Tuesday, May 14, 2024

ముంబయి ఆల్‌రౌండ్ షో

- Advertisement -
- Advertisement -

IPL 2020: MI Win by 9 wickets against DC

దుబాయ్: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ఢిల్లీ, బౌలింగ్‌లో కూడా రాణించలేదు. దాంతో ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీపై 9 వికెట్ల తేడాతో గెలిచి 18 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను మరింత మెరుగుపరుచుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్(72 నాటౌట్; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), డీకాక్(26; 28 బంతుల్లో 2ఫోర్లు)లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 68 పరుగులు సాధించిన తర్వాత డీకాక్ ఔటయ్యాడు. నోర్జే వేసిన బంతి బ్యాట్‌కు తగిలి వికెట్లను గిరాటేయడంతో డీకాక్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(12 నాటౌట్)తో కలిసి ఇషాన్ కిషన్ జట్టును గెలిపించాడు. ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ చెల్లాచెదురైంది. ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్‌ల దెబ్బకు ఢిల్లీ విలవిల్లాడింది.

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్-పృథ్వీ షాలు ఆరంభించారు. ధావన్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా, కాసేపటికి పృథ్వీ షా(10) ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధావన్-పృథ్వీషాలను బౌల్ట్ ఔట్ చేశాడు. ఆ తరుణంలో శ్రేయస్ అయ్యర్ (25; 29 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), రిషభ్ పంత్(21; 24 బంతుల్లో 2ఫోర్లు) కాసేపు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద ఉండగా అయ్యర్ ఔట్ అయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన 11 ఓవర్ రెండో బంతికి డీకాక్ స్టంప్ చేయడంతో అయ్యర్ పెవిలియన్‌కు వెళ్లాడు. కాసేపటికి స్టోయినిస్(2)ను బుమ్రా ఔట్ చేశాడు. 12 ఓవర్ తొలి బంతికి డీకాక్ క్యాచ్ పట్టడంతో స్టోయినిస్ నిష్క్రమించాడు. ఆపై స్వల్ప వ్యవధిలో పంత్‌ను కూడా అదే ఓవర్‌లో బుమ్రా ఔట్ చేశాడు. తద్వారా 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇక తేరుకోలేకపోయింది. హర్షల్ పటేల్(5), హెట్‌మెయిర్(11), అశ్విన్(12)లు నిరాశపరిచారు. బుమ్రా, బౌల్ట్‌లు తలో మూడు వికెట్లు సాధించి ఢిల్లీని కట్టడి చేశారు. రాహుల్ చాహర్, కౌల్టర్‌నైల్‌కు చెరో వికెట్ లభించింది.

IPL 2020: MI Win by 9 wickets against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News