Monday, April 29, 2024

చివరికి నిరాశే మిగిలింది..

- Advertisement -
- Advertisement -

Indian womens cricket team

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచి ఫైనల్‌కు చేరిన భారత్ ఫైనల్లో పేలవమైన ఆటతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో కీలకమైన ఫైనల్ సమరంలో జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత క్రికెటర్లు తేలి పోయారు. చేతికొచ్చిన సునాయాస క్యాచ్‌లను చేజార్చి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఊహించిన దానికంటే మరింత భారీ స్కోరును సాధించింది.

ఈ మ్యాచ్‌లో బౌలర్లు కాస్త నిలకడైన బౌలింగ్‌ను కనబరిచి ఉంటే ఫలితం భారత్‌కు అనుకూలంగానే ఉండేది. అయితే ఓపెనర్లు హీలీ, మూనిలను కట్టడి చేయడంలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా హీలీ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ఆమె విధ్వంసక బ్యాటింగే మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకుంది. ఒకవేళ హీలీ అందించిన సునాయాస క్యాచ్‌ను పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేదేమో. అంతేగాక మూనీ కూడా తక్కువ స్కోరు వద్దే క్యాచ్‌ను ఇచ్చింది. దీన్ని కూడా భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు.

అంతే ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్లు మూనీ, హీలీ వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా హీలీ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత బౌలర్లను హడలెత్తించింది. ఆమె చెలరేగి ఆడడంతో భారత బౌలర్లు గాడి తప్పారు. ఇదే క్రమంలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన హీలీ ఐదు భారీ సిక్సర్లు, మరో ఏడు ఫోర్లతో 39 బంతుల్లోనే 75 పరుగులు సాధించి ఆస్ట్రేలియా భారీ స్కోరుకు మార్గం సుగమం చేసింది. ఇక, మరో ఓపెనర్ మూని కూడా అజేయంగా 78 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా స్కోరు 184 పరుగులకు చేరింది.

ఒత్తిడి తట్టుకోలేక
ఈ మ్యాచ్‌లో ఊహించినట్టే భారత బ్యాట్స్‌విమెన్‌లు ఒత్తిడికి గురయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంత పెద్ద భారీ స్కోరును ఛేదించడం ఏ జట్టుకైనా చాలా కష్టం. ఇక, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై అయితే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక, ఊహించినట్టే భారత బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని చూసి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీని ప్రభావం జట్టుపై స్పష్టంగా కనిపించింది. ఒత్తిడి తట్టుకోలేక యువ సంచలనం, ఓపెనర్ షఫాలీ వర్మ (2) ఆరంభంలోనే పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ తానియా భాటియా కూడా గాయంతో రిటైర్‌హర్టెగా వెనుదిరిగింది. జట్టును ఆదుకుంటుందని భావించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కూడా నిరాశే మిగిల్చింది. తన పేలవమైన ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగించింది.

చివరికి 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది. మరో స్టార్ జెమీమా రోడ్రిగ్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి విఫలమైంది. ఈసారి కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటైంది. మరోవైపు జట్టులో దీప్తి శర్మ ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. దీప్తి 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత జట్టులో నలుగురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగిలిన వారు దీన్ని సాధించడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 99 పరుగుల వద్దే ముగిసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాను 150 లోపే కట్టడి చేసి ఉంటే భారత్ ఒత్తిడి ఉండేది కాదు. కానీ, బౌలర్లు విఫలం కావడంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాన్ని తట్టుకోలేక హర్మన్‌సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Indian womens cricket team is poor
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News