Monday, April 29, 2024

సెక్స్ వర్కర్లకు రక్షణ

- Advertisement -
- Advertisement -

Special article about quad summit in tokyo సమూహం సమాజంగా స్థిరపడిన క్రమంలో ఎన్నో కట్టుబాట్లు, ఆంక్షలు రూపొందాయి. స్త్రీ, పురుషుల మధ్య ఆదిలో వున్న సమానత్వం ముందుగా అందుకు బలైంది. ఆమెను అదుపాజ్ఞలలో పెట్టుకోడానికి పురుషాధిపత్య సమాజం ఇష్టావిలాసంగా పరిమితులు విధించింది. మహిళ ఒకే పురుషుడితో కాపురం చేయాలనే నిబంధన కఠోర శాసనంగా పాలించడం మొదలుపెట్టింది.అదే ఇప్పటి సంసార జీవన చక్రానికి ఇరుసుగా స్థిరపడింది. అయితే పురుషుడి విచ్చలవిడి లైంగిక అవసరాలను అది సంతృప్తి పరచలేకపోయింది. పర్యవసానంగా దేవదాసి, జోగిని వంటి వ్యవస్థలను మగవాడు సృష్టించుకున్నాడు.

ఆ విధంగా రూపుదాల్చుకున్న వ్యభిచారం అతి పురాతన వృత్తిగా గుర్తింపు పొందింది. ఆ వృత్తిలో మగ్గుతూ ఆత్మాభిమానం కోల్పోయి వెలి బతుకులు బతుకుతున్న స్త్రీల గురించి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత కాలం వరకు మన పెద్దలు, రాజ్యాంగ సారథులు బొత్తిగా పట్టించుకోకపోడం మన ప్రజాస్వామ్య డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నది. అతి పవిత్రతకు ప్రాధాన్యమిస్తున్నట్టు గొప్పలు చెప్పుకున్న మన ప్రాచీన సమాజం శ్రామిక, సేవక వృత్తులను నీచంగా చూసి అందులోని వారిని అణచివేస్తూనే వారిని పలు విధాలుగా దోచుకున్నది. ప్రజాస్వామ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వారిని నీచంగా చూస్తున్నది. ఇలా తక్కువ వారుగా పరిగణన పొందుతున్న కింది స్థాయి సమూహాల్లో, వృత్తుల్లో వ్యభిచార రంగం స్త్రీలు అట్టడుగున వున్నారు. ఇంత కాలానికి దేశ అత్యున్నత న్యాయస్థానం వీరిపై దృష్టి సారించడం అమిత సంతోషదాయకమైన పరిణామం. న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, బిఆర్ గవాయ్, ఎఎస్ గోపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం దేశంలో సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణకు తగిన సూచనలిస్తూ గురువారం నాడు ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రలో ప్రత్యేకమైనవిగా నిలిచిపోతాయి. ప్రజాస్వామిక చట్టం ప్రకారం సెక్స్ వర్కర్లు ఇతరులందరితో సమానమైన రక్షణ, గౌరవం పొంది తీరాలని ధర్మాసనం ప్రకటించింది.

పోలీసులు వారిని వేధించడం గాని, శిక్షలు విధింపజేయడం గాని జరగరాదని, వారు చేసే ఫిర్యాదులను తప్పనిసరిగా పరిశీలనకు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. లైంగిక దాడికి గురైన సెక్స్ వర్కర్లకు, అత్యాచారానికి దొరికిపోయే మహిళలకిచ్చే రక్షణలన్నింటినీ కల్పించి వారి ఫిర్యాదుపై పోలీసులు చర్య తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. రాజ్యాంగం 21వ అధికరణ ప్రకారం ఈ దేశంలో ప్రతి వ్యక్తికీ గౌరవప్రదమైన జీవన హక్కు వుందని, అది సెక్స్ వర్కర్లకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిని బట్టి వ్యభిచారాన్ని చట్టబద్ధ వృత్తిగా అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందని భావించాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన చట్టాన్ని తీసుకొచ్చే వరకు తన ఆదేశాలు అమల్లో వుంటాయని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. దేశంలో వ్యభిచార వృత్తి ఎన్ని రకాల ఆంక్షల మధ్య సాగుతుందో తెలిసిన విషయమే. సభ్యసమాజం బొత్తిగా అంగీకరించదు కాబట్టి వారు ఊరికి దూరంలో, అపరిశుభ్ర పరిసరాల్లో తమ వృత్తిని సాగిస్తుంటారు. గూండాలు, పోలీసుల భయంతో అనుక్షణం గుండెలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతుంటారు.

వారి పరిసరాల్లోని అపరిశుభ్రత కారణంగా ఎయిడ్స్ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం పొంచి వుంటుంది. ముంబై, కోల్‌కతా వంటి మహా నగరాల్లో రెడ్‌లైట్ ఏరియాల పేరుతో వారికి కొంత వెలుసుబాటు కల్పించినప్పటికీ అక్కడ కూడా పోలీసుల దౌర్జన్యం నిరాఘాటంగా సాగిపోతూనే వుంటుంది. భారత శిక్షాస్మృతి ప్రకారం వ్యభిచారం నేరం కాదని చెబుతున్నప్పటికీ దానిని ఆనుకొని సాగడానికి అవకాశమున్న అనేక చర్యలపరంగా అది నేరంగానే పరిగణన పొందుతున్నది. అందుచేత సుప్రీంకోర్టు గురువారం నాడిచ్చిన ఆదేశాలు ఈ రంగంలోని మహిళలకు రక్షణ కల్పించి వారికి సర్వసమానత్వాన్ని ప్రసాదిస్తాయని ఆశించవచ్చు. సుప్రీం ఆదేశాల మేరకు సమాజం వారిని సమాన దృష్టితో చూడకపోయినప్పటికీ పోలీసులు, గూండాలు, దుర్మార్గులైన విటులు తదితరుల దాడుల నుంచి వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత చట్టంపై వుంటుంది.

పోలీసులు దానిని గౌరవించి నడుచుకోక తప్పుదు. ఒక స్త్రీ వ్యభిచార వృత్తిని ఆశ్రయించిందంటే ఆమె తట్టుకోలేని దుర్భర దారిద్య్రాన్ని అనుభవించిందని అర్థం. దేశంలో 20 లక్షల మంది సెక్స్ వర్కర్లు వుంటారని ఒక అంచనా. వాస్తవంలో ఇంతకంటే అధికంగానే వుండవచ్చు. వ్యభిచారం ప్రపంచమంతటా వేళ్లూనుకున్నదే. యుద్ధాల్లో బ్రిటన్, జర్మనీ వంటి దేశాలే తమ సైనికులకు సెక్స్ వర్కర్లను సమకూర్చాయని చరిత్ర చెబుతున్నది. జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, గ్రీస్ వంటి దేశాలు వ్యభిచారాన్ని చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించి చాలా కాలమైంది. ఎవరు ఏ వృత్తి చేసినా వారి జీవన హక్కుకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూడడమే న్యాయం, మానవీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News