Friday, April 26, 2024

టీమిండియాకు చావో రేవో

- Advertisement -
- Advertisement -

india

సిరీస్‌పై కివీస్ కన్ను, రేపటి నుంచి చివరి టెస్టు

క్రిస్ట్‌చర్చ్: ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియాకు న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు సవాలుగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇందులో ఓడినా, మ్యాచ్ డ్రాగా ముగిసిన సిరీస్ కివీస్ వశమవుతోంది. మరోవైపు ఆతిథ్య న్యూజిలాండ్ ఈ టెస్టుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈసారి కూడా జయకేతనం ఎగుర వేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఇక, స్టార్ బౌలర్ వాగ్నర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. దీంతో బౌలింగ్ మరింత బలోపేతంగా తయారైంది. టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్ తొలి మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.

ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు తహతహలాడుతున్నారు. ఇక, మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి జట్టుపై నెలకొంది. ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టుగా కొనసాగుతున్న టీమిండియా తొలి టెస్టులో అనూహ్య ఓటమి పాలైంది. ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే చేతులెత్తేసింది. కానీ, కీలకమైన ఈ మ్యాచ్‌లో చెలరేగాలనే లక్షంతో టీమిండియా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ఆటతో కివీస్‌ను కంగుతినిపించాలని భావిస్తోంది. సమష్టిగా రాణిస్తే కివీస్‌ను ఓడించడం విరాట్ సేనకు అసాధ్యమేమి కాదు. అయితే దీని కోసం నిలకడగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో సఫలమవుతేనే గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. లేకుంటే మరో ఘోర పరాజయం ఖాయం.

ఓపెనర్లే కీలకం

కిందటి మ్యాచ్‌లో శుభారంభం అందించడంలో భార త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత్‌కు ఆశించిన విధంగా ఆరంభం లభించలేదు. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. అయితే కీలకమైన రెండో టెస్టులో ఇలాంటి పొరపాట్ల కు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో ఓపెనర్లు కనిపిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వా ల్ అర్ధ సెంచరీతో అలరించాడు. ఇది భారత్‌కు ఊరటనిచ్చే విషయంగా చెప్పాలి. పృథ్వీషా కూడా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో రాణించడం ద్వారా రానున్న సిరీస్‌లకు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత షాపై నెలకొంది. మయాంక్ కూడా మెరుగ్గా ఆడక తప్పదు. వీరిద్దరూ అందించే శుభారంభంపైనే టీమిండియా భారీ స్కోరు ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.

ఇద్దరు రాణించాలి

మరోవైపు మొదటి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన సీనియర్లు, టెస్టు స్పెషలిస్ట్‌లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. తొలి టెస్టులో పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపించింది. ఎటువంటి బౌలింగ్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన పుజారా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈసారి పుజారాపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక, రహానె కాస్త బాగానే ఆడినా భారీ స్కోర్లను మాత్రం సాధించలేక పోయాడు. ఈ మ్యాచ్‌లో జట్టుకు రహానె చాలా కీలకంగా మారాడు. అతను మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు తెలుగుతేజం హనుమ విహారి కూడా తొలి టెస్టులో విఫలమయ్యాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో విహారి రాణించాల్సిన అవసరం జట్టుకు నెలకొంది. విహారి విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం టీమిండియాకు కష్టం కాక పోవచ్చు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. ఈసారి కూడా విఫలమైతే రానున్న రోజుల్లో జట్టులో స్థానం కాపాడు కోవడం అతనికి కష్టమేనని చెప్పక తప్పదు. అయితే ఈ మ్యాచ్‌లో వృద్ధిమాన్‌సాహాను ఆడించినా ఆశ్చర్యం లేదు. పంత్‌తో పోల్చితే సాహా కీపింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా కనిపిస్తున్నాడు. దీంతో అతనికే ఈ మ్యాచ్‌లో అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి తదితరులు కూడా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాలి. కీలక పరుగులు సాధించి జట్టుకు అండగా నిలువాల్సిన బాద్యత వీరిపై ఎంతైన ఉంది.

అందరి కళ్లు కోహ్లిపైనే

ఇక, ఫామ్‌లేమితో బాధపడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా కోహ్లి విఫలమయ్యాడు. కనీసం ఈసారైనా తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లి ఇప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. అతను ఫామ్ కోల్పోవడంతో జట్టు బ్యాటింగ్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి మెరుగ్గా రాణిస్తేనే టీమిండియా భారీ స్కోరు అవకాశాలుంటాయి. లేకుంటే మరోసారి ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇదిలావుండగా తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని బౌలర్లు ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. సాధ్యమైనంత త్వరగా కివీస్‌ను కట్టడి చేసి జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో బౌలర్లు ఉన్నారు. ఇక, సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. షమి, బుమ్రా, అశ్విన్‌లు కూడా మెరుగైన బౌలింగ్ కనబరచక తప్పదు. అప్పుడే కివీస్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేసే అవకాశాలుంటాయి.

సమరోత్సాహంతో..

ఇప్పటికే ఓ మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి భారత్‌పై చారిత్రక సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం కివీస్ ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో ఉన్న టీమిండియాను ఓడించడం కివీస్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి.

india vs new zealand last test match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News