Saturday, April 27, 2024

బండి సంజయ్ కాదు… గుండా సంజయ్: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jeevan reddy comments on Bandi Sanjay

హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడు అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టిఆర్ఎస్ భవనం నుంచి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కాస్త గుండా సంజయ్ గా మారారని, పంజాబ్ తరహాలో ధాన్యం సేకరణ చేయాలని తాము అడిగితే బిజెపి గుండాలు రైతుల కల్లాలపై దాడులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. రైతులపై దాడులు బిజెపికి కొత్త కాదు అని, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో చేశారని ఇపుడు తెలంగాణ లో అదే చేస్తున్నారన్నారు. బిజెపికి రైతుల పూల వర్షం కావాలా.. రాళ్ళ వర్షం కావాలో ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలని సూచించారు. వానా కాలం పంట మొత్తం కొంటామని కేంద్రం నుంచి ప్రకటన చేయించాకే బిజెపి నేతలు ధాన్యం కేంద్రాలకు రావాలని సవాలు విసిరారు.  బిజెపి నేతలు రైతుల పాలిట మిడతల దండులా మారారని దుమ్మెత్తిపోశారు.

రైతులపై దాడులకు దిగుతూ గవర్నర్ కు ఫిర్యాదులు చేస్తారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బెంగాల్ తరహాలో హింస రాజకీయాలు తెలంగాణ లో నడవవు అని బిజెపి నేతలు గ్రహించాలన్నారు. రైతుల సహనాన్ని బిజెపి నేతలు పరీక్షిస్తే వారిని బట్టలూడదీసి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. బందిపోట్ల ముఠాకు నేతగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని, రైతులతో గోక్కున్న కాంగ్రెస్, టిడిపిల పరిస్థితి మాదిరి గానే బిజెపి పరిస్థితి తయారవుతుందన్నారు. బిజెపి నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ప్రధాని మోడీ ముందు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయాలని నిలదీశారు.

బిజెపి నేతలు దొంగ నాటకాలు బంద్ చేయాలని, ఇప్పటికే 1800 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణకు వెచ్చించామని, ఇందులో కేంద్రం ది నయా పైసా అయినా ఉందా? అని అడిగారు. రైతుల పక్షం వహిస్తున్నందుకు సిఎం కెసిఆర్ ను అరెస్టు చేస్తాం అని బిజెపి నేతలు అంటున్నారని, బిజెపి నేతలకు దమ్ముంటే విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను రప్పించాలని సవాలు విసిరారు. బిజెపి నేతలు రైతుల ఆగ్రహానికి గురి అవుతున్నారే తప్ప దాడిలో టిఆర్ఎస్ ప్రమేయం లేదన్నారు.

కెసిఆర్ 36 పార్టీ లను ఒప్పించి తెలంగాణ ను సాధించారని, బిజెపి తాటాకు చప్పుళ్లకు భయపడే సమస్యేలేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. బిజెపిలో జిల్లాకో గుండా నాయకుడు ఉన్నారని, ధాన్యం కొనుగోలు చేయించేలా బిజెపి నేతలు కేంద్రాన్ని ఒప్పించాలనే రైతుల తరఫున తాము అడుగుతున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం 3 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిన సిఎం కెసిఆర్ తో పెట్టుకుంటే బిజెపికి శంకర గిరి మాన్యాలు తప్పవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News