Monday, April 29, 2024

కోహ్లీ దూకుడు ఇష్టమే కానీ..

- Advertisement -
- Advertisement -

Kohli should be within limits his Aggression: Farokh Engineer

లండన్: క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు విరాట్ కోహ్లీ దూకుడు ఇష్టమే అయినా అతడు అదుపులో ఉండాలని మాజీ కీపర్, బ్యాట్స్‌మన్ ఫరూక్ ఇంజనీర్ సూచించాడు. అనవసర విషయాలకు వెళ్లి పరిస్థితులు చెయ్యి దాటిపోయేలా చేసుకోకూడదన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పోరు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు పలు సందర్భాల్లో తమ నోటికి పని చెప్పారు. దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అంతే దీటుగా సమాధానమిచ్చాడు. ఈ విషయంపైనే మాట్లాడుతూ ఫరూక్ ఇంజనీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రత్యర్థులతో దూకుడుగా ఉండే విషయంలో నేను కోహ్లీని ఎంతో ఇష్టపడతాను.

అతను ఓ స్ఫూర్తిదాయక సారథి. ఎల్లప్పుడూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఎవరైనా అలానే ఉండాలి. అయితే, అది పరిమితులకు మించి ఉండకూడదు. లేకపోతే అంపైర్లు లేదా మ్యాచ్ రిఫరీలు కలుగజేసుకుంటే వివాదం పెద్దదవుతుంది. అలానే విరాట్ తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ నాకు అతడి తీరు ముచ్చటేస్తుంది. అతడో మేటి సారథి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అతడు’ అని ఫరూక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు కవ్వింపులకు దిగారని, దాంతో భారత బ్యాట్స్‌మెన్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూశారని ఫరూక్ ఇంజనీర్ పేర్కొన్నాడు. అయితే బుమ్రా, షమీ అద్భుతంగా ఆడి దీటుగా జవాబిచ్చారన్నాడు.

Kohli should be within limits his Aggression: Farokh Engineer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News