Monday, April 29, 2024

దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించాను

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను తాను ప్రార్థించానని సిఎం కేసిఆర్ తెలిపారు. సకల జనుల సంక్షేమం కోసం పాటుపడే తాము ఉదయం బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను దర్శించుకుని ప్రార్థించానని చెప్పారు. తుల్జా భవాని అమ్మవారి సందర్శన, పూజల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అక్కడ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సిఎం సమాధానాలు ఇచ్చారు. అమ్మవారె స్వయంగా పిలిపించుకుంటే తప్ప అమ్మవారి దర్శనం సాధారణంగా జరిగేది కాదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఉదయం విఠలేశ్వరుని దర్శనం, ఇప్పుడు తుల్జా భవాని దర్శనం తనకెంతో ఆనందాన్నిస్తుందని, ఇది తమకు దక్కిన అదృష్టంగా సిఎం పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వం 35 లక్షలకు చేరుకుంటుంది
బిఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ…. తాము ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశామని, ఈ దేశంలో ప్రకృతి వనరులు సకల సంపదలు ఉన్నాగాని, దేశ రైతాంగం ప్రజలు సాగునీరు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు లేక కష్టాలు పడుతున్నారని, ఈ పరిస్థితులలో మార్పు తేవడానికి బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవరు ఇవ్వని రైతురాజ్య స్థాపన నినాదాన్ని బిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిందని సిఎం గుర్తు చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెనా ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. గ్రామీణ కమిటీల్లో ఇప్పటికే 11 లక్షల మంది సభ్యులుగా చేరారని, రానున్న కాలంలో వారి సంఖ్య 35 లక్షలకు పైగా చేరుకుంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో టిఆర్‌ఎస్ వ్యాపిస్తుందని, గ్రామ గ్రామాన 9 కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ దేశంలోని ప్రజలు, రైతాంగం తమ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారని, అందులో భాగంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని కిసాన్ సర్కారును స్థాపించుకుంటారనే సంపూర్ణ విశ్వాసం తనకున్నదని స్పష్టం చేశారు.
మేము ప్రజల దగ్గరికి వెళుతున్నాం…వారి తీర్పును కోరుతున్నాం
బిఆర్‌ఎస్ ను ఎ టీం, బి టీం అని అంటున్నారని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… ఇటువంటి విమర్శ చేసే వాళ్ల అభద్రతాభావానికి, ఓర్వలేని తనానికి ఈ విమర్శ నిదర్శనంగా సిఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, తాను ఎవరి పేరు తీసుకోలేదు, ఎవరినీ విమర్శించట్లేదని, వీళ్లకు దేనికి బాధ..? అని, వీళ్ళకి ఎందుకు ఆక్రోషం..? అని ప్రశ్నించారు. ఏ పార్టీకి అధికారం ఇచ్చినా అది ప్రజలు ఇచ్చిందే అని పేర్కొన్నారు. తాము ప్రజల దగ్గరికి వెళుతున్నాం… వారి తీర్పును కోరుతున్నామని తెలిపారు. ఈ దేశంలో భిన్నమైన ఆలోచనలు చేయకపోతే.. మార్పు దిశగా ఈ దేశం పయనించకపోతే.. సంక్షేమం అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న బొగ్గుని, విద్యుత్తు ఉత్పాదన కోసం.. నదీ జలాలను సాగునీరు తాగునీరు కోసం.. ఇంకా అనేక సహజ వనరులను సంపదను దేశ ప్రజల సంక్షేమం కోసం వినియోగించుకునే ఆలోచన ఔట్ ఆఫ్ ది బాక్స్ దృక్పథం ఈ దేశంలోని కేంద్ర పాలకులకు లేకపోవడమే అసలు సమస్య అని సిఎం సమాధానం ఇచ్చారు.
చర్చించాల్సిన విషయాలను పక్కకు పెట్టి అనవసరమైన విషయాలను చర్చించి ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్ చేసే విమర్శలను పట్టించుకోబోమమని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల ఆత్మహత్యలు లేని భారతదేశమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ద్వారా తమ లక్ష్యాన్ని సాధిస్తామని, తాము దేశ ప్రజల ఆధరాభిమానాలు చూరకొంటామని సిఎం కెసిఆర్ పునరుద్ఘాంటించారు.
బిఆర్‌ఎస్ లోకి భారీగా ‘మహా’ నేతలు
బిఆర్‌ఎస్ పార్టీ విధానాలు, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదానికి ఆకర్షితులై దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మహారాష్ట్రలోని పండరిపూర్‌లో మంగళవారం జరిగిన బిఆర్‌ఎస్ బహిరంగ సభలో పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ సమక్షంలో పండరిపూర్ ఎస్‌సిపి నేత భగీరథ్ బల్కేతోపాటు పలువురు ముఖ్యనేతలు బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో అదితి యాదవ్, ప్రశాంత్ షిండె, సామధాన్ పాటే, నితిన్ భగల్, మేజర్ విలాస్ భోస్లే, తానాజీ చవన్, బిబిషన్ జాదవ్, వెంకటన్న బాల్కే, అనంత్ భోస్లే, సంతోష్ భోస్లే తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News