Wednesday, May 1, 2024

భారత మాత ప్రియ పుత్రుడు ప్రణబ్: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ దేశం శిఖరసమానమైన రాజకీయ నాయకుడిని కోల్పోయిందని, అర్ధశతాబ్దం పాటు భారత రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన కర్మయోగి ప్రణబ్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ప్రణబ్  సంతాపం తీర్మానాన్ని కెసిఆర్ ప్రవేశపెట్టిన  సందర్భంగా మాట్లాడారు.    1970 తరువాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ పేరు లేని పేజీ ఉండదంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రణబ్ ముఖర్జీని అందరూ ఆత్మీయంగా దాదా అని పిలుచుకుంటారని, క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు.

ప్రణబ్ చిన్నప్పుడు స్కూలుకు వెళ్లేటప్పుడు చిన్నవాగును కూడా దాటి వెళ్లేవారని, గొప్ప నేతగా ఎదిగిన తరువాత రాజకీయ సముద్రాన్ని ఈదారని, భరతమాత ప్రియుపుత్రిడిగా చరిత్రకెక్కారని ప్రశంసించారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా ప్రణబ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని, మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్‌గా ప్రణబ్ గుర్తింపు పొందారని, కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారని, భారత దేశ ఆర్ధిక చరిత్రను ఆ మూలాగ్రం అధ్యయనం చేశారని, చేపట్టిన ప్రతీ పదవికీ వన్నె తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడు ప్రణబ్ అని కెసిఆర్ కొనియాడారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ పేరు ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ అభిప్రాయ కమిటీలకు సారధ్యం వహించారని, ప్రజల ఆకాంక్షను అర్ధం చేసుకొని పరిష్కారం కోసం అధిష్టానానికి మార్గనిర్దేశం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. అజాతశత్రువుగా నిలిచి తిరిగిరాని లోకాలకు వెళ్లారని బాధను వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News