Saturday, April 27, 2024

చైనా దాడులను తిప్పికొట్టేలా భారత్ మోహరింపులు

- Advertisement -
- Advertisement -
Indian deployments to repel Chinese attacks

 

కీలక ప్రాంతాల్లో బ్రహ్మోస్,
ఆకాశ్, నిర్భయ్ క్షిపణులు

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద చైనాభారత్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఓవేళ పాక్షిక యుద్ధానికి లేదా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ఏం జరుగుతుందన్నది ఊహించలేం. 1962లో ఈ రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. ఆ సమయంలోనే భారత్‌లోని కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ యుద్ధ రంగానికి కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నది. ఆ విషయం చైనా యుద్ధ నిపుణులకు కూడా తెలుసు. అందుకే యుద్ధ ఫలితాల్ని ఎవరూ ఊహించలేరు.. గత విజయ గర్వంతో ఊగిపోతే చైనా ఊహించని నష్టాన్నే చవి చూస్తుందన్న అంతర్జాతీయ అంచనాలున్నాయి. ఒకప్పుడు రష్యా, ఇప్పుడు అమెరికా సహకారంతో అత్యాధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకున్నది. ఈ నేపథ్యంలో చైనాభారత్ మధ్య ఉన్న 3488 కిలోమీటర్ల ఎల్‌ఎసి ప్రాంతంలో ఇరు దేశాల మోహరింపులపై ప్రత్యేక కథనం…

తూర్పు లడఖ్‌లో తమ దళాల దుందుడుకు చర్యలకు భారత్ నుంచి ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందోనన్న భయం ఇప్పటికే చైనాను వెంటాడుతోంది. గల్వాన్ ఘటన అనంతరం చైనా సైన్యం(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపిఎల్‌ఎ) జింజియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో 2000కి.మీ. పరిధిగల దీర్ఘశ్రేణి క్షిపణులను(సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్‌శ్యాం) మోహరించినట్టు నిపుణులు చెబుతున్నారు. క్షిపణుల మోహరింపును చైనా ఆ రెండు ప్రాంతాలకే పరిమితం చేయకుండా ఎల్‌ఎసి పొడవునా వ్యూహాత్మక ప్రాంతాలైన అక్సాయిచిన్, కాష్గర్, హోటా న్, లాసా, నియింగ్చీలకూ విస్తరించినట్టు తెలుస్తోంది.

భారత్ ప్రతివ్యూహం కూడా అందుకు దీటుగానే ఉన్నది. చైనా ఏవైపు నుంచి దాడికి యత్నించినా గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. టిబెట్, జింజియాంగ్ నుంచి చైనా క్షిపణులను ప్రయోగిస్తే అవి భారత భూభాగంలోకి చొరబడకముందే నిలువరించేలా బ్రహ్మోస్ క్రూయిజ్(ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్) సూపర్‌సానిక్ క్షిపణులను కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇవి 500కి.మీ. పరిధిలోని లక్షాలను ఢీకొట్టగలవు. అంతేగాక 300కిలోల పేలుడు పదార్థాలను మోసుకువెళ్లగలవు. వీటిని లడఖ్ సెక్టార్‌లో అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా సుఖోయ్ 30 ఎంకెఐ యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేశారు. ఇండోనేషియా సముద్ర మార్గంలో హిందూ మహా సముద్రం ద్వారా చైనా దాడికి యత్నించకుండా కార్ నికోబార్ వైమానిక స్థావరం వద్ద కూడా బ్రహ్మోస్‌ను భారత్ మోహరించింది. గాలిలోనే ఇంధనం నింపుకోగల సుఖోయ్ యుద్ధ విమానాలను వాటికి తోడుగా సిద్ధం చేసింది.

800కి.మీ. పరిధిలోని లక్షాలను ఛేదించగల నిర్భయ్(సర్ఫేస్ టు సర్ఫేస్)క్రూయిజ్ క్షిపణులను కూడా భారత్ కీలక ప్రాంతాల్లో మోహరించింది. సముద్రంపైనా, భూమిపైనా ఇవి నిర్దేశిత లక్షాలను ఛేదించగలవు. ఇవి1000 కి.మీ. దూరంలోని లక్షాలను కూడా ఛేదించగలవని చెబుతున్నారు. ఇవి సబ్‌సానిక్ క్షిపణులు. ఇక మూడోరకం ఆకాశ్(శ్యాం) క్షిపణులు. లడఖ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసి వద్ద వీటిని మోహరించారు. అక్సాయ్‌చిన్, దౌలత్‌బేగ్ ఓల్డీ, కారాకోరం పాస్ ప్రాంతాల్లో చైనా దాడులను తిప్పి కొట్టేందుకు వీలుగా వీటిని మోహరించారు. 40కి.మీ. పరిధిలోని లక్షాలను ఇవి ఛేదిస్తాయి. వీటి రేంజ్ తక్కువైనా ట్రాకింగ్ సామర్థం నిశితమైనది, సున్నితమైనది. రాజేంద్ర రాడార్ సాయంతో త్రిముఖ దాడులు చేయగల సామర్థం ఈ క్షిపణులకున్నది. ఒకేసారి 64 లక్షాలను ట్రాక్ చేయగలవు. 12 లక్షాలను ఛేదించగలవు. శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలతోపాటు క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా ఇవి ఢీకొట్టగలవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News