Saturday, May 4, 2024

రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Rajya Sabha candidates announced by CM KCR

మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ రెండు రాజకీయ పార్టీలు పోటీలుపడి బహిరంగ సభలు పెడుతూ, వేదికలపై అర్ధంలేని విమర్శలను, రాజకీయ అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ఏడు దశాబ్దాలుగా ప్రజలిచ్చిన అవకాశాలను అపహాస్యం పాలు చేసింది చాలక, ప్లీజ్… ప్లీజ్ ఒక్కసారి అవకాశమివ్వండని జనాలను విసిగిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పలుమార్లు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు గతం మరిచి మళ్ళీ తెలంగాణ సమాజానికి అరచేతిలో వైకుంఠం చూపెట్టాలని చెమటోడ్చుతుండటం విడ్డూరంగా ఉంది.
వ్యవస్థీకృత శక్తులుగా మారిన ఈ రెండు రాజకీయ పార్టీలు దశాబ్దాల పాటు ఆచరించిన హృదయం లేని రాజకీయాల కారణంగా, చలనశీలతను అడ్డుకొని, అన్ని రంగాల్లో యధాతథస్థితిని కాపాడాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో నాయకత్వాలు ప్రదర్శించిన అలసత్వం వల్ల దేశంలో సామాజిక, ఆర్ధిక అంతరాలు “ఇంతింతై వటుడింతై” అన్నట్లుగా పెరిగిపోయాయి. దేశ రాజకీయ వ్యవస్థలో ఈ రెండు శక్తుల గుత్తాధిపత్యం అంతిమంగా ఓటరులను వీధులపాలు చేసింది. జనాలను నినాదాలకు వేలాడదీసి, హక్కుగా పొందాల్సిన వాటి కోసం సహితం ప్రాణం పెట్టి పోరాడాల్సిన దిక్కులేని స్థితికి నెట్టిపడేశారు. పరిపాలనా విభాగానికి, సామాన్య మానవుడికి మధ్య నిత్యఘర్షణ కొనసాగేలా భారతదేశ నుదిటి రాతను తిరగరాశారు. జాతి ఐక్యత, ఉమ్మడి అభివృద్ధి కోసం, స్పష్టమైన లక్ష ్యం, కార్యాచరణనే గీటురాయిగా నడిపించాల్సిన ప్రభుత్వ పాలనా విభాగాలను, సంకుచిత, స్వంత ఎజెండాల అమలుకు వాడేసుకున్నారు. దాని ఫలితమే వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలలో భారతదేశం తిరోగమన దిశగా అడుగులు వేస్తున్నది.
ఇప్పటికీ దేశ జనాభాలో దాదాపు అరవై శాంతి మందికి జీవనాధారమైన, శ్రామిక శక్తిలో అధికభాగం నిత్యం నిమగ్నమై ఉండే, ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని ఏలిన పాలకులు ఎటువైపు నడిపించారో, గ్రామీణ భారతదేశాన్ని పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. భూ సంస్కరణలను బోల్తా కొట్టించారు. పంచవర్ష ప్రణాళికలను పక్కదారి పట్టించి, ప్లానింగ్ కమిషన్ ఊపిరి తీసి, విత్తనం పంటను కనడానికి పురిటి నొప్పులకు మించిన ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. దేశ జిడిపిలో దాదాపు 14% ఆదాయం సమకూర్చే సాగు రంగాన్ని సమస్యల సుడి గుండంలోకి నెట్టేశారు. శీతోష్ణ స్థితి, నేలల స్వభావం, నీటి లభ్యత తదితర అంశాలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు, శాస్త్రీయ అంచనాలు చేసి, ఆమేరకు పంటల సాగుపై రైతాంగాన్ని సింసిద్ధులను చేసే కార్యాచరణ పట్ల పట్టింపేలేదు. ఖరీఫ్, రబీ, జయాద్, పంట కాలాల్లో సాంప్రదాయ ఆహార ధాన్యాల సాగుతో పాటు ప్రపంచ మార్కెట్ అవసరాల మేరకు వాణిజ్య పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి అవసరమయ్యే పాలనా సంస్కరణల అమలుకు దేశాన్నేలిన పాలకులకు చేతులే రాలేదు. కనీస మద్ధతు ధర, పెట్టుబడి సహాయం, బ్యాంకింగ్ సేవలు, నూతన సాంకేతికత, మార్కెటింగ్ సదుపాయాలు తదితర సాగు రంగానికి ఆసరాగా నిలిచే మానవీయ పరిపాలనా చేతలే మృగ్యమయ్యాయి. చెవులండీ వినలేని, కళ్ళుండీ చూడలేని, చేతులుండీ అందించలేని, హృదయంలేని పాలనా వ్యవస్థను దేశ ప్రజల మీద బిజెపి, కాంగ్రెస్ పాలకులు రుద్దారు. జై కిసాన్ నినాదాన్ని గాలికొదిలి, కార్పొరేట్ జిందాబాద్‌ను నిత్యం గానం చేస్తున్నారు. అందువల్లే ఏడున్నర దశాబ్దాలుగా రైతు కంటనీరు ఆగడమే లేదు. ఇక పారిశ్రామిక రంగంలో ప్రగతి “తాతల నాటి ఆస్తులు తెగనమ్మి కులికే వివేకం లేని వారసుల” తీరుగా ఉన్నది. ఎయిర్‌లైన్స్‌ను వదిలించుకొని, బిఎస్‌ఎన్‌ఎల్‌ను బలిచేసి, ఎల్‌ఐసిని అమ్మేసి, రైల్వేలను వేలానికి సిద్ధం చేసి, బొగ్గు, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తిని ఇతరులకు ఇచ్చేసి “ఉత్త చేతుల భిక్షపతి”లా మారిపోతున్న కేంద్ర ప్రభుత్వం తీరు ఆవేదన కలిగించక మానదు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల పట్ల సమాన దృష్టి సారించి, ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌కు అనుసంధానించే నైపుణ్యం కొరవడిన పాలకుల వల్ల దేశంలోని పని చేసే చేవ కలిగిన చేతులు “గాల్లో దీపం పెట్టి మొక్కుతున్నాయి. ఐటి, బ్యాంకింగ్, న్యాయ తదితర రంగాల్లో దేశంలో అపారంగా అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులనైనా ఆరోగ్యకర రీతిలో ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే లేదు. ఫలితంగా సేవల రంగం సహితం పడుతూ, లేస్తూ చచ్చి బతుకుతున్నది. అపారమైన ఖనిజ వనరులు, అవసరాలకు మించిన నీటిలభ్యత, నైపుణ్యత కలిగిన మానవ వనరులు దేశంలో అందుబాటులో ఉన్నా ఉపయోగంలోకి తీసుకొచ్చే బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వాన్ని భారతదేశం ఎంచుకోకపోవడం వల్లనే ఈనాటికీ గ్రామాలు దుఃఖాన్ని దిగమింగుకొని బతుకులు ఈడుస్తున్న దుస్థితి.
ఇప్పటికైనా ఈ భారతదేశం వెలుగు పూల తొవ్వను వెతుక్కోకపోతే ఎలా..? తడబడుతూ, భయపడుతూ కాళ్ళు ముడుచుకొని నిద్ర నటించడాన్ని చీల్చుకొని కదలాలి కదా. కాలం కట్టిన గంతలు తీసి, కాంతుల వెల్లువ గంతులు వేయాలి కదా. ఆ దిశగానే నేడు కెసిఆర్ బెదిరింపుల భూతానికి, వెయ్యి తలల రాకాసికి ఎదురుగ్గా దేశం అవసరమై నిలబడ్డాడు. సాధారణ, సాంప్రదాయ రాజకీయాల వరద పేర్చిన రాజకీయ బురదలో పుష్పించిన కమలం కాడు కెసిఆర్, జమ చేసిన గుంపులో వెనక నుండి ఎవరో నూకితే ఎత్తిన చెయ్యి కాదు కెసిఆర్, నేల తల్లి నొప్పులకు విముక్తి గీతమై, కోట్లాది జనాన్ని ఏకోన్ముఖంగా నడిపి, నూతన చరిత్రను ఎత్తిపట్టిన రాజకీయ చైతన్యం కెసిఆర్. ఆ నాయకుడే నేడు దేశంలో తలలు కాదు… తలరాతలు మారాలనే ప్రత్యామ్నాయ ప్రజా ఎజెండాను ఎత్తుకున్నాడు.
జలదృశ్యంలో జెండాగా కెసిఆర్ ఒక్కడే నిలబడ్డనాడు కూడా ఆంధ్రలో ఎక్కువ సీట్లు, తెలంగాణలో తక్కువ ఎంఎల్‌ఎ, ఎంపి సీట్లు వాదన ముందేసి, రాజకీయ పోరాటంతో తెలంగాణ సాధ్యం కాదన్నారు. కానీ ‘పట్టుబట్టకరాదు… పట్టి విడువరాదు/ పట్టి విడుచకంటే… పడి చచ్చుట మేలు” అనే పద్యాన్ని బహిరంగ సభలలో ప్రజలందరికీ నూరిపోయడంతో పాటు, తానూ మనసా, వాచా ఆచరించి, రాదనుకున్న రాష్ట్రాన్ని సాకారం చేశాడు. మనుషులను మాయం చేసే యమకింకరులు, మూటల ధనం కుప్పేసుకున్న రాజకీయ కుబేరుల కుంభ స్థలాలను గురి చూసి కొట్టలేదా..? కులం, ధనం, పెట్టుబడిదారీతనం గులాబీ జెండా ముంగిట చేతులు కట్టుకొని మోకరిల్లేలా చేయలేదా..? తల్లడిల్లుతున్న తెలంగాణకు విముక్తి కల్పించ లేదా..? నిప్పుల వంతెన మీద నడిచి గమ్యం ముద్దాడడం తెలిసిన వాడు కెసిఆర్. కాలం కంటున్న కలను కనిపెట్టి, ఊతమై నిలిచే నేర్పును, రాజకీయ గుణంగా అలవాటు చేసుకున్న నాయకుడు కెసిఆర్. ఆ నాయకుడి పట్టుదలే నేడు తెలంగాణను స్వల్పకాలంలో అన్ని రంగాల్లో గర్వించే స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు కూడా 17 పార్లమెంట్ స్థానాలతో ప్రత్యామ్నాయ ఎజెండా ఎలా సాధిస్తారనే వారికి తెలంగాణ చరిత్రనే, కెసిఆర్ విజయతీరాలకు చేర్చిన కార్యాచరణనే సమాధానం.
రాజ్యాంగ విలువలను కాలరాస్తూ సామాజిక అనుబంధాల మీద దాడి చేస్తూ దేశాన్ని విపత్కర స్థితిలోకి తోసేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం నలుమూలల నుంచీ బుద్ధి జీవులు దారి దీపం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాజకీయ ఆకాంక్షలను గుర్తించి కదులుతున్న రాజకీయ నాయకుడు కెసిఆర్. ఒక ఉన్నత సంకల్పం వెంట అడుగులు వేయకుండా ఉండటానికి “దేశం గొడ్డుపోలేదు కదా…!” మోడీ, అమిత్ షాలు ఎన్ని సార్లు తెలంగాణకు వచ్చి పాత ప్రసంగాలే తిప్పి తిప్పి అరిచి చదివి, నెత్తీ, నోరు మొత్తుకున్నా, తెలివైన తెలంగాణ మోసపోదు. దిగజారుడు మాటల మోజులోపడి తెలంగాణ సమాజం ‘జేబులో రూపాయిని రోడ్డుపై పారేసుకోదు. కెసిఆర్‌పై వాళ్ళెంత నోరు పారేసుకున్నా, రేపటి చరిత్రను నిర్మించకుండా కెసిఆర్ విశ్రమించడు. కవి సిరివెన్నల రాసినట్లు “మొదటి చినుకు సూటిగా దూకి రానిదే, పొంగుచాటుగా వొదిగి దాగితే, వాన రాదుగా నేల దారికీ… ప్రాణమంటూ లేదుగా బతకడానికీ… ఎవరో ఒకరు… ఎప్పుడో అప్పుడూ… నడవరా ముందుగా… అటో, ఇటో, ఎటోవైపు….”

డా. ఆంజనేయ గౌడ్ (రాష్ట్ర మాజీ
బిసి కమిషన్ సభ్యులు)
9885352242

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News