisement -

India vs New zealand

 

జామిసన్ మ్యాజిక్, భారత్ 242 ఆలౌట్, కివీస్ 63/0, రెండో టెస్టు

క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో కూడా టీమిండియాకు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడి ఒత్తిడిలో ఉన్న భారత్‌కు శనివారం ప్రారంభమైన రెండో మ్యాచ్‌లో కూడా పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు తొలి రోజే మ్యాచ్‌పై పట్టు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే ఆలౌటైంది. యువ స్పీడ్‌స్టర్ కిల్ జామిసన్ అద్భుత బౌలింగ్‌తో భారత్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకోవాలంటే కివీస్ మరో 179 పరుగులు మాత్రమే చేయాలి. ఇప్పటికే ఓపెనర్లు శుభారంభం అందించడంతో కివీస్ పటిష్టస్థితికి చేరుకుందనే చెప్పాలి.

పృథ్వీషా మెరుపులు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్ పృథ్వీషా అండగా నిలిచాడు. ఆరంభం నుంచే షా దూకుడును ప్రదర్శించాడు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ విఫలమయ్యాడు. ఏడు పరుగులు మాత్రమే చేసిన మయాంక్ కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన అద్భుత బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా అండతో పృథ్వీషా స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. షా చూడచక్కని షాట్లతో అలరించాడు. మరోవైపు పుజారా మాత్రం తన మార్క్ డిఫెన్స్‌తో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీషా 64 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసి జామిసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 50 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లి అదే తీరు
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తడబడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆడుతున్నంత సేపు ఎప్పుడూ ఔటైతడా అనిపించేలా అతని బ్యాటింగ్ సాగింది. చివరికి 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టిమ్ సౌథి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో కోహ్లి ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 24 పరుగులు మాత్రమే సాధించాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. తర్వాత వచ్చిన మరో సీనియర్, వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి సౌథి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్ 113 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

పుజారా, విహారి అర్ధ శతకాలు
ఒకవైపు వికెట్లు పడుతున్నా పుజారా తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి తెలుగుతేజం హనుమ విహారి అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. పుజారా సమన్వయంతో ఆడగా విహారి దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ కోలుకుంది. విహారి అద్భుత షాట్లతో కనువిందు చేశాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విహారి చూడచక్కని ఫోర్లతో అలరించాడు. అయితే పది ఫోర్లతో 55 పరుగులు చేసిన విహారిను వాగ్నర్ వెనక్కి పంపాడు.

దీంతో 81 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే పుజారా కూడా ఔటయ్యాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన పుజారా 140 బంతుల్లో ఆరు ఫోర్లతో 54 పరుగులు చేసి జామిసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. జామిసన్ వెంటవెంటనే వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ 63 ఓవర్లలో 242 పరుగుల వద్దే ముగిసింది. భారత్ చివరి ఆరు వికెట్లను 48 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం. యువ స్పీడ్‌స్టర్ జామిసన్ 45 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. సౌథి, బౌల్ట్‌లకు రెండేసి వికెట్లు లభించాయి.

శుభారంభం
తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, టామ్ బ్లుండెల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. లాథమ్ (27), బ్లుండెల్ (29) పరుగులతో క్రీజులో ఉన్నారు.

India vs New zealand 2nd test updates
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News