Tuesday, May 14, 2024

రైల్వే ప్రైవేటు పేరుతో ప్రజలకు ఇక్కట్లు

- Advertisement -
- Advertisement -

అమెరికా, కెనడా సహా పలు దేశాల్లో ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వే వ్యవస్థ
అర్జెంటీనా సహా పలు దేశాల్లో రైల్వే ప్రవేటీకరణతో చేదు అనుభవాలు
ఐక్య పోరాటంలో కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని, దీంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ(టి.ఆర్.ఈ.జె.ఎ.సి) సోమవారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన సభలో వినోద్‌కుమార్ మాట్లాడారు. ప్రధాని మోడీ చర్యల వల్ల లక్షలాది మందికి ఉద్యో గాలు, ఉపాధి అవకాశాలు లేకుండా పోతుందని, లక్షల కోట్ల రూపాయల విలువైన రైల్వే స్థిర, చరాస్థులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

లాభాల బాటలో నడుస్తున్న రైల్వే సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రధాని మోడీ రంగం సిద్ధం చేసుకున్నారని వినోద్‌కుమార్ ఆరోపించారు. మూడేళ్లుగా పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా, జనరల్ బడ్జెట్‌లో కలిపేసి ప్రైవేటీకరణకు ముందుగానే పథకాన్ని రచించారని వినోద్‌కుమార్ అన్నారు. అమెరికా, కెనడా సహా అనేక దేశాల్లో ఇప్పటికీ రైల్వే వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అర్జెంటీనా సహా పలు దేశాల్లో రైల్వే సంస్థలను ప్రైవేటు పరం చేయడం వల్ల ఎదురైన చేదు అనుభవాలను వినోద్‌కుమార్ వివరించారు.

అర్జెంటీనాలో ప్రభుత్వ నిర్వహణలో రైల్వే వ్యవస్థ ఉండగా 47 వేల కిలోమీటర్లు ఉన్న రూటు ప్రైవేటు చేతికి వెళ్లిన తర్వాత అది కాస్తా 8 వేల కిలోమీటర్లకు పడిపోయిందని, 95 వేల ఉద్యోగులు ఉన్న అర్జెంటీనా ప్రభుత్వ రైల్వే ప్రైవేటు అయ్యాక 15 వేల ఉద్యోగులకు చేరిందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటు పరం కావడం వల్ల టికెట్ల ధరలు పెరుగుతాయని, ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పి కొట్టాలని వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ సభలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, రైల్వ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు యాదవ్‌రెడ్డి, రవీందర్, బుచ్చిరెడ్డి, యుగంధర్, శ్రీధర్, టిఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఇంఛార్జి ఎల్.రూప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News